Hellhole: అంతర్జాతీయ దౌత్య చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా భారత్-అమెరికా బంధం ఇప్పుడు ఒక పెను సంచలనానికి కేంద్రబిందువైంది. ఒకవైపు ప్రధాని మోదీని ‘నా ప్రాణమిత్రుడు’ అని కీర్తించే డొనాల్డ్ ట్రంప్.. మరోవైపు భారత్‌ను ‘నరకకూపం’ (Hellhole) అంటూ సంబోధించిన పోస్ట్‌ను షేర్ చేయడం ప్రపంచవ్యాప్తంగా అగ్గి రాజేసింది. ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వరకు ఈ ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వివాదం కేవలం మాటల యుద్ధం కాదు.. ఇది రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న నమ్మకంపై జరిగిన దాడి.
విద్వేషపు చిచ్చు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఒక వివాదాస్పద పోస్ట్‌ను షేర్ చేశారు. అది కన్జర్వేటివ్ పోడ్‌కాస్ట్ హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన నాలుగు పేజీల సుదీర్ఘ వ్యాసం. అందులో భారత్, చైనా వంటి దేశాలను “Hellholes on the planet” (భూమిపై ఉన్న నరకకూపాలు) గా అభివర్ణించారు. అమెరికాలో పుట్టగానే లభించే పౌరసత్వ హక్కును (Birthright Citizenship) తప్పుబడుతూ.. భారతీయ వలసదారులు కేవలం పౌరసత్వం కోసమే అమెరికాకు వస్తున్నారని, ఇక్కడ పిల్లలను కని తమ మొత్తం కుటుంబాలను అక్రమంగా రప్పిస్తున్నారని విద్వేషాన్ని వెళ్లగక్కారు.
ఈ పోస్ట్‌లో భారతీయ టెక్ నిపుణులను “గ్యాంగ్‌స్టర్స్ విత్ లాప్‌టాప్స్” (Gangsters with Laptops) అని పిలవడం అత్యంత ఘోరమైన విషయం. భారతీయులకు ఇంగ్లీష్ రాదని, వారు అమెరికన్ జెండాను అవమానిస్తున్నారని ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. ఈ అత్యంత నీచమైన రాతలను ట్రంప్ స్వయంగా షేర్ చేయడంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ (MEA) ఉగ్రరూపం దాల్చింది.
ఢిల్లీ ఘాటు స్పందన
భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు “అజ్ఞానంతో కూడినవి, అనుచితమైనవి, అత్యంత నీచంగా ఉన్నాయి” (Uninformed, Inappropriate and in poor taste) అని కుండబద్దలు కొట్టారు. భారత్-అమెరికా సంబంధాలు పరస్పర గౌరవంపై ఆధారపడి ఉంటాయని, ఇలాంటి జాత్యహంకార ధోరణి వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
ఇండియాకు ఇరాన్ బాసట!
ఈ వివాదంలో ఊహించని విధంగా ఇరాన్ (Iran) జోక్యం చేసుకుంది. ముంబై, హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్లు ట్రంప్‌కు గట్టి చురకలంటించాయి. “ట్రంప్‌కు ఒక వన్-వే కల్చరల్ డిటాక్స్ అవసరం. ఆయన మాట్లాడుతున్నవన్నీ వట్టి ‘బక్వాస్’ (పిచ్చి మాటలు). ఒక్కసారి భారత్‌కు వచ్చి ఇక్కడి సంస్కృతిని, ముంబై వడపావ్ రుచిని చూస్తే ఆయన తలకెక్కిన విద్వేషం దిగుతుంది” అని ఎద్దేవా చేశాయి. భారత్, చైనాలు నాగరికతకు పుట్టినిల్లు అని ఇరాన్ ఈ సందర్భంగా గుర్తు చేసింది.
ట్రంప్ యూ-టర్న్
విమర్శలు వెల్లువెత్తడంతో ట్రంప్ వెంటనే తన పద్ధతి మార్చుకున్నారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ద్వారా వివరణ ఇస్తూ.. “ఇండియా ఒక గొప్ప దేశం.. అక్కడ నా అత్యంత సన్నిహిత మిత్రుడు (మోదీ) అగ్ర నాయకత్వంలో ఉన్నాడు” అని కవర్ చేసే ప్రయత్నం చేశారు. విమర్శలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గి, అంతకుముందు విద్వేషాన్ని ప్రోత్సహించడం ట్రంప్ నైజమని విశ్లేషకులు మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Andhra’s Gold Mine: ఆంధ్రాలో బంగారు కొండ.. తవ్వుకుందామా?
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
ఆర్థిక శక్తి: అమెరికాలోని భారతీయ వలసదారులు అక్కడి అత్యంత సంపన్న, విద్యావంతులైన వర్గం. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టాప్ కంపెనీల సీఈవోలు భారతీయులే.
టెక్ వెన్నెముక: అమెరికా ఐటీ రంగం నిలబడాలన్నా, చైనాను అడ్డుకోవాలన్నా భారత్ మద్దతు అమెరికాకు అనివార్యం.
వాణిజ్య యుద్ధం: గతంలోనూ ట్రంప్ భారత్‌ను ‘టారిఫ్ కింగ్’ అని విమర్శించారు. 2025 జనవరిలో రెండోసారి పదవి చేపట్టిన వెంటనే ఇమ్మిగ్రేషన్ పై కఠిన నిబంధనలు తెచ్చారు.
స్నేహమా? ద్రోహమా?
‘నమస్తే ట్రంప్’ అంటూ మనం చూపిన ఆదరాభిమానాలను ‘హెల్ హోల్’ వ్యాఖ్యలతో అవమానించడం భారత్ (India) అస్సలు సహించదు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యటనకు ముందు ఇలాంటి వివాదం రాజేయడం దౌత్యపరమైన వైఫల్యమే. ట్రంప్ (Trump) తన రాజకీయ లబ్ధి కోసం భారత్‌ను ఎంత కించపరిచినా.. వాస్తవ ప్రపంచంలో భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలుసు. ఒకవైపు మిత్రుడు అని పిలుస్తూనే, మరోవైపు దేశాన్ని నరకం అనడం ట్రంప్ డ్రామాకు నిదర్శనం. అమెరికా తన వైఖరి మార్చుకోకపోతే, అగ్రరాజ్యానికి అతిపెద్ద భాగస్వామిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
“ఇది కొత్త భారత్.. ఇక్కడ గౌరవం ఇస్తేనే గౌరవం దక్కుతుంది!”
















