Kondapalli Ganesh: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని అత్యంత విలాసవంతమైన ‘మైహోమ్ భుజా’ (My Home Bhooja) గేటెడ్ కమ్యూనిటీ. అక్కడ ఏటా జరిగే గణేశ్ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మికతకే కాదు, కోటీశ్వరుల హోదా ప్రదర్శనకు కూడా ఒక వేదిక. సరిగ్గా మూడేళ్ల క్రితం వరకు ఆ కమ్యూనిటీలో ఒక సాదాసీదా వ్యాపారిగా తిరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన కొండపల్లి గణేష్ (Kondapalli Ganesh), ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారాడు. కారణం—వినాయకుని లడ్డూ వేలంలో (Laddu Auction) రికార్డు స్థాయి ధరలు పలకడం.
గతంలో రూ. 29 లక్షలకు లడ్డూను దక్కించుకున్న గణేష్, ఆ తర్వాత రూ. 51.07 లక్షల అత్యధిక ధరతో లడ్డూను పాడుకుని నగరవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక బాలాపూర్ లడ్డూ రికార్డులను కూడా అధిగమిస్తూ, ఒక గేటెడ్ కమ్యూనిటీలో రూ. 51 లక్షలకు పైగా లడ్డూ పాట (Laddu Auction) పాడటంతో అతన్ని అందరూ ఒక బిగ్ షాట్‌గా, సక్సెస్ ఫుల్ రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారిగా భావించారు. లడ్డూను గెలుచుకోవడమే కాకుండా, అపార్ట్మెంట్లోని ప్రతీ ఇంటికీ ఆ లడ్డూ ప్రసాదాన్ని స్వయంగా పంపిణీ చేసి అందరి నమ్మకాన్ని, సానుభూతిని చూరగొన్నాడు.
అయితే, ఆ రూ. 51 లక్షల లడ్డూ వెనుక ఉన్నది భక్తి కాదు… అదొక పక్కా స్కెచ్ అని ఎవరూ ఊహించలేకపోయారు.
నమ్మకం వల.. వడ్డీ ఆశ!
లడ్డూ వేలంతో వచ్చిన మైలేజ్, ఇమేజ్ను గణేష్ తన ఆర్థిక నేరాలకు పక్కాగా వాడుకున్నాడు. తన సహచరుడు బోయినపల్లి కిరణ్‌తో కలిసి అపార్ట్మెంట్లోని ధనవంతులు, విశ్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నాడు. “మా దగ్గర రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారాల్లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో పెట్టుబడి పెడితే నెలకు ఏకంగా 6 శాతం రాబడి (వడ్డీ) ఇస్తాం. ప్రతి మూడు నెలలకు లాభాల వాటా మీ చేతికి వస్తుంది” అంటూ ఆశ చూపించాడు.
లడ్డూనే రూ. 51 లక్షలకు కొన్న కోటీశ్వరుడు, పైగా సొంత అపార్ట్మెంట్ వాసి కావడంతో పలువురు అతని మాటలను గుడ్డిగా నమ్మేశారు. ఈ క్రమంలోనే అపార్ట్‌మెంట్‌కు చెందిన సిల్వియా – శ్రీనివాసరెడ్డి దంపతులు విడతల వారీగా రూ. 31 లక్షలు పెట్టుబడి పెట్టగా, మొదట రూ. 11 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత బొత్స అప్పలనాయుడు, సి. శ్రీకృప, జి. నాగహరీష్, సముద్రాల రవిశంకర్, సముద్రాల సారిత వంటి పలువురు ప్రముఖులు, విశ్రాంత ఉద్యోగులు తమ జీవితకాల కష్టార్జితాన్ని గణేష్ చేతిలో పెట్టారు.
కథ అడ్డం తిరిగింది.. సీన్ కట్ చేస్తే!
కొద్దిరోజుల వరకు బాగానే ఉన్నా, ఆ తర్వాత నుంచి అసలు డ్రామా మొదలైంది. లాభాల మాట దేవుడెరుగు, అసలు డబ్బులు తిరిగివ్వాలని బాధితులు ఒత్తిడి చేయడం ప్రారంభించగానే గణేష్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ, ఫోన్లు తీయడం బంద్ చేశాడు. బాధితులకు అనుమానం వచ్చి మైహోమ్ భుజాలోని అతని ఫ్లాట్‌కు, ఆఫీసుకు వెళ్లేసరికి సీన్ రివర్స్ అయింది. గణేష్, అతని అనుచరుడు కిరణ్ ఇద్దరూ ఏప్రిల్‌లోనే ఇళ్లను ఖాళీ చేసి, గచ్చిబౌలిలోని మరో రహస్య ప్రాంతానికి జారుకున్నట్లు తేలింది.
ఆరా తీయగా కొండపల్లి గణేష్ (Kondapalli Ganesh) ఏకంగా ఐదుగురి కంటే ఎక్కువ మంది నుంచి రూ. 3.45 కోట్లకు పైగా వసూలు చేసి పరారైనట్లు వెల్లడైంది. మోసపోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
దేవుడి ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని, మైహోమ్ భుజా (My Home Bhooja) లాంటి హై-ఎండ్ కమ్యూనిటీల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయలు కొట్టేసిన ఈ కిలాడీ గణేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసుల విచారణలో మరిన్ని బండారాలు, బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. లడ్డూ వేలం (Laddu Auction) బిల్డప్‌లతో సమాజంలో ఇమేజ్ పెంచుకుని, ఆపై కోట్లు ముంచేసే ఇలాంటి “హైటెక్ మోసగాళ్ల” పట్ల పెట్టుబడిదారులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
#KondapalliGanesh #MyHomeBhooja #HyderabadFraud #CyberabadPolice #GachibowliScam #EOWCyberabad #InvestmentFraud #LadduAuctionScam #CrimeNews #HyderabadNews #FraudAlert

A Passionate Telugu Writer Covering Politics, Public Voice, And Current Affairs With Clarity And Insight. Dedicated To Presenting Unbiased Perspectives Rooted In Truth And Regional Relevance. Believes In Giving A Voice To The People Through Powerful Storytelling And Factual Reporting.
















