Marital Rape: భారతీయ సమాజంలో వివాహాన్ని ఒక పవిత్ర బంధంగా భావిస్తాం. మరి అదే బంధం ఓ మహిళకు నరకయాతనగా మారితే? భర్త అనే ముసుగులో జరిగే లైంగిక హింసను (Marital Rape) నేరంగా పరిగణించలేమని ప్రభుత్వాలు వాదిస్తుంటే, చట్టం ముందు అందరూ సమానులే అనే రాజ్యాంగ హామీకి అర్థం ఏమిటి? ప్రస్తుతం సుప్రీంకోర్టు (Supreme Court) విచారిస్తున్న అత్యంత కీలకమైన, సున్నితమైన అంశం ఇదే. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 63లోని ఎక్సెప్షన్ 2పై జరుగుతున్న ఈ న్యాయపోరాటం వెనుక ఉన్న అసలు రాజకీయం ఏమిటి? వివాహ వ్యవస్థ రక్షణ పేరుతో మహిళల ఆత్మగౌరవాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు?
BNS చట్టం ఏం చెప్తోంది?
బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (IPC) స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS) పేరుతో అత్యాధునిక చట్టాలను తెచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ BNSలో మాత్రం పాత పితృస్వామ్య భావజాలాన్ని అలాగే కొనసాగించింది. పాత చట్టంలోని ఐపీసీ సెక్షన్ 375 మినహాయింపును, ఇప్పుడు బీఎన్ఎస్ సెక్షన్ 63లోని ఎక్సెప్షన్ 2 రూపంలో భద్రపరిచారు. దీని ప్రకారం.. 18 ఏళ్లు నిండిన భార్యతో భర్త బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నప్పటికీ, అది చట్టం దృష్టిలో అత్యాచారం (Marital Rape) కిందకు రాదు. చట్టం దృష్టిలో ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటాయని చెబుతున్నప్పటికీ, వివాహం అనే ఒక్క బంధం కారణంగా మహిళల శరీర స్వయంప్రతిపత్తి (Bodily Autonomy) పూర్తిగా రద్దయిపోతుందా అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం కరువైంది. పెళ్లి అనేది కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదని, ఇదొక సామాజిక వ్యవస్థ అని, పాశ్చాత్య దేశాల చట్టాలను భారతదేశానికి గుడ్డిగా ఆపాదించలేమని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్లలో గట్టిగా సమర్థించుకుంటోంది.
వివాహం ముసుగులో లైంగిక దారుణాలు!?
అయితే, ప్రభుత్వ వాదనలు ఒక వైపు ఉంటే, క్షేత్రస్థాయిలో వివాహ బంధాల ముసుగులో జరుగుతున్న దారుణాలు మరో వైపు భయానకంగా ఉన్నాయి. భార్య ఇష్టంతో సంబంధం లేకుండా భర్త తన వైవాహిక హక్కుల (Conjugal Rights) పేరుతో లైంగిక దాడికి (Marital Rape) ఒత్తిడి తెచ్చే సందర్భాలు కోర్టులెక్కినా న్యాయం దక్కడం లేదు. నాలుగు గోడల మధ్య జరిగే ఇలాంటి ఘోరాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు ఉండవు కాబట్టి, నేరం రుజువు కావడం అత్యంత కష్టంగా మారుతోంది. ఒకవేళ భర్త వేధింపులు భరించలేక మహిళలు గృహహింస చట్టం (Domestic Violence Act) లేదా సెక్షన్ 498ఏ కింద కేసులు పెట్టినా, వాటిని సాధారణ నేరాలుగానే పరిగణిస్తున్నారు తప్ప, లైంగిక హింస తీవ్రతను బట్టి కఠిన శిక్షలు పడే అవకాశం లేకుండా పోయింది. దేశంలో ఇప్పటికీ లక్షలాది మంది మహిళలు ఆర్థికంగా భర్తపై ఆధారపడి ఉండటం, పరువు పోతుందనే సామాజిక భయం, విడాకుల తర్వాత భరణం లేదా పిల్లల కస్టడీ దక్కదనే ఆందోళనలతో ఈ నరకాన్ని మౌనంగా భరిస్తున్నారు. చట్టంలో ఉన్న ఈ మినహాయింపులు బాధితులకు అండగా ఉండాల్సింది పోయి, నేరస్థులకు రక్షణ కవచాలుగా మారుతున్నాయనే విమర్శలు తీవ్రమవుతున్నాయి.
కేంద్రం వాదనేంటి?
ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని చట్టాలను మార్చలేవని, ఇది పూర్తిగా పార్లమెంట్ పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా విస్తృత స్థాయి ప్రజాభిప్రాయ సేకరణ, సామాజిక సంప్రదింపులు జరగకుండా కేవలం ఒక కోర్టు తీర్పు ద్వారా ఇంతటి పెనుమార్పు తీసుకురావడం కుటుంబ వ్యవస్థను తీవ్రంగా అస్థివ్యస్తం చేస్తుందని కేంద్రం వాదిస్తోంది. ఇప్పటికే గృహహింస, క్రూరత్వ నిరోధక చట్టాలు అందుబాటులో ఉన్నాయని, ప్రత్యేకంగా అత్యాచార నిర్వచనాన్ని (Marital Rape) మార్చాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తన వాదనను వినిపిస్తోంది. అయితే, వివాహ వ్యవస్థ పవిత్రత పేరుతో ఒక మహిళ ప్రాథమిక హక్కులను, మానవ హక్కులను కాలరాసే అధికారం ఏ వ్యవస్థకూ లేదని న్యాయ నిపుణులు, మహిళా సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి. చట్టసభలు మారినా, పితృస్వామ్య ఆలోచనా ధోరణిలో మాత్రం మార్పు రాలేదనడానికి ఈ మినహాయింపులే సజీవ సాక్ష్యం.
ఇది కూడా చదవండి: Subhash Chandra: ప్రజాధనం లూటీకి అడ్డాగా దివాలా చట్టం?!
#MaritalRape #BNS63 #SupremeCourt #WomensRights #IndianLaw #BodilyAutonomy #GenderJustice #LegalReform #NewsDabba
















