NewsDabba

SP Balasubramanyam : విషబీజాల నీడలో స్వరబ్రహ్మ.. పదేళ్లయినా ఆరని ప్రాంతీయ చిచ్చు

Updated on: December 26, 2025 | By Editorial Team

SP Balasubramanyam : హైదరాబాద్ సాంస్కృతిక కేంద్ర బిందువైన రవీంద్ర భారతి (Ravindra Bharathi) ప్రాంగణం ఇప్పుడు ఒక అవాంఛనీయ వివాదానికి వేదికైంది. కోట్లాదిమంది హృదయాలను తన స్వరంతో గెలుచుకున్న దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ (SP Balu Statue) అంశం, తెలుగు నేల మీద మరోసారి ప్రాంతీయ చిచ్చును రగిలిస్తోంది. ఈ నెల 15న బాలు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో, కొంతమంది తెలంగాణ వాదులు దీనిని అడ్డుకోవడం, బాలు బావమరిది శుభలేఖ సుధాకర్‌తో (Subhalekha Sudhakar) వాగ్వాదానికి దిగడం విచారకరమైన పరిణామం.

ఎస్పీ బాలసుబ్రమణ్యం భౌతికంగా నెల్లూరులో జన్మించి ఉండవచ్చు. కానీ, ఆయన కళకు, ఆయన స్వరానికి ఎప్పుడూ ప్రాంతీయ సరిహద్దులు లేవు. దాదాపు 16 భారతీయ భాషల్లో, 50 వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ రికార్డుల్లోకెక్కిన బాలు.. కేవలం తెలుగువాడు మాత్రమే కాదు, భారతీయ చలనచిత్ర సంగీతానికి దొరికిన అపురూప వరం. మద్రాసు, హైదరాబాద్ నగరాలను కేంద్రంగా చేసుకుని దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు అజరామరం. ఎంతోమంది కొత్త గాయనీగాయకులను తీర్చిదిద్దిన గురువు ఆయన. అలాంటి మహోన్నత వ్యక్తిని కేవలం “ఆంధ్రా గాయకుడు” అనే చిన్న గీత గీసి చూడటం ఆయన స్థాయిని తగ్గించడమే అవుతుంది.

Murder Convict Veeranna
Veeranna: వారెవ్వా.. ఖైదీ నెం.1983 టు ‘బెస్ట్ టీచర్’ అవార్డు

రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడిచినా, ఇంకా ఈ ప్రాంతీయ విభేదాలు కొనసాగుతుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తెలంగాణ (Telangana) ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం, రాజకీయ అవసరాల కోసం నాటి ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టి ఉండవచ్చు. ఆ సమయంలో “ఆంధ్రా పెత్తనం” అన్న నినాదం ఒక రాజకీయ అస్త్రంగా పనిచేసింది. కానీ, స్వరాష్ట్రం ఏర్పడి, తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న ఈ తరుణంలో కూడా ఇంకా అదే పాత “ఆంధ్రా-తెలంగాణ” విషబీజాలు మొలకెత్తుతుండటం దురదృష్టకరం. కళాకారులను కూడా ప్రాంతీయ కోణంలోనే చూడటం అనేది ఒక అనారోగ్యకరమైన సామాజిక ధోరణికి అద్దం పడుతోంది. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక కాదు, సంకుచితత్వానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భాష, ప్రాంతీయ అభిమానం విషయంలో తమిళనాడు ప్రజలు, అక్కడి ప్రభుత్వాలు చాలా కఠినంగా ఉంటాయని ప్రతీతి. కానీ, తెలుగువాడైన ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణానంతరం, అక్కడి స్టాలిన్ ప్రభుత్వం ఆయనను ఎంతగానో గౌరవించింది. చెన్నైలోని ఒక ప్రధాన వీధికి బాలు పేరు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంది. పొరుగు రాష్ట్రం ఆయనను “మా వాడు” అని గుండెలకు హత్తుకుంటుంటే, సొంత తెలుగు గడ్డపై, అందునా ఆయన ఎంతగానో ప్రేమించిన హైదరాబాద్‌లో ఆయన విగ్రహానికి స్థలం లేదనడం తెలుగు జాతికే అవమానకరం.

Freebies vs Welfare
Freebies: ఉచిత పథకాలకు కళ్లెం వేయాల్సిన సమయమిదే!

రవీంద్ర భారతి లాంటి కళా నిలయాల్లో ఉండాల్సింది కళాకారుల విగ్రహాలే తప్ప, రాజకీయ నాయకులవి కాదు. బాలు విగ్రహం అక్కడ ఉండటం వల్ల ఆ ప్రాంతానికి గౌరవం పెరుగుతుందే తప్ప తరగదు. ఇప్పటికైనా రాజకీయ, ప్రాంతీయ ద్వేషాలను పక్కనపెట్టి, ఒక లెజెండరీ గాయకుడిని సముచితంగా గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, పౌర సమాజంపై ఉంది. కళకు కులం, మతం, ప్రాంతం ఉండవని చాటిచెప్పిన బాలును.. ప్రాంతీయతా వాదంతో అవమానించడం అంటే, మన సంస్కృతిని మనమే కించపరుచుకోవడమే.

Jogi Ramesh Family cheating exposed
Jogi Ramesh: ఆడబిడ్డ జీవితం నాశనం చేసిన ‘జోగి’ ఫ్యామిలీ!
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment