NewsDabba

Revanth Reddy: దమ్మున్న నాయకుడి దిమ్మతిరిగే వ్యూహం!

Revanth Reddy: నాయకుడంటే ఎవరు? ప్రజాభిప్రాయాన్ని బట్టి తన రంగులు మార్చేవాడా? ఓట్ల వేటలో సిద్ధాంతాలను తాకట్టు పెట్టేవాడా? లేక… ప్రాంతీయ అంధకారం, కుల రాజకీయాల కంచెలను దాటుకుని, ఇచ్చిన మాట కోసం గుండె ధైర్యంతో అడుగు ముందుకు వేసేవాడా?

సమకాలీన రాజకీయ కురుక్షేత్రంలో… విమర్శల తూటాలు పేలుతున్నా, ప్రాంతీయ వాదపు సెగలు భయపెడుతున్నా… ‘నేను అనుకున్నది చేస్తా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా’ అని నిరూపించిన ధీశాలి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy)!

హైదరాబాద్ నడిబొడ్డున… అమీర్‌పేట్ (Ameerpet) చౌరస్తా సాక్షిగా, తెలుగుజాతి గర్వించదగ్గ మహానాయకుడు నందమూరి తారకరామారావు విగ్రహాన్ని (NTR State) ఆవిష్కరించి, రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు. ఇది కేవలం ఒక విగ్రహావిష్కరణ కాదు… భయపడే రాజకీయాలకు కాలం చెల్లిందని, గుండె నిండా ‘దమ్ము’న్న నాయకుడి శకం మొదలైందని చాటిచెప్పిన పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్!

Sindhu Hospital - Bandi Parthasarathi Reddy
Sindhu Hospital: మూడు పార్టీల ‘సింధు హాస్పిటల్’!

ప్రాంతీయ ద్వేషపు కంచెలను తెంచిన సాహసం

తెలంగాణలో (Telangana) ఒకప్పుడు ప్రాంతీయ వాదం పతాక స్థాయికి చేరింది. సీమాంధ్రులపైన, ఆంధ్రా పాలకులపైన విపరీతమైన ద్వేషాన్ని నూరిపోసి, రాజకీయ పబ్బం గడుపుకున్న నాయకులెందరో ఉన్నారు. “హైదరాబాద్‌లో మీకేం పని? సీమాంధ్రులకు తెలంగాణలో ఏం హక్కు ఉంది?” అంటూ కొందరు సంకుచిత తెలంగాణవాదులు నిప్పులు కక్కుతున్న తరుణమిది. ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో, అది కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటూ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ‘వాడేదో అనుకుంటాడు.. వీడేదో అనుకుంటాడు’ అని లెక్కలేసుకోలేదు రేవంత్. తెలంగాణవాదులు తిట్టుకుంటారని భయపడలేదు. కులాలు, ప్రాంతాల సరిహద్దులను చెరిపేస్తూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీసుకున్న ఈ నిర్ణయం ఆయన గుండె గట్టిదనాన్ని, రాజకీయ సాహసాన్ని స్పష్టం చేస్తోంది.

ఎన్టీఆర్ (NTR) ఒక మహోన్నత శక్తి

ఈ చారిత్రక ఘట్టాన్ని అర్థం చేసుకోవాలంటే ఎన్టీఆర్ (NTR) అనే మహోన్నత శక్తిని, ఆయన రాజకీయ నేపథ్యాన్ని ఒక్కసారి స్మరించుకోవాలి. 1982లో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభంజనం సృష్టించిన నటుడు, నాయకుడు ఎన్టీఆర్. పటేల్-పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, వెనుకబడిన వర్గాలకు రాజకీయ అధికారాన్ని కట్టబెట్టి, హైదరాబాద్‌ను మహానగరంగా తీర్చిదిద్దే పునాదులు వేసింది ఆయనే. రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నట్లు… ఎన్టీఆర్ కేవలం ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, ఇందిరమ్మల సరసన నిలబడదగ్గ జాతీయ స్థాయి ఐకాన్. అలాంటి మహానాయకుడికి ప్రాంతీయ ముద్ర వేయాలని చూసిన సంకుచిత మనస్తత్వాలకు రేవంత్ రెడ్డి తన చర్య ద్వారా గట్టి చెంపదెబ్బ కొట్టారు.

