Revanth Reddy: భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘ఒక ఓటు – ఒకే విలువ’ అనేది ప్రాథమిక సూత్రం. కానీ, రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) నేపథ్యంలో ఈ సూత్రమే ఇప్పుడు ఉత్తర-దక్షిణ (South Vs North) రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) లేవనెత్తిన ’50 శాతం పెంపు’ ప్రతిపాదనపై విమర్శలు కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా, సమాఖ్య స్ఫూర్తికే సవాలుగా మారాయి. జనాభా నియంత్రణలో (Population Control) ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ పెంపు నిబంధన శాపంగా మారబోతోందా? ఉత్తరాది (North) రాష్ట్రాల జనాభా విస్ఫోటనం వారికి రాజకీయ వరంగా మారనుందా?
అసలేమిటీ పునర్విభజన?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం, ప్రతి పది ఏళ్లకోసారి జరిగే జనాభా లెక్కల (Demographic Census) ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలి. అయితే, 1970లలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అమల్లోకి వచ్చినప్పుడు, జనాభాను తగ్గించిన రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను 2001 వరకు స్తంభింపజేశారు. ఆ తర్వాత 2002లో 84వ సవరణ ద్వారా దీనిని 2026 వరకు పొడిగించారు. ప్రస్తుతం మనం వాడుతున్న నియోజకవర్గాల సంఖ్య 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉంది. 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా కొత్త విభజన జరగాలి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.
50 శాతం పెంపు: Revanth Reddy వాదనలో లాజిక్?
కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న ‘అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్లు పెంచడం’ అనే ప్రతిపాదనపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల జరిగే నష్టాన్ని గణాంకాలతో చూస్తే ఆయన ఆవేదనలోని హేతుబద్ధత అర్థమవుతుంది.
తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు గత ఐదు దశాబ్దాలుగా జనాభా నియంత్రణలో అద్భుతమైన ఫలితాలు సాధించాయి. ఫలితంగా దేశ జనాభాలో దక్షిణాది వాటా 1971లో 24.79% ఉండగా, 2011 నాటికి అది 20.8%కి పడిపోయింది. 2026 నాటికి ఇది ఇంకా తగ్గుతుంది.
ప్రస్తుత లోక్‌సభ సీట్లు 543. ఒకవేళ జనాభా ప్రాతిపదికన వీటిని 848కి పెంచాల్సి ఉంటుంది. అయితే జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి వాదిస్తున్నాయి. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా 50శాతం పెంపు ప్రతిపాదన (Delimitation) తీసుకొచ్చింది. అంటే జనాభాతో సంబంధం లేకుండే ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్న ఎంపీ సీట్లలో సగం సీట్లు పెరుగుతాయి. అదే జరిగితే ఇప్పుడు 543 లోక్ సభ సీట్లు ఉండగా 50 శాతం పెంచితే 816 సీట్లు అవుతాయి. ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం 80 సీట్లు ఉండగా, పెంపు తర్వాత 120 అవుతాయి. బీహార్ లో 40 ఉండగా 60 అవుతాయి.
సమానత్వం పేరుతో అతిపెద్ద ‘మోసం’
కేంద్రం ప్రతిపాదిస్తున్న 50% పెంపు నిబంధన పైకి చూడటానికి “అందరికీ సమానమే కదా” అనిపిస్తుంది. కానీ దీని వెనుక ఉన్న లాజిక్ వేరు.
జనాభా నియంత్రణ అంటే త్యాగం: 1970ల నుండి దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను ఒక ఉద్యమంలా చేపట్టాయి. ఫలితంగా కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు (TFR) గణనీయంగా తగ్గింది.
ఉత్తరాది వైఫల్యం: ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు జనాభాను నియంత్రించడంలో దారుణంగా విఫలమయ్యాయి.
శిక్ష ఎవరికి?: ఇప్పుడు అందరికీ సమానంగా 50% సీట్లు పెంచితే, జనాభాను కట్టడి చేసినందుకు దక్షిణాదికి దక్కాల్సిన “అదనపు ప్రాతినిధ్యం” దక్కదు. అంటే, నియమాలను పాటించిన వాడు, పాటించని వాడు ఒక్కటే అనే చందంగా కేంద్రం వ్యవహరిస్తోంది. ఇది రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయానికి పూర్తి విరుద్ధం.
