లెక్క మారుతోంది..రాజకీయమూ మారుతోంది.. నిన్నటి వరకు ఓ లెక్క…రేపటి నుంచి మరో లెక్క. ఓసారి వాళ్లు… ఇంకోసారి వీళ్లు.. దశాబ్దాలుగా కేరళలో (Kerala) అధికారం మొత్తం ఆ రెండు కూటముల చుట్టూనే. మరో మూడు నాలుగు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఫార్ములాకు బ్రేక్ పడే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. LDF, UDFకు ప్రత్యామ్నాయంగా కేరళ ప్రజలు బీజేపీని ఆదరించడం మొదలు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడమే కాదు… తిరువనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ (Thiruvananthapuram Corporation) పైనా కాషాయ జెండా పాతి పొలిటికల్ డైనమిక్స్ ను మార్చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు వచ్చేలా బీజేపీ (BJP) మిషన్ కేరళ (Mission Kerala) కు పదును పెడుతోంది.
బీజేపీ బలపడిందా?
మతతత్వ శక్తులకు కేరళలో స్థానమే లేదు… బీజేపీ కేరళలో అధికారంలోకి రావడం అన్నది ఎప్పటికీ కలే… కేరళ రాజకీయాలకు బీజేపీతో ముడి పెట్టి మాట్లాడుకునేటప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించే మాటలివి. రీజనల్ పాలిటిక్స్ కు కేరాఫ్ గా ఉండే కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి రాజకీయంగా చోటు ఉండదన్నది చాలా మంది అభిప్రాయం. అది నిజం కాదు అని స్థానిక సంస్థల ఫలితాలు తేల్చేశాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సంగతి తర్వాత.. అసలు క్షేత్రస్థాయిలో బీజేపీ ఎంతగా బలపడుతుందో లోకల్ బాడీ ఎలక్షన్ రిజల్ట్స్ చెబుతున్నాయి. కేరళ రాజధాని తిరువనంతపురం ఇప్పుడు కాషాయంలోకి మారిపోయింది. 45 ఏళ్ల వామపక్ష కూటమి ఆధిపత్యానికి గండి కొడుతూ తిరువనంతపురం కార్పోరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుంది. ఒక్క తిరువనంతపురంలో మాత్రమే కాదు..పాలక్కాడ్, కోజికోడ్, త్రిశూర్ అన్ని చోట్లా బీజేపీ దూసుకుపోయింది. 900 గ్రామపంచాయతీలు, 87 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తే…. బీజేపీ తన ప్రాభల్యాన్ని స్పష్టంగా నమోదు చేసింది. కేరళలో బీజేపీ జెండా ఎగరదు అన్న మాటలను చరిత్రలో కలిపేసింది.
కేరళలో కొత్త రాజకీయం మొదలైందా?
స్థానిక సంస్థల ఫలితాలను విశ్లేషించుకుంటే అర్థమయ్యే పాయింట్ ఒక్కటే….. కేరళలో కొత్త రాజకీయం మొలయ్యింది. వామపక్ష నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ లకు ప్రత్యామ్నాయంగా కేరళ ఓటర్లు బీజేపీని ఆదరించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా కేరళలో అర్బన్ ఓటర్ల మైండ్ సెట్ ను మార్చడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. స్థానిక సంస్థల ఫలితాల్లో బీజేపీ బలపడింది.. మెరుగ్గా ఫలితాలు వచ్చింది అర్బన్ ప్రాంతాల నుంచే. అర్బన్ ప్రాంతాల్లో ఉండే హిందూ ఓటర్లను తనవైపు తిప్పుకోవడమే కాదు.. మైనార్టీలను ఆకర్షించడంలో కూడా బీజేపీ సక్సెస్ అయ్యింది. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అన్న ముద్రను తొలగించే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న త్రిసూర్ కార్పోరేషన్ లో బీజేపీ ముస్లిం అభ్యర్థి ముంతాజ్ గెలుపే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.
హిందువుల మనోభావాలు దెబ్బతినడమే కారణమా?