రాజకీయ కృతజ్ఞత వర్సెస్ కన్నతల్లి లాంటి పార్టీపై ద్రోహం

సమకాలీన రాజకీయాల్లో కృతజ్ఞత అనేది మచ్చుకైనా కనిపించని విలువైపోయింది. ఎన్టీఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో, తెలుగుదేశం పార్టీ అండతో రాజకీయాల్లోకి వచ్చి, అత్యున్నత పదవులు అనుభవించిన కేసీఆర్ లాంటి వాళ్లు… ఈరోజు కన్నతల్లి లాంటి టీడీపీని, ఎన్టీఆర్‌ను విమర్శించడానికి వెనకాడటం లేదు. పదవుల కోసం, అధికారం కోసం నాడు కాళ్లు పట్టుకుని, నేడు కాలదన్నే సంస్కృతి ఒకవైపు నడుస్తుంటే… రేవంత్ రెడ్డి మాత్రం భిన్నమైన పంథా తొక్కారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, తనకు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ సిద్ధాంతకర్తను గౌరవించడం రేవంత్ రెడ్డిలోని నైతిక విలువలకు, రాజకీయ సంస్కారానికి నిదర్శనం.

తెలంగాణవాదుల మేకపోతు గాంభీర్యాలపై నెగ్గిన ధీరత్వం

విగ్రహావిష్కరణ ప్రకటన రాగానే తెలంగాణలో కొందరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ రేవంత్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. విమర్శలు, ప్రతివిమర్శలతో సోషల్ మీడియా వేదికగా రచ్చ లేపారు. కానీ, రేవంత్ రెడ్డి లొంగిపోయే తత్వం కాదు. బెదిరింపులకు భయపడి వెనకడుగు వేసే నైజం ఆయనది కాదు. ప్రతిపక్షాల విమర్శలను, స్వపక్షంలోని కొందరి అసంతృప్తిని లెక్కచేయకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా, అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చూపించారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రులకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులకు “మీకు నేనున్నాను… ఎవరి భయపెట్టడాలకూ లొంగిపోవద్దు” అనే బలమైన భరోసానిచ్చారు.

Pawan Kalyan alliance strategy
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పొలిటికల్ మాస్టర్ క్లాస్!

రాజకీయ చాణక్యం – వ్యూహాత్మక విజయకేతనం

ఈ విగ్రహావిష్కరణ వెనుక రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసాధారణ రాజకీయ చాణక్యం దాగి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి నాయకుడూ ఓట్ల కోసం, కేవలం తక్షణ అధికారం కోసం అర్రులు చాస్తుంటారు. కానీ రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ధి కంటే కూడా ఇచ్చిన మాటకే ఎక్కువ విలువ ఇచ్చారు. అదే సమయంలో, ఈ ఒక్క అడుగుతో తెలంగాణలోని లక్షలాది మంది టీడీపీ సానుభూతిపరులను, సీమాంధ్ర ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పుకునేలా ఒక అద్భుతమైన రాజకీయ వ్యూహాన్ని అమలు చేశారు. వైరి పక్షాల విమర్శల ఆయుధాలనే తన విజయానికి పూలదండలుగా మార్చుకున్న రేవంత్ రెడ్డి రాజకీయ చాణక్యానికి అమీర్‌పేట్ వేదికై నిలిచింది.

ఇది కూడా చదవండి: Kerala Politics : కేరళ నేర్పుతున్న పొలిటికల్ పాఠాలేంటి?

రాజకీయాల్లో గెలవడం అంటే కేవలం ఎన్నికల్లో సీట్లు సాధించడం మాత్రమే కాదు… ప్రత్యర్థుల గుండెల్లో సైతం గౌరవాన్ని, సామాన్య ప్రజల్లో తిరుగులేని నమ్మకాన్ని సంపాదించడం. అమీర్‌పేట్ చౌరస్తాలో కొలువుదీరిన ఎన్టీఆర్ విగ్రహం కేవలం ఒక కాంస్య విగ్రహం కాదు… అది రేవంత్ రెడ్డి రాజకీయ ధీరత్వానికి, కృతజ్ఞతా భావానికి, పదునైన చాణక్యానికి సజీవ సాక్ష్యం!

విమర్శకులకు భయపడకుండా, కుల మత ప్రాంతాల కతీతంగా నిలబడ్డ రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న నేత… సమకాలీన రాజకీయాల్లో ఒక అరుదైన వ్యక్తిత్వం. చరిత్ర ఎప్పుడూ లొంగిపోయేవాడిని గుర్తుపెట్టుకోదు… ఎదురొడ్డి నిలిచేవాడినే సింహాసనంపై కూర్చోబెడుతుంది. రేవంత్ రెడ్డి గుండె చాలా గట్టిది..!

DCP Sumathi
CP Sumathi: ఐపీఎస్ ఆఫీసర్‌కే అర్ధరాత్రి వేధింపులు!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment