NewsDabba

Media Politics : అధికార గద్దలు – అక్షర రాబందులు!

Media Politics : తెలంగాణ సమాజం ఇప్పుడు ఒక వికృత క్రీడకు సాక్షిగా నిలుస్తోంది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉండాల్సిన మీడియా, స్వార్థ ప్రయోజనాల కోసం గోబెల్స్ ప్రచారానికి దిగడం ఒక ఎత్తయితే.. ప్రజల ఆస్తులను తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు పాలకులు సాగిస్తున్న తెరచాటు రాజకీయం మరో ఎత్తు. ఇటీవల ఒక వార్తా ఛానల్ ప్రసారం చేసిన ‘అక్రమ సంబంధం’ కథనం కేవలం ఒక వ్యక్తిత్వ హననం మాత్రమే కాదు, అది వ్యవస్థీకృత నేరానికి పరాకాష్ట (Media Politics).

అక్షరాయుధం.. బ్లాక్ మెయిలింగ్ సాధనమా?

జర్నలిజం (Journalism) అనేది ఒక పవిత్రమైన బాధ్యత. కానీ, నేడు కొన్ని మీడియా (Media) సంస్థల చేతుల్లో అది ఒక మారణాయుధంగా మారింది. ఒక మహిళా ఐఏఎస్ అధికారిని, ఒక మంత్రిని టార్గెట్ చేస్తూ అల్లిన కథనం వెనుక ఉన్న అసలు ఉద్దేశం సమాజానికి నిజాలు చెప్పడం కాదు, సదరు మంత్రిని దారికి తెచ్చుకోవడం.. తమకు అడ్డు లేకుండా తొలగించుకోవడం. ఒక మీడియా సంస్థ అధిపతికి తన చేతిలో ఛానల్ (News Channel) ఉంది కాబట్టి ఎవరినైనా బజారుకు ఈడ్చవచ్చనే అహంకారం ఈ కథనంలో స్పష్టంగా కనిపిస్తోంది. పడకగది వార్తలను వండివార్చడం ద్వారా సదరు బాధితుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి, తద్వారా తమ వ్యాపార సామ్రాజ్యానికి అడ్డుగా ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలనే నీచమైన ఆలోచన ఇది. అక్షరాన్ని అమ్ముకోవడం ఒక ఎత్తయితే, అక్షరాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లకు, కాంట్రాక్టులకు తెరలేపడం ఒక చీకటి అధ్యాయం. ఆధారాలు లేని వార్తలతో ఒక వ్యవస్థను కుప్పకూల్చాలని చూడటం మీడియా స్వేచ్ఛ అనిపించుకోదు, అది కచ్చితంగా మీడియా టెర్రరిజం అవుతుంది.

తెర వెనుక Blackmail Politics

ఈ మొత్తం రొచ్చు వెనుక ఉన్న అసలు కథ బొగ్గు గనులు. ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ (ABN RadhaKrishna) వెల్లడించిన అంశాల ప్రకారం.. ఒడిశాలోని బొగ్గు గనుల టెండర్లే ఈ యుద్ధానికి కేంద్రబిందువు. మీడియా అధిపతి తన అల్లుడికి వేల కోట్ల విలువైన బొగ్గు గనులను కట్టబెట్టాలని చూడటం, దానికి అడ్డుగా ఉన్నవారిని వ్యక్తిత్వ హననం ద్వారా దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించడం జుగుప్సాకరం.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని అస్మదీయులకు అన్నీ కట్టబెడతాం అనుకునే పాలకుల తీరు ఇక్కడ విమర్శలపాలవుతోంది. మా వాడు అయితే చాలు, నిబంధనలను తుంగలో తొక్కి అయినా సరే ప్రభుత్వ ఆస్తులను ధారాదత్తం చేసే సంస్కృతి ప్రజాస్వామ్యానికి చేటు.

BRS Defected MLAs
Defected MLAs: ఫిరాయింపు ఎమ్మెల్యేల తిరుగుబాటు!

ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలంగా ఉండే మీడియా సంస్థలకు కొమ్ముకాయడం, ఆ మీడియా సంస్థలు ప్రభుత్వంలోని ప్రత్యర్థులను అణచివేసేందుకు సాయపడడం.. ఇదొక విషవలయంలా మారింది. అధికార దాహం, ధన దాహం కలిసినప్పుడు సామాన్యుడి ప్రయోజనాలు ఎలా బలి అవుతాయో ఈ బొగ్గు టెండర్ల వ్యవహారం నిరూపిస్తోంది.

మంత్రుల మధ్య వార్ కారణమా?

