NewsDabba

Anglo Mysore War : మైసూర్ వీరులు.. అమెరికా స్వాతంత్ర్య సమరంలో వ్యూహకర్తలు!

“కమ్, ఆల్ యే లాడ్స్ హూ నో నో ఫియర్… ఎంబార్క్ ఇన్ అవర్ హైదర్-అల్లీ!”
Anglo Mysore War: 1781వ సంవత్సరంలో అమెరికాలోని ఫిలడెల్ఫియా వీధుల్లో మారుమోగిన విప్లవ గీతం ఇది! బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అమెరికా తుపాకీ పట్టి పోరాడుతున్న వేళ… అక్కడ ఒక యుద్ధ నౌకకు ఒక భారతీయ పాలకుడి పేరు పెట్టారు. ఆ పేరే—హైదర్ అలీ (Hyder Ali)! అమెరికా తన 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను (1776–2026) జరుపుకుంటున్న ఈ తరుణంలో, చరిత్ర పొరల్లో కనుమరుగైన ఒక సంచలనాత్మక సత్యాన్ని ప్రపంచానికి చాటాల్సిన సమయం వచ్చింది. జార్జ్ వాషింగ్టన్ అమెరికా గడ్డపై బ్రిటీష్ సైన్యంతో తలపడుతుంటే… దానికి వేల కిలోమీటర్ల దూరంలో, మైసూర్ పీఠంపై కూర్చుని బ్రిటీష్ సామ్రాజ్య పునాదులను కదిలించారు హైదర్ అలీ, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ (Tippu Sultan). వారిద్దరి మధ్య ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు, మైసూర్ సైన్యాలు అమెరికా వెళ్ళలేదు. కానీ, మైసూర్ గడ్డపై జరిగిన యుద్ధాలు బ్రిటీష్ సాయుధ శక్తిని ఏ విధంగా ముక్కలు చేశాయి? అమెరికా స్వాతంత్ర్యానికి మైసూర్ పాలకులు ఎలా పరోక్షంగా దారి తీశారో శోధించే ఒక ప్రత్యేక చారిత్రక ఇన్వెస్టిగేషన్ ఇది!

అంతర్జాతీయ యుద్ధ క్షేత్రం – నేపథ్యం

ఈ కథ కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాదు; ఇది కరేబియన్ తీరాల నుండి బెంగాల్ దాకా విస్తరించిన అంతర్జాతీయ వ్యూహం. 1756 నుండి 1763 వరకు జరిగిన ‘ఏడేళ్ల యుద్ధం’లో బ్రిటన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఫ్రాన్స్, ఎలాగైనా బ్రిటన్‌ను దెబ్బతీయాలని పట్టుదలగా ఉంది. 1773 డిసెంబర్‌లో జరిగిన ‘బోస్టన్ టీ పార్టీ’ ఘటనే అమెరికా విప్లవానికి నాంది పలికింది. ఆ ఘటనా కేంద్రంలో ఉన్నది మరేదో కాదు, భారతదేశంలో తిరుగులేని అధికారం కోసం విస్తరిస్తున్న ‘బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ’కి చెందిన టీ మాత్రమే. అమెరికాలోని 13 ఉత్తర అమెరికా కాలనీలు బ్రిటన్‌పై తిరుగుబాటు చేస్తూ 1775లో విప్లవ యుద్ధాన్ని ప్రారంభించాయి. 1776లో అమెరికా స్వాతంత్ర్య ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో, 1778లో ఫ్రాన్స్ అమెరికా కాలనీల వైపు నిలబడి బ్రిటన్‌పై యుద్ధం ప్రకటించడంతో ఈ పోరాటం ప్రపంచ యుద్ధంగా మారింది. యూరప్, ఆఫ్రికా, కరేబియన్ దాటుకుని ఈ యుద్ధ జ్వాలలు ఆసియాలోని మైసూర్‌ను తాకాయి.

Artifical SpudCell creation in Lab
SpudCell : శూన్యం నుండి సృష్టి.. సైన్స్ చరిత్రలోనే మహాద్భుతం!

మాహె రేవు రేపిన మంట – పొల్లిలూర్ పరాజయం

ఫ్రాన్స్ అమెరికాకు మద్దతుగా నిలవడంతో, దానికి ప్రతీకారంగా బ్రిటన్ 1779లో ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న భారతదేశపు పశ్చిమ తీరంలోని ‘మాహె’ రేవును ఆక్రమించుకుంది. ఈ రేవు మైసూర్ పాలకుడైన హైదర్ అలీకి అత్యంత కీలకం, ఎందుకంటే ఫ్రాన్స్ నుండి ఆయనకు సైనిక సంపత్తి అంతా ఇక్కడి నుంచే వచ్చేది. బ్రిటీష్ వారి ఈ చర్యతో ఆగ్రహించిన హైదర్ అలీ, ఈస్ట్ ఇండియా కంపెనీపై ‘రెండవ ఆంగ్లో-మైసూర్ యుద్ధాన్ని (1780-1784)’ (Anglo Mysore War) ప్రకటించారు. ఈ యుద్ధంలో భాగంగా 1780లో ప్రస్తుత తమిళనాడులోని కాంచీపురం సమీపంలో జరిగిన ‘పొల్లిలూర్ యుద్ధం’లో హైదర్ అలీ (Hydera Ali) సైన్యం బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయాన్ని పరిచయం చేసింది. ఈ విజయంతో బ్రిటన్ ఒక్కసారిగా రక్షణలో పడిపోయింది.

బ్రిటీష్ నౌకాదళాన్ని ముక్కలు చేసిన వ్యూహం

బ్రిటన్‌ను అన్ని వైపులా బలహీనపరచాలనే వ్యూహంతో, ఫ్రాన్స్ తన అడ్మిరల్ ‘పియరీ ఆండ్రీ డి సఫ్రెన్’ను మైసూర్‌కు మద్దతుగా రంగంలోకి దించింది. కర్ణాటకకు చెందిన పండితుడు అమీన్ అహ్మద్ విశ్లేషణ ప్రకారం… ఈ మైసూర్ యుద్ధ రంగం కారణంగా బ్రిటన్ తన సుశిక్షితమైన ‘రాయల్ నేవీ’కి చెందిన మొత్తం యుద్ధ నౌకలలో దాదాపు ఐదవ వంతు (1/5th) నౌకలను కేవలం హిందూ మహాసముద్రంలోనే మొహరించాల్సి వచ్చింది. అడ్మిరల్ సఫ్రెన్ నేతృత్వంలోని ఫ్రెంచ్ నౌకాదళం బ్రిటీష్ నౌకలను ఇక్కడే కట్టిపడేయడం వల్ల, బ్రిటన్ తన పూర్తి సైనిక వనరులను ఉత్తర అమెరికా వైపు కేంద్రీకరించలేకపోయింది. అటు అమెరికా కాలనీలు, ఇటు మైసూర్ సైన్యాల మధ్య బ్రిటీష్ సామ్రాజ్యం ఖండాల వ్యాప్తంగా నలిగిపోయింది.

ఇది కూడా చదవండి: SpudCell : శూన్యం నుండి సృష్టి.. సైన్స్ చరిత్రలోనే మహాద్భుతం!

Taliban Child Marriage Law
Taliban: అమ్మాయిలపై తాలిబన్ల అమానుష చట్టం!

అమెరికా జలాలపై ‘హైదర్ అలీ’ యుద్ధ నౌక హల్‌చల్

ఈస్ట్ ఇండియా కంపెనీని ముప్పతిప్పలు పెడుతున్న హైదర్ అలీ పట్ల అమెరికా ఎలైట్ వర్గాల్లో విపరీతమైన ఆరాధన పెరిగింది. దానికి నిదర్శనంగా, 1781లో పెన్సిల్వేనియా రాష్ట్రం ఒక సరికొత్త యుద్ధ నౌకకు ‘హైదర్ అల్లీ’ (Hyder Ally) అని నామకరణం చేసింది. అమెరికన్ కవి ఫిలిప్ ఫ్రీనో ఈ నౌకను కొనియాడుతూ పదునైన కవిత్వాన్ని కూడా రాశారు. ఆ తర్వాతి ఏడాది, అంటే 1782లో, కేవలం 23 ఏళ్ల వయసున్న కమోడోర్ ‘జాషువా బార్నీ’ నేతృత్వంలోని ఈ ‘హైదర్ అల్లీ’ నౌక, బ్రిటన్‌కు చెందిన భారీ యుద్ధ నౌక ‘జనరల్ మాంక్’ను సముద్ర యుద్ధంలో మట్టికరిపించింది. ఈ చారిత్రాత్మక విజయం ఫిలడెల్ఫియా అంతటా సంబరాలకు దారితీసింది. పెన్సిల్వేనియా ప్రభుత్వం కమోడోర్ బార్నీకి రెండు నౌకల చిత్రాలు చెక్కిన బంగారు పిడి గల ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చి గౌరవించింది.

