Sim binding: కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న సరికొత్త రూల్ సిమ్ బైండింగ్ (Sim binding) గురించి మీకు తెలుసా…? కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేకపోతే మీ ఫోన్‌లో వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టి, జోష్… ఇలాంటివి పనిచేయకపోవచ్చు. నిజమా అంటారా అవును అది నిజం… దీనికి సంబంధించి టెలీ కమ్యునికేషన్స్ విభాగం సరికొత్త రూల్స్ తీసుకువచ్చింది..
ఏంటి సిమ్ బైండింగ్ (Sim binding)..?
వాట్సప్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఓ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవుతాం. కానీ తర్వాత ఆ ఫోన్ నుంచి సిమ్ తీసేసినా ఆ యాప్స్ వర్క్ అవుతుంటాయి. మనం సిమ్ మార్చినా పాత సిమ్‌తో లాగిన్ అయిన వాట్సప్ వంటివాటిని మాత్రం యూజ్ చేస్తూనే ఉండొచ్చు. వైఫై సాయంతో ఆ యాప్స్‌ను వినియోగించే వీలుంది. కానీ ఇక నుంచి అలా కుదరదు. మీరు ఫోన్‌లో నుంచి సిమ్ తీసేస్తే…. ఆటోమేటిక్‌గా ఆ యాప్ డిసెబుల్ అవుతుంది. పనిచేయడం ఆగిపోతుంది. మళ్లీ అదే ఫోన్ నెంబర్‌తో యాప్ వాడాలంటే ఆ సిమ్‌ను ఫోన్‌లో వేయాల్సిందే. అంటే సిమ్ యాక్టివ్‌గా ఉండి ఆ ఫోన్‌లో ఉంటేనే వాట్సప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి యాప్స్ పనిచేస్తాయి. లేకపోతే పనిచేయవు. 90 రోజుల్లో ఈ నిబంధనలు అమలు చేయాలని టెలికం కంపెనీలను కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే ఈ దిశగా ఆయా కంపెనీలు కసరత్తు మొదలుపెట్టాయి.
సిమ్ బైండింగ్ (Sim binding) ఎందుకు అవసరం?
సిమ్ బైండింగ్ (Sim binding) లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్రం గుర్తించింది. ముఖ్యంగా సైబర్ క్రిమినల్స్‌కు ఈ ఫెసిలిటీ పెద్ద వరంలా మారింది. దేశం వెలుపల నుంచి సైబర్ క్రిమినల్స్ ఇలాంటి యాప్‌లను ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. పాత, వినియోగంలో లేని ఫోన్ నెంబర్లను సైబర్ క్రిమినల్స్ తమ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు. యాప్స్ ఇన్‌స్టాల్ చేశాక ఆ సిమ్స్‌ను పారేస్తున్నారు. కానీ ఆ యాప్స్ సాయంతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసుల్లో నేరస్తులను పట్టుకోవడం కష్టంగా మారింది. అందుకే కేంద్రం సిమ్ బైండింగ్‌ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఓ లూప్‌హోల్‌ను మూసేసినట్లు అవుతుందన్నది కేంద్రం ఆలోచన. టెలికమ్ ఇండస్ట్రీ కూడా ఇందుకు అంగీకరించింది. హ్యాకర్స్, స్పామర్స్, ఫ్రాడ్‌స్టర్స్ మొబైల్ నెంబర్లను దుర్వినియోగం చేయకుండా ఇది ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.
యాప్స్ పనిచేయాలంటే ఏం చేయాలి.?
ఇక యాప్ పనిచేయాలంటే ఫోన్‌లో కచ్చితంగా ఆ యాప్‌లో రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ ఉండాల్సిందే. వాట్సప్ వెబ్, ఇతర వెబ్ వర్షన్స్ విషయంలో ఏంటి అన్న సందేహాలకు కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రతి ఆరుగంటలకు ఓసారి ఆటోమెటిక్‌గా అవి లాగవుట్ అవుతాయి. అంటే మీరు మీ సిస్టమ్‌లో వాట్సప్ వెబ్ ఓపెన్ చేసినా దాన్ని ఎక్కువకాలం వాడలేరు. కేవలం ఆరుగంటలు మాత్రమే వాడగలరు. ఆ తర్వాత మళ్లీ సిమ్ ఉన్న మొబైల్‌తో స్కాన్ చేసి లాగిన్ అవ్వాల్సిందే. ఈ కొత్త నిబంధనల అమలుపై యాప్ కంపెనీలు 120రోజుల్లో కేంద్రానికి సమాచారం ఇవ్వాల్సి ఉంది.
చాలామంది యూజర్లకు ఈ కొత్త నిబంధనల వల్ల ఇబ్బంది ఉండకపోవచ్చు. ఫోన్‌లో ఉండే సిమ్‌తోనే ఎక్కువగా రిజిస్టర్ అవుతారు కాబట్టి పెద్దగా సమస్య ఉండదు. సిమ్ ఓ ఫోన్‌లో వేసి, మరో ఫోన్‌లో యాప్ వాడుతున్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు.
పూర్తిగా క్రైమ్ ఆగిపోతుందా…?
ఈ ఒక్క నిబంధనతో సైబర్ క్రైమ్ ఆగిపోతుందనుకుంటే భ్రమే. ఇది కేవలం ఓ చిన్న లూప్‌హోల్ సరిచేయడమే అంటున్నారు సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్. చాలామంది సైబర్ మోసగాళ్లు తప్పుడు పత్రాలతో సిమ్ కార్డులు సంపాదిస్తున్నారు. వాటితో మోసాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత సిమ్‌లు పారేస్తున్నారు. కాబట్టి ఈ సిమ్ బైండింగ్‌తో వారికేమీ ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఇప్పటికే AI, వీడియో కేవైసీలతో సిమ్ వెరిఫికేషన్ జరుగుతుందని… అయినా మోసాలు జరుగుతున్నాయంటే తప్పు ఇంకెక్కడో జరుగుతోందని… ముందు దాన్ని సరిచేయాలని సూచిస్తున్నారు.
మొత్తంగా చూస్తే జెన్యూన్‌గా సిమ్ వాడుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సిమ్ ఒక దాంట్లో, యాప్ ఒకదాంట్లో వాడుతున్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. సాధారణ ప్రజల్లో కూడా చాలామంది ఇలా సిమ్ వాడుతున్నారు. వీరంతా మోసగాళ్లు కాదు. ఏదో ఓ అవసరం కోసం ఇలా చేస్తున్నారు. ఇలాంటి వారందిరికీ కేంద్ర నిర్ణయంతో ఇబ్బందులు తప్పేలా లేవు.