అంకెల్లో అన్యాయం: ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ప్రస్తుత లోక్‌సభ స్థానాల నిష్పత్తి 1971 జనాభా లెక్కల ప్రకారం ఉంది. అప్పట్లో దక్షిణాదిలో (South) జనాభా వాటా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ వాటా తగ్గింది. ఒకవేళ అందరికీ 50% పెంచితే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి:
తెలంగాణ, ఏపీలకు కలిపి 42 లోక్ సభ సీట్లు ఉన్నాయి. అయితే జనాభా నియంత్రణ పాటించినందుకు 50శాతం కంటే ఎక్కువ సీట్లు ఈ రెండు రాష్ట్రాలకు దక్కాలి. అలాగే తమిళనాడు కూడా.! అదే సమయంలో జనాభా నియంత్రణ పాటించని ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ఉత్తరాది (North) రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో కోత వేయాలి. అప్పుడే ఉత్తరాది, దక్షిణాది మధ్య గ్యాప్ తొలగుతుంది. అలా కాకుండా 50 శాతం సీట్ల పెంపు అంటూ అందరినీ ఒకే గాటన కట్టేస్తే తేడా ఏముంటుంది?
రేవంత్ రెడ్డి (Revanth Reddy) వాదన ప్రకారం, జనాభా నియంత్రణ పాటించనందుకు ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు (Delimitation) తగ్గించాలి. కానీ కేంద్రం అందరికీ 50% పెంచి, ఉత్తరాది తన రాజకీయ ఆధిపత్యాన్ని కాపాడుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది.
ఇది కూడా చదవండి: Delimitation: మోదీ బిగ్ బ్యాంగ్..! దేశంలో రాజకీయ భూకంపం!!
ఉత్తరాది గుత్తాధిపత్యం.. దక్షిణాది అంటరానితనం
ఒకవేళ ఈ 50% రూల్ అమలులోకి వస్తే, దేశ ప్రధాని ఎవరో నిర్ణయించే శక్తి కేవలం 4-5 ఉత్తరాది రాష్ట్రాలకే ఉంటుంది.
రాజకీయ బానిసత్వం: ఉత్తరప్రదేశ్ (120), బీహార్ (60), మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీట్లు కలిపితేనే మేజిక్ ఫిగర్ దాటిపోతుంది. అప్పుడు కేంద్రంలోని ఏ పార్టీకైనా దక్షిణాది (South) రాష్ట్రాల మద్దతు అవసరమే ఉండదు.
అభివృద్ధికి విఘాతం: మనం కడుతున్న పన్నులతో ఉత్తరాదిని పోషిస్తూ, రాజకీయంగా కూడా మనం వారిపైనే ఆధారపడాలా?
పనిష్మెంట్ ఎక్కడ?: జనాభా విస్ఫోటనానికి కారణమైన రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం అంటే, వారికి “రివార్డ్” ఇవ్వడమే. ఇది భవిష్యత్తులో ఏ రాష్ట్రం కూడా జనాభాను నియంత్రించకుండా ఉండేలా ప్రోత్సహించినట్లవుతుంది.
సమాఖ్య వ్యవస్థపై గొడ్డలి పెట్టు
కేంద్రం ఆలోచనలో ‘క్వాంటిటీ’ ఉంది కానీ ‘క్వాలిటీ’ (అభివృద్ధి/నియంత్రణ) లేదు. దక్షిణాది రాష్ట్రాలు విద్య, వైద్యం, జనాభా నియంత్రణలో అగ్రస్థానంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి అన్నట్లుగా, ఈ పారామీటర్స్ ను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం “సమాన పెంపు” అని మభ్యపెట్టడం వెనుక భారీ కుట్ర దాగి ఉంది.
ప్లస్ పాయింట్: ఒకవేళ రేవంత్ చెప్పినట్లు దక్షిణాదికి ఎక్కువ సీట్లు ఇస్తే, అభివృద్ధి చెందిన రాష్ట్రాల గొంతు పార్లమెంటులో బలంగా వినబడుతుంది. జాతీయ విధానాలు మెరుగుపడతాయి.
మైనస్ పాయింట్: ప్రస్తుత కేంద్రం ప్రతిపాదన వల్ల దక్షిణాది ఒక ‘రాజకీయ ద్వీపం’గా మారిపోతుంది. నిర్ణయాధికారంలో మన పాత్ర సున్నా అవుతుంది.
దక్షిణాది ఏకం కావాల్సిన సమయం!
“మేము దేశం కోసం జనాభాను తగ్గించాం.. అది మా తప్పా?” అని దక్షిణాది ప్రశ్నిస్తోంది. రేవంత్ రెడ్డి లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మనుగడ ప్రశ్న. 50% సమాన పెంపు అనేది ఒక భ్రమ. జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు బోనస్ సీట్లు ఇవ్వాలి, పాటించని రాష్ట్రాలకు పెనాల్టీ విధించాలి. అప్పుడే అది అసలైన ప్రజాస్వామ్యం. లేదంటే, భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలు కేవలం ‘రాష్ట్రాలు’గా మిగిలిపోతాయి తప్ప, దేశాన్ని నడిపించే ‘శక్తులు’గా ఉండవు. కేంద్రం తన పద్ధతి మార్చుకోకపోతే, దక్షిణాది నుండి గట్టి తిరుగుబాటు తప్పదు.
