సంయుక్త వేడుకలు – టిప్పు సుల్తాన్ వారసత్వం

1781 అక్టోబర్‌లో అమెరికాలోని యార్క్‌టౌన్ వద్ద బ్రిటీష్ జనరల్ కల్నల్ కార్న్‌వాలిస్ అమెరికా సైన్యానికి లొంగిపోయాడు. ఈ విజయంతో పాటు భారతదేశంలో హైదర్ అలీ (Hyder Ali) సాధిస్తున్న విజయాలను కలిపి 1781 అక్టోబర్ 28న న్యూజెర్సీలోని ట్రెంటన్ నగర ప్రజలు ఉమ్మడిగా పండుగ చేసుకున్నారు. ఆ రోజు వారు ఎత్తిన 13 సాంప్రదాయక విజయ పానీయాల టోస్ట్‌లలో, 11వ టోస్ట్‌ను “తూర్పు ఇండియాలో బ్రిటన్ గర్వాన్ని అణచివేస్తున్న వీరుడు హైదర్ అలీ” గౌరవార్థం సమర్పించారు. 1782లో హైదర్ అలీ మరణించగా, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ మైసూర్ సింహాసనాన్ని, బ్రిటీష్ వ్యతిరేక పోరాటాన్ని వారసత్వంగా స్వీకరించారు. అమెరికాలోని పాఠ్యపుస్తకాలు, వార్తాపత్రికలు టిప్పు సుల్తాన్ (Tippu Sultan) పోరాటాన్ని నిరంతరం ప్రచురించేవి. చివరకు 1799లో శ్రీరంగపట్నం రక్షణలో టిప్పు సుల్తాన్ వీరమరణం పొందినప్పుడు, 1800 జూలై 4న బాప్టిస్ట్ మినిస్టర్ జాన్ రస్సెల్ తన ప్రసంగంలో “టిప్పు మరణం ఒక రాజుకు తగినట్లుగా వీరోచితంగా నిలిచింది” అంటూ అమెరికా గడ్డపై నివాళులర్పించారు.

స్వార్థ రాజకీయాలు – చరిత్ర కాలగర్భంలో మైసూర్

1783లో జరిగిన ‘ట్రీటీ ఆఫ్ పారిస్’ ద్వారా అమెరికాకు అధికారికంగా స్వాతంత్ర్యం లభించింది. అయితే, స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత అమెరికా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల (Geopolitics) పరంగా తన పంథాను మార్చుకుంది. తమకు పరోక్షంగా సహాయపడిన మైసూర్ లాంటి స్వతంత్ర భారతీయ రాజ్యాలతో సంబంధాలు పెట్టుకోవడానికి బదులుగా, భారతదేశంలో వర్తక వ్యాపారాల కోసం అమెరికా అదే ‘బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ’ శరణు కోరింది. కంపెనీ పరిధిలోని ప్రాంతాలలో కన్సులేట్లను ఏర్పాటు చేసింది. చరిత్రకారుడు బ్లేక్ స్మిత్ విశ్లేషించినట్లు… కేవలం ఒక్క తరంలోనే అమెరికన్లు మైసూర్ పాలకుల త్యాగాలను మరిచిపోయారు, వారిని అమెరికా విప్లవ చరిత్ర పుటల నుండి పూర్తిగా తొలగించారు.

Hellhole - Trump
Hellhole: అమెరికా తాడి మట్టయ్య.. ట్రంప్!

జార్జ్ వాషింగ్టన్ ఒంటరిగా అమెరికాకు స్వాతంత్ర్యం (America Independence) తీసుకురాలేదు, అలాగని హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ అమెరికా కోసం యుద్ధం చేయలేదు. కానీ, బ్రిటన్ అనే ఉమ్మడి శత్రువును దెబ్బతీయాలనే వ్యూహం… ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాల భవిష్యత్తును మార్చేసింది. ఒకవైపు అమెరికా వలసవాదం నుండి విముక్తి పొంది ఎదుగుతుంటే, మరోవైపు మైసూర్ పాలకులు బ్రిటీష్ సామ్రాజ్యవాద విస్తరణను అడ్డుకుంటూ తమ ప్రాణాలను త్యాగం చేశారు. చరిత్ర కొన్ని పేజీలను దాచిపెట్టవచ్చు, కానీ 1781 నాటి ఆ అమెరికన్ యుద్ధ నౌకపై చెక్కిన ‘హైదర్ అలీ’ (Hyder Ali) పేరు… ప్రపంచ స్వాతంత్ర్య పోరాటాల చరిత్రలో మైసూర్ వీరుల ముద్ర చెరిగిపోనిదని సాక్ష్యం చెప్తూనే ఉంటుంది!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment