NewsDabba

YS Jagan: ఇదేనా జగన్ విలువలు, విశ్వసనీయత?

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అనే నినాదం ఒక ప్రభంజనం. ఒక కొడుకుగా తండ్రి ఆశయాలను మోస్తూ, ఒక అన్నగా చెల్లిని వెంటేసుకుని, ఒక నాయకుడిగా జనంలోకి వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి ప్రస్థానం అసాధారణం. కానీ, కాలం గడిచేకొద్దీ ఆ నినాదంలోని పదును తగ్గుతూ.. నేడు అది కేవలం ఒక రాజకీయ డైలాగ్ గా మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా తల్లి విజయమ్మ (YS Vijayamma), చెల్లి షర్మిలతో (YS Sharmila) సాగిస్తున్న ఆస్తుల యుద్ధం, ఆ యుద్ధంలో ఆయన అనుసరిస్తున్న తీరు జగన్ (YS Jagan) రాజకీయ జీవితానికే ఒక పెద్ద నైతిక మచ్చగా మారుతోంది.

పైపై మాటలేనా ఆ బంధాలు?

రాజకీయ వేదికలపై జగన్ నోట వచ్చే ‘నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా అవ్వాతాతలు’ అనే మాటలు వినడానికి ఎంతో ఇంపుగా ఉంటాయి. కానీ, నేడు అదే వ్యక్తి తన సొంత చెల్లి షర్మిలకు రాజ్యాంగబద్ధంగా, నైతికంగా దక్కాల్సిన ఆస్తి వాటాను ఇవ్వకుండా కోర్టు మెట్లు ఎక్కడం ఏ సంకేతాలను ఇస్తోంది? అధికారంలో ఉన్నప్పుడు రాజన్న రాజ్యం అని మురిసిపోయిన జనం, నేడు అదే రాజన్న బిడ్డల మధ్య జరుగుతున్న ఈ చీకటి పోరాటాన్ని చూసి విస్తుపోతున్నారు. బయటి ప్రపంచానికి తాను మహిళా పక్షపాతి అని చెప్పుకునే జగన్, ఇంట్లో మాత్రం చెల్లి హక్కులను కాలరాస్తున్నారనే విమర్శను ఎలా తిప్పికొడతారు? ఇక్కడ ‘మాట తప్పను’ అన్న నినాదం ఏమైంది?

కన్నతల్లిపైనే కత్తిగట్టిన పార్టీ నేతలు!

ఈ వివాదంలో అత్యంత దురదృష్టకరమైన అంశం.. కన్నతల్లి విజయమ్మను (YS Vijayamma) కూడా వివాదంలోకి లాగడం. ఒక తల్లిగా ఆమె తన ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలనుకుంటున్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆమె మాట వినకపోగా, వైసీపీ నేతల ఆమెపైనే విమర్శలు చేయం ఆ పార్టీ నైతిక విలువలకు అతి పెద్ద దెబ్బ. వైసీపీ నేతలు మాట్లాడినా అవి జగన్ నోటి నుంచి వచ్చినట్లుగానే భావించాలి. సమాజంలో తల్లికి ఉన్న స్థానం అత్యున్నతమైనది. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దే తల్లిని, నేడు జగన్ సేన ‘పక్షపాతి’గా ముద్ర వేయడం తెలుగు ప్రజలు జీర్ణించుకోలేరు.

Freebies vs Welfare
Freebies: ఉచిత పథకాలకు కళ్లెం వేయాల్సిన సమయమిదే!

“అసత్యాలు ప్రచారం చేయవద్దు, కుటుంబ గౌరవాన్ని బజారున పడేయకండి” అని ఆమె అఫిడవిట్ లో వేడుకున్నారు. అయినా సరే, వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి ఆమెను టార్గెట్ చేయడం దేనికి నిదర్శనం? జగన్ కనుసన్నలు లేకుండా ఏ నాయకుడైనా ఆయన తల్లిపై విమర్శలు చేయగలడా? ఇది ఖచ్చితంగా జగన్ (YS Jagan) అనుమతితోనే జరుగుతోందనేది బహిరంగ రహస్యం. దీనివల్ల పోయేది జగన్ పరువే కానీ, విజయమ్మగారి గౌరవం కాదు.

