YS Jagan: రోడ్డు మీద ఒక ప్రాణం గాలిలో కలిసిపోయింది! ఒక వ్యక్తి దారుణంగా ప్రాణాలు కోల్పోతే, అది కేవలం ఒక ప్రమాదం అని సరిపెట్టుకోవచ్చా? ఆ ప్రమాదం వెనుక కేవలం ఒక వాహనమే ఉందా, లేక కేసును తప్పుదోవ పట్టించే కుట్ర ఉందా? అత్యంత ఘోరమైన విషయమేమిటంటే… నేరాన్ని కప్పిపుచ్చేందుకు, ఇంకొకరిపై మోపేందుకు ప్రయత్నించిన నిందితుడికి ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధినేతే బహిరంగంగా అండగా నిలవడం! చట్టం, న్యాయం, నైతికత అనే పదాలకు అసలు విలువే లేకుండా పోతోందా? ‘మా పార్టీ వాళ్లు ఏం చేసినా అది కేవలం ప్రమాదమే… లేదా రాజకీయ కుట్రే’ అనే విచిత్రమైన సిద్ధాంతాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) తెరపైకి తెచ్చారు. అధికారం ఉన్నా లేకపోయినా తాము చెప్పిందే శాసనం అన్నట్లుగా సాగుతోంది ఈ నయా రాజకీయం!
కేసును తప్పుదోవ పట్టించిన దారుణం
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Sidiri Appalaraju) కుమారుడు బైక్‌పై వెళ్తూ ఒక అమాయకుడిని ఢీకొట్టి, అతడి మరణానికి కారణమయ్యాడు. ప్రమాదాలు జరగడం అవాంఛనీయమే కావచ్చు, చట్ట ప్రకారం ప్రమాదాలకు శిక్షల తీవ్రత తక్కువగానే ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది కేవలం ప్రమాదం (Accident) మాత్రమే కాదు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోవడం, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం, తన బదులు వేరొకరిని ముందరకు తెచ్చి కేసుకు వేరే రంగు పులమాలని చూడటం అత్యంత తీవ్రమైన నేరం. ఈ విషయాన్ని స్వయంగా ప్రోత్సహించి, కొడుకును ఆసుపత్రికి తరలించి, రాత్రికి రాత్రే డ్రామా నడిపించిన ఆరోపణలు వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజుపై వచ్చాయి.
ఇది కూడా చదవండి: Gen Z: జెన్ జీ పోరాడాల్సింది ఇలాంటి వాటి పైనే కదా?
108 డ్రామా – జగన్ విచిత్ర వ్యాఖ్యలు
ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ఇచ్చిన ప్రకటనలు వింటే సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. “ఆ పిల్లాడు ప్రమాదం జరగ్గానే 108కి కాల్ చేశాడు కదా, అలాంటప్పుడు వాళ్లని ఎందుకు అరెస్ట్ చేశారు?” అని జగన్ ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. 108కి కాల్ చేసినంత మాత్రాన చేసిన నేరం, తప్పుదోవ పట్టించిన కుట్ర రద్దయిపోతుందా? నిజానికి 108కి కాల్ చేసి, అక్కడే ఉండి సిపిఆర్ (CPR) చేసి బాధ్యతగా ప్రవర్తించి ఉంటే అది నేరం యొక్క తీవ్రతను తగ్గించేది. కానీ, ఇక్కడ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి, అమాయకుడి ప్రాణం తీసిన ఘటనా స్థలం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనిని కప్పిపుచ్చుతూ, ‘మా నాయకుడిపై హత్య కేసు పెడతారా’ అని జగన్ ప్రశ్నించడం రాజ్యాంగ చట్టాలను తుంగలో తొక్కడమే!
బాధితుడి వైపు కాదు… నిందితుడి వైపు నిలబడ్డ నైతికత
జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ఏకంగా విశాఖపట్నం నుంచి ర్యాలీగా బయలుదేరి జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును (Sidiri Appalaraju) పరామర్శించేందుకు వెళ్లారు. సాధారణంగా ఏదైనా ప్రజాపోరాటం చేసి, లేదా ప్రజల కోసం జైలుకు వెళ్లిన రాజకీయ నాయకులను పరామర్శించడం ఆనవాయితీ. కానీ, తన కొడుకు చేసిన ప్రమాదాన్ని, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని వెనకేసుకొచ్చినందుకు జైలుకు వెళ్లిన ఒక నాయకుడిని పరామర్శించడానికి జగన్ అంత ఆర్బాటంగా వెళ్లడం ఎలాంటి సంకేతాలను ఇస్తోంది? ఒక అమాయకుడు చనిపోతే, ఆ బాధితుడి కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి, కేసును మసిపూసి మారేడుకాయ చేయాలని చూసిన నేరస్తుడికి మద్దతుగా నిలవడం రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట కాదా?
YS Jagan నయా నైతికత
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా రాజకీయ కేసులు, విమర్శలు ఉండేవి. 2003 అలిపిరి ఘటనలో నిందితుడైన గంగిరెడ్డిని 2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక కలిసేటప్పుడు కూడా ఎంతో గోప్యత పాటించారు. సీఎం హోదాలో ఉన్నప్పుడు అటువంటి నేర ఆరోపణలు ఉన్న వ్యక్తులను కలవడం సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుందని నాటి నాయకులు భయపడేవారు. కానీ జగన్మోహన్ రెడ్డికి (YS Jagan) ఎలాంటి భయమూ, పశ్చాత్తాపమూ లేకపోవడం గమనార్హం. తాను చేసేదే చట్టం, తన పార్టీ నాయకులు ఏం చేసినా దానికి రాజకీయ రంగు పులమడమే ధ్యేయం అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kadambari Jethwani : బాధితురాలా? నిందితురాలా? సీఐడీ సెన్సేషన్ రిపోర్ట్
బల ప్రదర్శన వెనుక ఉన్న రాజకీయ లబ్ధి
విశాఖ నుండి జైలు వరకు ఐదు ఆరు గంటల పాటు వేలాది మందితో సాగించిన ఈ ‘పరామర్శ యాత్ర’ అసలు ఉద్దేశం సీదిరి అప్పలరాజును పరామర్శించడానికే అన్నట్టు సాగలేదు. అదొక రాజకీయ బల ప్రదర్శన! ప్రయాణ సమయం ముగిసిపోయి జైలు అధికారులు కలవనివ్వకపోతే, జగన్ వర్గానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే వారికి కావాల్సింది న్యాయం కాదు, కేవలం “మేము ఎంతకైనా తెగిస్తాం, మా పార్టీ వాళ్ల కోసం చట్టాన్ని కూడా లెక్క చేయం” అని చూపించుకోవడమే. రాజకీయ పార్టీ అభిమానం లేదా పక్షపాతం ముసుగులో నేరాలను కూడా సమర్థించే స్థితికి మద్దతుదారులను తీసుకురావడం సమాజానికి అత్యంత ప్రమాదకరం.
ఒక అమాయక పౌరుడి ప్రాణం పోయినా, చట్టాన్ని పరిహసించినా, రాజకీయ నాయకుల పవర్ ముందు అన్నీ దిగదుడుపేనా? జగన్మోహన్ రెడ్డి చూపుతున్న ఈ కొత్త రకం రాజకీయ సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్ సమాజానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన విఘాతం కలిగిస్తోంది. నేరాన్ని నేరంగా చూడకుండా, అధికారంలో ఉంటే తమ చట్టాలే చెల్లుబాటు కావాలనడం అత్యంత దారుణం. ఇటువంటి వైఖరిని నైతికత ఉన్న ఏ సమాజమూ ఆమోదించలేదు. చట్టం అందరికీ సమానమేనని రుజువు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు వ్యవస్థలపైనే ఉంది.
#YSJagan #APPolitics #YSRCP #SeediriAppalaraju #HitAndRun #APNews #PoliticalAnalysis #JusticeForVictim #TeluguNews #RuleOfLaw
















