Vijay: తమిళనాడు రాజకీయ యవనికపై దశాబ్దాల ద్రావిడ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ, వెండితెర ‘దళపతి’ (Thalapathy) విజయ్ అసెంబ్లీలో అతిపెద్ద శక్తిగా అవతరించడం ఒక సంచలనం. అయితే, ప్రజాక్షేత్రంలో అద్భుతమైన విజిల్ వేయించుకున్న విజయ్‌కు, అధికార పీఠం మాత్రం పూలపాన్పు కాలేదు సరికదా, అడుగడుగునా ముళ్లతో నిండిన బాటగా కనిపిస్తోంది. సొంతంగా మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేక, మిత్రపక్షాల చేతులు పట్టుకుని నడవాల్సిన దుస్థితి ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 108 స్థానాల వద్ద ఆగిపోయిన టీవీకే రథాన్ని ముందుకు నడిపించడానికి కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే వంటి పార్టీల అవసరం పడింది. గెలిచిన ఆనందం కంటే, రేపు జరగబోయే సంకీర్ణ సర్కార్ సంక్షోభాల తలపోటు విజయ్ (Vijay) కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కోట్లాది మంది అభిమానుల మధ్య కేరింతలు కొట్టిన నాయకుడు, ఇప్పుడు కొద్దిమంది మిత్రపక్షాల నాయకుల కనుసన్నల్లో కదలాల్సిన సంకీర్ణ సంకెళ్ల రాజకీయాల్లో చిక్కుకున్నాడు.
అంకెలు చెబుతున్న అస్థిరత
తమిళనాడు అసెంబ్లీలో (Tamilnadu Assembly) టీవీకే 108 స్థానాలతో అగ్రగామిగా నిలిచినా, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన 118 మార్కును అందుకోవడంలో విఫలమైంది. ఈ లోటును పూడ్చుకోవడానికి కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2) స్థానాలతో పాటు, దళిత వర్గాల్లో బలమైన ముద్ర ఉన్న వీసీకే పార్టీ మద్దతును విజయ్ అనివార్యంగా తీసుకోవాల్సి వచ్చింది. కేవలం పది లోపు స్థానాలు ఉన్న పార్టీలే ఇప్పుడు ప్రభుత్వ మనుగడను శాసించే స్థాయికి చేరడం ప్రజాస్వామ్యంలోని అతిపెద్ద విడ్డూరం. ఈ చిన్నా చితకా పార్టీలు తాము ఇచ్చే మద్దతును ఒక బాధ్యతగా కాకుండా, ఒక ఆయుధంగా మలుచుకునే ప్రమాదం ఉంది. ఒక్కో ఎమ్మెల్యే విలువ ఇప్పుడు కోట్లకు పడగలెత్తే పరిస్థితి రావడం, కేవలం రెండు మూడు సీట్లు ఉన్న పార్టీలు కూడా ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వెళ్లడం విజయ్ (Vijay) ముందున్న అతిపెద్ద సవాల్. ఈ అంకెల గారడీలో ప్రభుత్వం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని దినదిన గండంలా మారే అవకాశం ఉంది.
గత చరిత్ర పాఠాలు
సంకీర్ణ ప్రభుత్వాల (Coalition Govt) చరిత్ర ఎప్పుడూ విషాదాంతాలే ఎక్కువగా చూపిస్తుంది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి, మిత్రపక్షాల ఒత్తిడి తట్టుకోలేక బహిరంగంగానే కన్నీళ్లు పెట్టుకున్న ఉదంతం దేశమంతా చూసింది. “నేను విషాన్ని గొంతులో దాచుకున్న శివుడిలా ఉన్నాను” అని ఆయన అన్న మాటలు, సంకీర్ణ రాజకీయాల క్రూరత్వానికి నిదర్శనం. అటు మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ పేరుతో కాంగ్రెస్, ఎన్సీపీలను కలుపుకుని సీఎం అయిన ఉద్ధవ్ థాక్రే, చివరికి తన సొంత పార్టీని, ప్రభుత్వాన్ని కూడా కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు తమిళనాడులో విజయ్‌కి (Vijay) కూడా సరిగ్గా ఇలాంటి ముప్పు పొంచి ఉంది. ఒక సిద్ధాంతం లేని, కేవలం అధికారం కోసం కలిసిన పార్టీల మధ్య సమన్వయం కుదరడం అసాధ్యం. గతంలో యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు నెలల వ్యవధిలోనే కుప్పకూలిన దాఖలాలు విజయ్‌ని కచ్చితంగా కలవరపెడుతూనే ఉంటాయి.
మిత్రపక్షాల ‘అతి’ పెత్తనం?
విజయ్‌కి ప్రస్తుతం మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, వీసీకే వంటి పార్టీలు నిన్నటి వరకు డీఎంకే కూటమిలో ఉండి, చివరి నిమిషంలో అధికారం కోసం గోడ దూకినవే. తమ మద్దతు వల్లే విజయ్ ముఖ్యమంత్రి అయ్యారనే గర్వం వారిలో అడుగడుగునా కనిపిస్తుంది. ప్రభుత్వంలోని కీలక నిర్ణయాల్లో, మంత్రివర్గ కూర్పులో, చివరికి బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఈ పార్టీలు తమ పెత్తనాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తాయి. చిన్న పార్టీల పెద్ద పెద్ద కోరికలు విజయ్ను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం. ముఖ్యంగా దళిత హక్కుల విషయంలో వీసీకే, జాతీయ అంశాల విషయంలో కాంగ్రెస్ తన సొంత ఎజెండాను రుద్దడానికి ప్రయత్నిస్తే, విజయ్ కేవలం ఒక ‘రబ్బర్ స్టాంప్’ ముఖ్యమంత్రిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. తన సొంత విజన్ ప్రకారం రాష్ట్రాన్ని పాలించాలనుకునే ఒక నటుడికి, ఈ రాజకీయ బేరసారాలు ఒక నరకంలా అనిపిస్తాయి.
విభిన్న సిద్ధాంతాల వికృత కలయిక
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే, ఐదేళ్ల పాటు అభివృద్ధి పథంలో నడపడం మరొక ఎత్తు. టీవీకే (TVK) సిద్ధాంతాలు ఏమిటో ఇప్పటికీ స్పష్టంగా లేకపోయినా, ఆయనతో జతకట్టిన వామపక్షాలది ఒక దారి, కాంగ్రెస్‌ది మరో దారి. సిద్ధాంత పరంగా పొంతన లేని ఈ పార్టీలు కలిసి పాలన చేయడం అంటే ఒకే బండికి అటు ఇటు వెళ్లే రెండు గుర్రాలను కట్టినట్లే. ప్రభుత్వ పథకాల అమలులో వాటా కోసం, నామినేటెడ్ పోస్టుల కోసం, కాంట్రాక్టుల పంపిణీ కోసం తలెత్తే విభేదాలు పాలనను స్తంభింపజేస్తాయి. ప్రజా సమస్యల కంటే మిత్రపక్షాల ముష్టియుద్ధాలకే సమయం సరిపోతుంది. విజయ్ (Vijay) తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలను సైద్ధాంతిక విభేదాల పేరుతో వామపక్షాలు అడ్డుకోవచ్చు, లేదా కేంద్రంతో సయోధ్య విషయంలో కాంగ్రెస్ కీచులాటలు మొదలుపెట్టవచ్చు. దీనివల్ల నష్టపోయేది కేవలం తమిళనాడు ప్రజలు మాత్రమే.
డీఎంకే, అన్నాడీఎంకేల వ్యూహం
మరోవైపు, దశాబ్దాల చరిత్ర ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేలు ఈ ఘోర పరాజయాన్ని అంత సులభంగా జీర్ణించుకోవు. తాత్కాలికంగా అవి మౌనంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, సంకీర్ణ కూటమిలో ఏ చిన్న బీటలు వారినా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సంకీర్ణంలోని అసంతృప్త ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడంలో ఆరితేరిన రాజకీయం డీఎంకే సొంతం. మిత్రపక్షాల్లో చిచ్చు పెట్టడం, విజయ్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం ద్వారా ముందస్తు ఎన్నికలకు తెరలేపాలని ఆ పార్టీలు ఎదురుచూస్తుంటాయి. ఈ ఉద్ధండ ద్రావిడ పార్టీల వ్యూహాలను తిప్పికొడుతూ, నిత్యం గూఢచారిలా మిత్రపక్షాలపై నిఘా ఉంచుతూ పాలన సాగించడం విజయ్‌కి కత్తిమీద సామే. ఏ ఒక్క ఎమ్మెల్యే అలిగినా ప్రభుత్వం కూలిపోయే స్థితిలో ఉండటం ప్రతిపక్షాలకు ఒక గొప్ప అవకాశంగా మారుతుంది.
ఇది కూడా చదవండి: TVK Vijay: వెండితెర ‘దళపతి’ నుండి తమిళనాడు ‘అధినేత’ వరకూ!
ఆర్థిక భారం -హామీల అమలు!
ఎన్నికల సమయంలో విజయ్ (Vijay) ఇచ్చిన భారీ హామీలను నెరవేర్చాలంటే రాష్ట్ర ఖజానా సహకరించాలి. ఇప్పటికే తమిళనాడు అప్పుల ఊబిలో ఉంది. ఇలాంటి సమయంలో సంకీర్ణ మిత్రపక్షాలు తమ ప్రాంతాలకు లేదా తమ వర్గాలకు ప్రత్యేక నిధులు కావాలని ఒత్తిడి చేస్తే, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కుంటుపడుతుంది. మిత్రపక్షాలను సంతృప్తి పరచడానికే నిధులన్నీ మళ్లించాల్సి వస్తే, ప్రజలకు ఇచ్చిన మౌలిక వసతుల హామీలు గాలిలో దీపాల్లా మారుతాయి. పైగా, అవినీతి రహిత పాలన అందిస్తానని చెప్పిన విజయ్‌కు, మిత్రపక్షాల అవినీతి ఆకలిని తట్టుకోవడం సాధ్యమా? వారిని నియంత్రిస్తే మద్దతు ఉపసంహరిస్తామనే బెదిరింపులు ఎదురవుతాయి, నియంత్రించకపోతే విజయ్ ప్రతిష్ట మసకబారుతుంది. ఈ రెంటి మధ్య నలిగిపోవడం దళపతికి తప్పదు.
నిత్య అగ్నిపరీక్షలో దళపతి
వెండితెరపై ఒక్క ఫైట్‌తో వందమంది విలన్లను చిత్తు చేసే విజయ్‌కి, రాజకీయ తెరపై సంకీర్ణ విలన్లను ఎదుర్కోవడం అసాధ్యమైన పనిగా మారనుంది. భావోద్వేగాలతో జనాన్ని రంజింపజేయడం సులభమే కానీ, భిన్న దృక్పథాలు కలిగిన పార్టీల నాయకులను ఐదేళ్ల పాటు ఏకతాటిపై ఉంచడం నిత్య అగ్నిపరీక్ష. ఒకవేళ మిత్రపక్షాల బ్లాక్‌మెయిలింగ్‌కు తలొగ్గితే ఆయన స్వతంత్రత దెబ్బతింటుంది, ఎదిరిస్తే ప్రభుత్వం కూలిపోతుంది. ద్రావిడ మూలాలున్న పార్టీలు ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ, వాటికి ఉన్న క్షేత్రస్థాయి బలం విజయ్‌కి ఎప్పుడూ ముప్పుగానే ఉంటుంది. రాబోయే ఐదేళ్లు తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రయోగంగా మిగిలిపోతాయా లేక ఒక పరిణామంగా నిలుస్తాయా అన్నది విజయ్ సంకీర్ణ ధర్మాన్ని (Coalitin Govt) ఎలా నెట్టుకొస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. విజిల్ వెయ్యడం వరకు ఆయన వంతు, కానీ ఆ సంగీతం సాఫీగా సాగాలంటే మాత్రం మిత్రపక్షాల తాళం తప్పనిసరి. అందుకే ఈ రథయాత్ర దళపతికి ఒక అంతులేని సవాల్!
