కేరళలో పొలిటికల్ ల్యాండ్ స్కేప్ పూర్తిగా మారిపోతోంది అనడానికి ఈ ఫలితాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వామపక్ష కూటమి హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్న భావన చాలా మంది కేరళ ఓటర్లలో ఉంది. శబరిమల వివాదం, గోల్డ్ చోరీ వ్యవహారంలో ఎల్టీఎఫ్ హిందువుల మనోభావాలను గాయపరిచింది. సాధారణంగా ఎల్డీఎఫ్ ను కాదనుకున్న ప్రతి సందర్భంలోనూ కేరళ ఓటర్లు యూడీఎఫ్ వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు కూడా యూడీఎఫ్ హవా తగ్గకపోయినా… ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీకి అవకాశం కల్పిస్తున్నారు.
అసెంబ్లీలోనూ చక్రం తిప్పబోతోందా?
కేరళ నుంచి బీజేపీ తరపున ఒక్క ఎంపీ ఉన్నా..అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోసం ఎప్పటి నుంచో ఆ పార్టీ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ వ్యతిరేక ఓటు బ్యాంక్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా దక్షిణ కేరళ, సెంట్రల్ కేరళ, అర్బన్, సెమీ అర్బన్ నియోజకవర్గాలపై ఫోకస్ ఎక్కువగా పెట్టింది. మోడీ మార్క్ అభివృద్ధి ఎజెండాతో మెజార్టీ హిందూ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడంతో పాటు మైనార్టీలకు కూడా అండగా ఉంటామన్న భరోసా కల్పించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. స్థానిక ఫలితాలే కనుక రిపీట్ అయితే బీజేపీ కేరళలో ఈజీగా 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాలను కూడా కైవలం చేసుకుని కీ మేకర్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అది అంత ఈజీ అని కూడా చెప్పలేం. అర్బన్ ఓటర్ల బీజేపీకి అనుకూలంగా మారుతున్నా… కేరళ గ్రామీణ ప్రజానికం ఇంకా ఆ రెండు కూటమిల వైపే ఎక్కువగా ఉన్నాయి. అంటే గ్రామాల స్థాయిల్లో కూడా బీజేపీ బలంగా చొచ్చుకుపోవాలి. అప్పుడే ఆ పార్టీ అనుకున్నది సాధ్యమవుతుంది.
ఎల్డీఎఫ్పై వ్యతిరేకతే కారణమా?
స్థానిక సంస్థల ఫలితాలు కేరళలో ఓటర్ల మూడ్ ఎలా ఉందో చెప్పేశాయి. అవినీతి ముద్ర వేసుకున్న అధికార వామపక్ష కూటమిపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్డీయేకు వచ్చిన ఫలితాలు చూసి ఎల్డీఎఫ్ షాక్ లో ఉంది. బీజేపీ గెలుపు ఆందోళన కలిగించిందని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారంటే వామపక్షాలు ఎంత ఒత్తిడిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రత్యామ్నాయంగా యూడీఎఫ్ ఉన్నా… బీజేపీకి కూడా అవకాశాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా పార్టీలు, కూటములు వ్యూహాలకు పదును పెట్టాలి. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే గడువు ఉంది. అప్పటికి ఈ ఫలితాలే రిపీట్ అయితే… కేరళలో బీజేపీ క్రమంగా బలపడుతుందనే భావించాలి. బీహార్ లో తిరుగులేని మెజార్టీతో గెలిచి.. పశ్చిమబెంగాల్, తమిళనాడును నెక్స్ట్ టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీకి ఇప్పుడు కేరళ కూడా ఆశాదీపంలా కనిపిస్తోంది. చూడాలి.. లోకల్ బాడీ రిజల్ట్స్ఇచ్చిన కిక్కుతో బీజేపీ కేరళ అసెంబ్లీలో పాగా వేసేందుకు ఏ స్థాయిలో వ్యూహాలు రచిస్తోంది. స్థానిక ఫలితాలు రాగానే.. థ్యాంక్యూ తిరువనంతపురం అంటూ ప్రధానమంత్రి చేసిన ట్వీట్… అసెంబ్లీ ఎన్నికల తర్వాత థ్యాంక్యూ కేరళగా మారుతుందా లేదా అన్నది వేచి చూడాలి.















A.R.Rahman : రెహమాన్ మనసులో ఇంత విషముందా?