ఈ ఎపిసోడ్‌లో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. ప్రభుత్వాని అనుకూలం అని చెప్పుకునే మీడియానే ఒక మంత్రిపై దాడికి దిగడం. కేబినెట్ లో అంతర్గత విభేదాలు ఉన్నాయని చెప్పడంలో భాగంగానే ఈ స్టోరీని తెరపైకి తెచ్చారు. అయితే ఈ స్టోరీ వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందనేది ఆంధ్రజ్యోతి చెప్తున్న మాట. ఒక మంత్రిని బద్నాం చేయడం ద్వారా, తన పట్టు పెంచుకోవాలని చూస్తున్న మరో ముఖ్య నేత ఈ కథనానికి స్కిప్ట్ రాశారనే ఊహాగానాలున్నాయి. మీడియా అధిపతితో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన మంత్రే.. తన సహచర మంత్రిపై బురదజల్లించే స్థాయికి దిగజారారనే ఆరోపణలున్నాయి.

Bhatti Vikramarka రియాక్షన్.. పశ్చాత్తాపమా? వ్యూహమా?

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఈ వ్యవహారంలో స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. తాను వ్యవస్థీకృత నేరస్థులను తెలంగాణ ఆస్తులపై వాలనివ్వనని చెప్పడం గొప్ప విషయమే. కానీ, ఆరోపణలు వచ్చిన వెంటనే టెండర్లు రద్దు చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి?  ఆ టెండర్లలో నిజంగానే అక్రమాలు జరిగాయా? తన పేరు బయటకు రావడంతోనే ఆయన ఈ రద్దు నిర్ణయం తీసుకున్నారా?

నిజాయితీ గల పాలకుడు ఎప్పుడూ వ్యవస్థలకు జవాబుదారీగా ఉండాలి తప్ప, మీడియా కథనాలకు భయపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకవేళ టెండర్లు పారదర్శకంగా జరిగితే రద్దు చేయాల్సిన అవసరం లేదు. రద్దు చేశారంటేనే అక్కడ ఏదో జరగరానిది జరిగిందనే అనుమానాలకు తావిస్తోంది. రాధాకృష్ణ వెనుక ఎవరున్నారో తేలుస్తానని భట్టి అంటున్నారు.. అంటే ఈ యుద్ధం ఇక్కడితో ఆగేది కాదని అర్థమవుతోంది.

వ్యవస్థల పతనం: ఎవరిది బాధ్యత?

ఈ ఎపిసోడ్ లో బలి అయింది కేవలం జర్నలిస్టులో, ఒక మంత్రో కాదు.. వ్యవస్థల మీద ప్రజలకున్న నమ్మకం.

Kondapalli Ganesh
Kondapalli Ganesh: అమ్మ గణేషూ.. ఇంత మోసమా..!?

ఒక ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వాన్ని రోడ్డు మీద పడేస్తుంటే, ప్రభుత్వం కఠినంగా స్పందించడంలో జాప్యం ఎందుకు జరిగింది? కేవలం అరెస్టులతో సరిపెడితే సరిపోతుందా?

పాలకుల అండ చూసుకుని మీడియా సంస్థలు (Media Politics) బరితెగించడం, వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడటం ఏ రకమైన సంస్కృతి?

రాజకీయం – వ్యాపారం – జర్నలిజం.. ఈ మూడు కలిస్తే అది ఒక ప్రమాదకరమైన మాఫియాగా మారుతుంది. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది సరిగ్గా ఇదే.

మార్పు ఎక్కడ మొదలవ్వాలి?

మీడియా చేతిలో ఉందని అడ్డగోలుగా కథనాలు రాసేవారిని చట్టం కచ్చితంగా శిక్షించాలి. కానీ, అదే సమయంలో మీడియాను అడ్డం పెట్టుకుని దోపిడీకి పాల్పడే పాలకులను కూడా ప్రజలు నిలదీయాలి. అస్మదీయులకు దోచిపెట్టడం.. తప్పు చేసిన వారిని మీడియా అండతో కాపాడటం అనే పద్ధతికి స్వస్తి పలకాలి.

తెలంగాణ ప్రజల ఆస్తులు కొందరు ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే, జర్నలిజం పేరుతో ‘క్యారెక్టర్ అసాసినేషన్’కు పాల్పడే ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేదంటే, రాబోయే రోజుల్లో ప్రతి మంత్రికి, ప్రతి అధికారికి ఈ మీడియా ఉచ్చు తప్పదు.

KTR-Pulivendula Barber
KTR: కేటీఆర్ పంచుకున్న ‘ప్రాణసంకట’ పొలిటికల్ కామెడీ!

భట్టి విక్రమార్క అన్నట్లుగా, ఈ కథనం వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిదో బయటపడాలి. ఆ హస్తం ఒక మంత్రిదైనా, లేక ఒక బడా వ్యాపారిదైనా.. వారిని ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఓ మంత్రిపైన, ఓ ఐఏఎస్ అధికారిణి పైన అధారాలు లేకుండా కథనాలను వండి వార్చిన మీడియాపైనా చర్యలు తీసుకోవాలి. వాళ్లు ఉద్దేశాలనూ వెలికి తీయాలి. ఆ స్టోరీ వెనుక ఉన్న వారినీ బయటకు లాగాలి.

అక్షరానికి ఆశీస్సులు ఉండాలి కానీ, ఇలాంటి వికృత చేష్టలకు తావుండకూడదు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment