NewsDabba

Aalin Sherin: మరణం గమ్యం కాదు… మరో జన్మకు మార్గం

Aalin Sherin: మనిషి జీవితం ఎంతటిది? పది నెలలా? పదేళ్లా?
కాలం లెక్కల్లో చూస్తే పది నెలలు అనేది ఒక రెప్పపాటు కాలం. కానీ, ఆ పది నెలల ప్రాయంలోనే ఒక పసిపాప ఈ ప్రపంచానికి నేర్పిన పాఠం, వేల ఏళ్ల మానవ పరిణామ క్రమంలో మనం నేర్చుకోని ఒక గొప్ప సత్యాన్ని చాటిచెప్పింది. కేరళకు (Kerala) చెందిన పసిమొగ్గ ఆలిన్ షెరిన్ అబ్రహం (Aalin Sherin Abraham).. ఇప్పుడు ఒక పేరు మాత్రమే కాదు, అదొక నిరంతర చైతన్యం. మరణం అనేది ఒక వ్యక్తికి ముగింపు కావచ్చు, కానీ మానవత్వానికి అది మరో అద్భుతమైన ప్రారంభమని ఆ పసి ప్రాణం నిరూపించింది.

ఆ చివరి స్పర్శ.. ఆ గొప్ప నిర్ణయం

ఆలిన్ (Aalin Sherin) తల్లి షెరిన్ తన బిడ్డను ఆసుపత్రి బెడ్ మీద విగతజీవిగా చూసినప్పుడు ఆమె గుండె ఏమై ఉంటుంది? తన కడుపున పుట్టిన బిడ్డ, అప్పుడప్పుడే అమ్మ అని పిలవాలని ప్రయత్నిస్తున్న ఆ పసి ప్రాణం.. ఇకపై ఎప్పటికీ కళ్లు తెరవదని తెలిసినప్పుడు ఆ తల్లి ఎంతటి నరకాన్ని అనుభవించి ఉంటుంది? సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఏ తండ్రి అయినా కుప్పకూలిపోతాడు. కానీ, అబ్రహం ఆ దుఃఖంలోనూ ఒక మహోన్నతమైన వెలుగును చూశాడు.

TVK Vijay
TVK Vijay : విజయ్ ముందరి కాళ్ళకు ‘బంధాలు’!

“నా బిడ్డ మాతో ఉండలేకపోయినా.. కనీసం ఆమె కళ్లు ఈ ప్రపంచాన్ని చూడాలి, ఆమె గుండె మరో చిన్నారిని బ్రతికించాలి” అని ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం.. మరణం మీద మానవత్వం సాధించిన విజయం. ఒక పసిపాప పార్థివ దేహాన్ని చూస్తూ ఏడవడం కంటే, ఆమెలోని జీవాన్ని పంచుదామనే ఆ సాహసోపేత ఆలోచన వెనుక ఉన్నది మమకారం మాత్రమే కాదు.. ఈ ప్రపంచం బాగుండాలనే ఒక ఉన్నతమైన ఆశయం.

ఇది కూడా చదవండి : Jahnavi Kandula: రూ.260 కోట్లు.. జాహ్నవి ప్రాణానికి అమెరికా కట్టిన వెల ఇది!

జీవధారగా మారిన పసి ప్రాణం

ఆలిన్ (Aalin Sherin) అవయవాలు సేకరించినప్పటి నుంచి అవి మరో శరీరంలోకి వెళ్లే వరకు జరిగిన ప్రయాణం ఒక అద్భుతం. గ్రీన్ కారిడార్ల గుండా ఆంబులెన్స్‌లు సైరన్లతో దూసుకెళ్తుంటే.. ఆ సైరన్ శబ్దంలో మరణపు ఛాయలు లేవు, కొత్త ప్రాణాలు పోసుకుంటున్న ఆశలు ఉన్నాయి.
* కొచ్చిలోని మరో చిన్నారికి కాలేయం అమర్చినప్పుడు.. ఆ చిన్నారి తల్లి కళ్లలో మెరిసిన ఆనంద బాష్పాల్లో ఆలిన్ నవ్వు కనిపిస్తోంది.
* ఇద్దరు వ్యక్తులకు చూపు వచ్చినప్పుడు.. ఆ కనుపాపల్లో ఆలిన్ మెరుపు దాగి ఉంది.
* కిడ్నీల దానంతో ఒక కుటుంబం మొత్తం నిలబడినప్పుడు.. ఆ కృతజ్ఞతలో ఆలిన్ త్యాగం సజీవంగా ఉంది.

Menaka Guruswamy
Menaka Guruswamy: పెద్దల సభకు “స్వలింగ సంపర్కురాలు”

కేరళ (Kerala) చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఆర్గాన్ డోనార్‌గా (Organ Donar) ఆలిన్ రికార్డులకెక్కి ఉండొచ్చు. కానీ, ఆమె సాధించిన అసలైన విజయం అది కాదు. చనిపోయాక కూడా ఇతరుల కోసం మనం ఏం చేయగలం అనే ఒక మౌలికమైన ప్రశ్నను ప్రతి ఒక్కరి మెదడులో నాటడం.

విద్వేషాల మకిలిని కడిగేసిన పసిరక్తం

నేటి సమాజంలో మనిషిని మనిషిగా చూడలేని పరిస్థితి. కులం పేరుతో, మతం పేరుతో గోడలు కట్టుకుని ఒకరినొకరు అనుమానంగా చూసుకునే రోజులివి. కానీ, ఆలిన్ ఆ గోడలన్నింటినీ కూల్చేసింది. ఆ పసిపాప శరీరంలోని అవయవాలకు మతం లేదు. ఆ కనుపాపల్లో కులం లేదు. ప్రాణవాయువును పీల్చుకునే ఏ ఊపిరితిత్తులైనా, రక్తాన్ని పంపిణీ చేసే ఏ గుండెకైనా కావాల్సింది కేవలం ఒక ‘అవయవం’ మాత్రమే.
ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ఆలిన్ (Aalin Sherin) గుండె.. రేపు ఒక హిందూ బిడ్డలో ప్రాణమై నిలిస్తే, అది మతసామరస్యానికి మించిన ఒక గొప్ప సత్యం కాదా? ఆమె కిడ్నీలు ఒక ముస్లిం వ్యక్తికి ప్రాణం పోస్తే.. అక్కడ మానవత్వం గెలవలేదా? మనం రోడ్ల మీద గొడవలు పడే కులమతాలు.. చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఆవిరైపోతాయి. అక్కడ మిగిలేది కేవలం ‘మానవత్వం’ అనే ఒకే ఒక్క మతం. ఆలిన్ తన పది నెలల జీవితంతో మనందరికీ ఇదే నేర్పింది.

ఇది కూడా చదవండి : Vijaya Reddy : విజయ రెడ్డి మరణం… నేర్పుతున్న పాఠాలేంటి?

Delhi Liquor Scam
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ ‘నో’ స్కామ్

మన బాధ్యత ఏమిటి?

ఆలిన్ కథ విన్నప్పుడు మనం కంటతడి పెడతాం.. ఆ తల్లిదండ్రులను అభినందిస్తాం. కానీ, అంతటితో మన బాధ్యత అయిపోతుందా? లేదు. ఈ లోకంలో అవయవాలు అందక ప్రతిరోజూ వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మట్టిలో కలిసిపోయే ఈ శరీరం.. మరో ప్రాణాన్ని నిలబెట్టగలదు అనే స్పృహ మనలో కలగాలి. అప్పుడే ఆలిన్ వంటి పసిపాపల త్యాగాలకు నిజమైన అర్థం ఉంటుంది.

ఆలిన్ షెరిన్ అబ్రహం (Aalin Sherin).. నువ్వు చిన్నారివి కాదు, మాకు దారి చూపే ధృవతారవి. మరణం అంటే కనుమరుగవ్వడం కాదు, మరొకరి రూపంలో మళ్లీ పుట్టడం అని నిరూపించిన నీవు సజీవ స్మృతివి. నీ రూపం మాయమై ఉండొచ్చు, కానీ నీలోని అంశ నలుగురిలో ఉంది. ఆ నలుగురు వ్యక్తులు నడుస్తున్నప్పుడు ఆలిన్ నడుస్తోంది.. ఆ నలుగురు ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు ఆలిన్ జీవిస్తోంది. పసిపాప పాదముద్రలు ఈ లోకాన్ని వీడి ఉండొచ్చు, కానీ ఆమె వేసిన మానవత్వపు అడుగులు ఎప్పటికీ చెరిగిపోవు. కులం, మతం, ప్రాంతం అనే సంకుచిత భావాలను దాటి.. మనిషిని ప్రేమించడం అనే మహోన్నత మార్గాన్ని ఆ పసి ప్రాణం మనకు చూపింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment