Veeranna: సినిమాల్లో డైరెక్టర్లు లాజిక్కులు గాల్లోకి వదిలేసి మ్యాజిక్ చేస్తుంటే “అరెరే… ఇదెక్కడి సినిమా రా బాబు!” అని నవ్వుకుంటాం. కానీ, నిజజీవితంలో తెలంగాణకు చెందిన ఓ పెద్దాయన వేసిన వేషం చూస్తే.. ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్లకే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
కథలోకి వెళ్తే… 1970ల చివర్లో జరిగిన ఒక హత్య కేసులో మన కథానాయకుడు సాందేల వీరన్నకు (Veeranna) 1983లో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష (లైఫ్ ఇంప్రైజన్మెంట్) విధించింది. జైలుకు (Jail) వెళ్లిన ఆరు నెలలకే “కాస్త అలా బయట తిరిగి వస్తా” అంటూ 1983లో పరోల్‌పై (Perole) బయటకు వచ్చాడు. అంతే… అటు నుంచి అటే ‘మిస్టర్ ఇండియా’ అయిపోయాడు! ఖైదీని పట్టుకోవాల్సిన మన నిఘా వ్యవస్థ, పోలీసులు మాత్రం ప్రశాంతంగా నిద్రపోయారు.
ఇది కూడా చదవండి: Freebies: ఉచిత పథకాలకు కళ్లెం వేయాల్సిన సమయమిదే!
ఇక్కడే సినిమాటిక్ ఇంటర్వెల్ బ్యాంగ్ పడింది. పరోల్ జంప్ చేసిన వీరన్న (Veeranna) అజ్ఞాతంలోకి వెళ్లి అడవుల్లో దాక్కోలేదు, భూగర్భంలోకి పోలేదు. దర్జాగా వెళ్లి ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి (Govt Teacher) దరఖాస్తు చేసుకున్నాడు. క్రిమినల్ రికార్డు దాచేసి, ఏకంగా ప్రభుత్వ బడి పంతులైపోయాడు! సాధారణంగా ప్రైవేట్ కంపెనీల్లో కూడా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్లు, పోలీస్ క్లియరెన్సులు ఉంటాయి. కానీ మన సర్కారీ యంత్రాంగం నిఘా ఎంత పకడ్బందీగా ఉందంటే… ఒక హత్య కేసు ముద్దాయి, జైలు నుంచి పారిపోయిన ఖైదీ అన్న సంగతి కలలో కూడా కనిపెట్టలేకపోయింది.
ఇక క్లాస్‌రూమ్‌లో అడుగుపెట్టిన వీరన్న (Veeranna) … “పిల్లలూ, తప్పు చేస్తే చట్టం ఊరుకోదు.. నిజాయితీగా బతకాలి” అంటూ నీతులు చెప్తూ నాలుగు దశాబ్దాల పాటు ఓనమాలు దిద్దించాడు. ఈ ట్విస్ట్ చాలదన్నట్టు, 2004లో ఆయన విద్యాసేవలకు మెచ్చి ప్రభుత్వం ఏకంగా ‘బెస్ట్ టీచర్’ (Best Teacher) అవార్డు ఇచ్చి సత్కరించింది! అటు జైలు రికార్డుల్లో ‘పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ ఖైదీ’… ఇటు పబ్లిక్ వేదికపై మెడలో శాలువా, చేతిలో ప్రభుత్వ అవార్డు! దీన్నే కదా ‘అల్టిమేట్ కవరింగ్’ అనేది!
ఇలా దర్జాగా మూడు దశాబ్దాలు టీచర్‌గా పాఠాలు చెప్పి, ఎలాంటి అనుమానం రాకుండా 2013లో సర్వీస్ పూర్తి చేసుకుని ఘనంగా రిటైర్ (Retired) కూడా అయిపోయాడు. ఒక కొడుకుని లండన్ పంపించాడు (ఆయన యూకేలో పర్మనెంట్ రెసిడెంట్). భార్య చారమ్మ కూడా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా దర్జాగా పెన్షన్ అనుభవిస్తూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు.
కానీ క్లైమాక్స్ లేకుండా సినిమా ఎలా ముగుస్తుంది? సరిగ్గా 40 ఏళ్ల తర్వాత… అంటే 2024 మే నెలలో తెలంగాణ జైళ్ల శాఖ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు హఠాత్తుగా మెలకువ వచ్చింది. దుమ్ము పట్టిన ఫైళ్లను దులిపి చూస్తే వీరన్న (Veeranna) అనే ఖైదీ 1983 నుంచి కనిపించడం లేదని గుర్తించారు. గాలించి చూస్తే.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఏడుపదుల వయసులో రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న వీరన్న దొరికాడు. వెంటనే ఆయన్ను అరెస్ట్ చేసి చర్లపల్లి సెంట్రల్ జైలుకు (Cherlapalli Central Jail) పంపించారు.
అక్కడితో కథ అయిపోలేదు! వీరన్న భార్య చారమ్మ నేరుగా హైకోర్టు మెట్లెక్కి.. “నా భర్తకు జబ్బులున్నాయి, గత 3 ఏళ్లుగా పరోల్ ఇవ్వడం లేదు.. 40 ఏళ్ల తర్వాత మళ్లీ జైలుకు పంపడం అన్యాయం” అంటూ పిటిషన్ వేసింది.
ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ టి. మాధవీ దేవి విస్తుపోయారు. “నేర చరిత్రను దాచిపెట్టి, 40 ఏళ్ల పాటు చట్టాన్ని బురిడీ కొట్టించి, ప్రభుత్వ ఉద్యోగం చేయడమే కాకుండా రిటైర్ అవ్వడం మీ తెలివితేటలకు నిదర్శనం” అంటూ పిటిషన్‌ను కొట్టివేశారు. ప్రభుత్వ న్యాయవాది మహేష్ రాజే వాదనలతో ఏకీభవిస్తూ.. చర్లపల్లి జైల్లోనే మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అదే సమయంలో, నాలుగు దశాబ్దాల పాటు ఒక ఖైదీని పట్టుకోలేకపోయిన జైళ్ల శాఖ చేతకానితనంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పరోల్ ట్రాకింగ్ కోసం మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది.
మొత్తానికి… జైలు నుంచి పారిపోయి, సర్కారీ కొలువు కొట్టి, బెస్ట్ టీచర్ అవార్డు గెలిచి, రిటైర్మెంట్ అయ్యాక మళ్లీ జైలు ఊచలు లెక్కపెడుతున్న వీరన్న (Veeranna) ‘జీవిత పాఠం’ నిజంగా ఒక అద్భుతమైన బ్లాక్‌బస్టర్ సినిమా కథే!
















