KTR: రాజకీయాల్లో ఉద్రిక్తతలు, సెంటిమెంట్లు ఏ స్థాయిలో ఉంటాయో మనకు తెలుసు. కానీ, 2009 నాటి ఒక రాత్రి సస్పెన్స్, మరుసటి రోజు ఉదయం జరిగిన ఒక ‘హై-వోల్టేజ్’ కామెడీ సీన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా బయటపెట్టారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ‘కార్టునిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు 2026’ వేదికగా ఆయన చెప్పిన ఈ కథ వింటే.. ఎవరైనా సరే ‘నవ్వాలో, భయపడాలో’ తెలియక జుట్టు పీక్కుంటారు!
సీన్ కట్ చేస్తే: నవంబర్ 2009
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ గులాబీ అధినేత ఆమరణ దీక్షకు దిగిన వేడి వేడి రోజులు అవి. కరీంనగర్ నుంచి బయల్దేరిన కేసీఆర్‌ను పోలీసులు అలగనూరు వద్దే లాక్కెళ్లిపోయారు. సీన్ చూసి షాకైన కేటీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ గారు వెంబడించినా లాభం లేకపోయింది. వరంగల్ కేయూ వద్ద విద్యార్థులతో కలిసి కేటీఆర్ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఊరుకుంటారా? ‘రా బాబూ రా’ అంటూ జీపు ఎక్కించారు. చౌరస్తాలో వ్యాన్ ఆగగానే సినిమా స్టైల్లో కిందకు దూకి జయశంకర్ సార్ ఇంట్లో దాక్కున్నా.. పోలీసులు వదల్లేదు. ‘తప్పించుకుని పారిపోయినందుకు సపరేట్ కేసు’ గిఫ్ట్‌గా ఇచ్చి జైల్లో పడేశారు.
ఇది కూడా చదవండి: Kadambari Jethwani : బాధితురాలా? నిందితురాలా? సీఐడీ సెన్సేషన్ రిపోర్ట్
అసలు ట్విస్ట్: చెట్టు కింద షేవింగ్.. పీక మీద కత్తి!
జైల్లో రాత్రంతా గడిచింది. జైలర్ గారు పాపం చాలా మర్యాదస్తుడు. ‘సెల్‌లో ఎందుకు సార్, హాస్పిటల్ రూమ్‌లో పడుకోండి’ అని ఆఫర్ ఇచ్చారు. పొద్దున్నే లేవగానే.. ‘చాయ్ తాగుతారా? గడ్డం గీసుకుంటారా?’ అని ఆతిథ్యం ఇచ్చారు. కేటీఆర్ కూడా హ్యాపీగా ‘సరే’ అన్నారు. ఒక పెద్ద చెట్టు కింద కుర్చీ వేసి కూర్చోబెట్టారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీని పిలిచి, చేతికి పదునైన కత్తి ఇచ్చి షేవింగ్ చేయమన్నారు.
సెలూన్‌కి వెళ్తే కాసేపు ముచ్చట్లు పెట్టడం అందరికీ అలవాటే కదా! ఆ ఖైదీ కత్తి తీసి కరెక్ట్‌గా కేటీఆర్ పీక మీద పెట్టాడు. వాతావరణాన్ని కాస్త తేలికపరుద్దామని కేటీఆర్ చాలా క్యాజువల్‌గా.. “ఏ ఊరు తమ్ముడూ మీది?” అని అడిగారు.
అవతలి నుంచి సింపుల్‌గా ఒక ఆన్సర్ వచ్చింది.. “మాది పులివెందుల సార్!”
గుండె గుభేల్.. ముచ్చట బంద్!
అంతే! ఆ మాట వినగానే కేటీఆర్ మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే.. అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయి కేవలం నాలుగు నెలలే అయింది. రాయలసీమలో వైఎస్సార్ సెంటిమెంట్ పీక్స్‌లో ఉంది. ఇటు చూస్తే కేసీఆర్ దీక్షతో తెలంగాణ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. పోనీ ఆ పులివెందుల సోదరుడు ఏ దొంగతనం కేసులోనో జైలుకి వచ్చాడా అంటే.. అదీ లేదు, పక్కా ‘మర్డర్ కేసు’!
ఒక మర్డర్ కేసు ఖైదీ.. చేతిలో పదునైన కత్తి.. ఆ ఖైదీ పులివెందుల వాడు.. ఆ కత్తి ఉన్నది ఎక్కడ? కరెక్ట్‌గా కాబోయే ఐటీ మినిస్టర్ పీక మీద!
“ఇక ముచ్చట బంద్ ఆడికి.. అప్పటికే కత్తి పీక మీద ఉంది, ఇంకేం మాట్లాడతాం? సైలెంట్‌గా ఉండిపోయాను” అంటూ కేటీఆర్ నాటి ‘ప్రాణసంకట’ క్షణాన్ని గుర్తుచేసుకుని నవ్వేశారు. అయితే ఆ ఖైదీ కూడా కేటీఆర్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూసి సైలెంట్‌గా నవ్వేసి.. “నాకు రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం సార్, అలాగని కేసీఆర్ అన్నా ఇష్టమే. నాలాగా గట్టిగా కొట్లాడేటోళ్లంటే నాకు చాలా ఇష్టం” అనడంతో కేటీఆర్ ప్రాణాలు లేచొచ్చాయి. ఆ దెబ్బతో షేవింగ్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది!
కార్టునిస్టుల లోకం.. గాంధీజీ మార్గం
రాజకీయాల్లో ఉంటే రోజువారీ రొటీన్ లైఫ్‌లో పడి నలిగిపోతుంటామని, అందుకే ఇలాంటి కవులు, ఆర్టిస్టుల మధ్యకు వస్తే మైండ్ రిలాక్స్ అవుతుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. లెజెండరీ కార్టునిస్ట్ ఆర్కే లక్ష్మణ్ సేవలను గుర్తుచేసుకుంటూ.. నేటి కార్టునిస్టులంతా ఆయనకు ఏకలవ్య శిష్యులేనన్నారు. పాలిటిక్స్‌లో గెలుపోటములు కామనే అని, ఉన్నంత కాలం ప్రజలకు మంచి చేయడమే ముఖ్యమని చెబుతూ.. దేశానికి ప్రస్తుతం గాంధీజీ సిద్ధాంతాలు ఎంతో అవసరమని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
