సెంటిమెంట్ వర్సెస్ సెటిల్మెంట్

సమాజంలో ‘తల్లి’ సెంటిమెంట్ చాలా ఎక్కువ. తల్లిని కళ్లల్లో పెట్టి చూసుకునే కొడుకులను జనం ఆరాధిస్తారు. కానీ, ఆస్తి కోసం తల్లి చెప్పే మాటను కూడా ఖాతరు చేయకుండా, ఆమెపైనే ఎదురుదాడి చేయించడం జగన్‌కు రాజకీయంగా ‘సెల్ఫ్ గోల్’ లాంటిది. రేపు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఆయన మహిళా ఓటర్ల దగ్గరకు వెళ్తారు? “మీ ఇంట్లో తల్లికే గౌరవం ఇవ్వని మీరు, మాకు ఏ గౌరవం ఇస్తారు?” అని ఒక సామాన్య మహిళ ప్రశ్నిస్తే జగన్ దగ్గర సమాధానం ఉందా?

చెల్లి వాటాల విషయంలో ఆయన లేవనెత్తుతున్న ED అటాచ్‌మెంట్ లాంటి టెక్నికల్ కారణాలు సామాన్య ప్రజలకు అర్థం కావు. వారికి కనిపించేదల్లా.. అన్న ముఖ్యమంత్రి అయ్యాక చెల్లిని (YS Sharmila) దూరం పెట్టాడు, ఇప్పుడు ఆస్తి ఇవ్వకుండా కోర్టుకు లాగాడు, తల్లి మాటను కూడా ఖాతరు చేయడం లేదు.. అనేది మాత్రమే.

ఇది కూడా చదవండి: YS Sharmila: ఒక కుటుంబం, రెండు వర్గాలు, అనంతమైన ప్రశ్నలు

Jogi Ramesh Family cheating exposed
Jogi Ramesh: ఆడబిడ్డ జీవితం నాశనం చేసిన ‘జోగి’ ఫ్యామిలీ!

ప్రచారపు ఆయుధం.. ప్రత్యర్థుల పండగ!

జగన్ చేస్తున్న ఈ వ్యూహాత్మక తప్పిదం ప్రత్యర్థులకు వజ్రాయుధంలా మారింది. టీడీపీ, జనసేన వంటి పార్టీలు ఈ అంశాన్ని గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. రాజకీయంగా జగన్‌ను ఢీకొట్టడం కంటే, ఆయన నైతికతను దెబ్బతీయడం సులభమని వారు గుర్తించారు. సొంత కుటుంబ సభ్యులతోనే సఖ్యతగా ఉండలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఎలా ఏకతాటిపైకి తెస్తారనే విమర్శను ప్రజలు కూడా సీరియస్ గా తీసుకుంటున్నారు.

సమయం మించిపోలేదు..!

జగన్ (YS Jagan) ఇప్పటికైనా ఈగోను పక్కన పెట్టాలి. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పోరాడటానికి ఆయనకు హక్కు ఉండవచ్చు కానీ, నైతిక బాధ్యత అనేది ఒకటి ఉంటుంది.
అంతర్గత చర్చలు: కోర్టు గదుల్లో తేల్చుకోవాల్సిన విషయం కాదు ఇది. తల్లి సమక్షంలో కూర్చుని, చెల్లికి ఇవ్వాల్సిన వాటా ఇచ్చేసి పెద్దన్నగా నిలబడాలి. అవసరమైతే చెల్లి, తల్లి కోసం కొన్ని త్యాగాలు చేయాలి.
నోరు అదుపులో ఉంచుకోవాలి: పార్టీ నేతలను తన కుటుంబ విషయాల్లో తలదూర్చకుండా కట్టడి చేయాలి. ముఖ్యంగా తల్లిపై విమర్శలు చేసే వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.
తండ్రి ఆశయం: వైఎస్సార్ ఆస్తులన్నీ తన నలుగురు మనవలకు సమానంగా చెందాలని కోరుకున్నారని విజయమ్మ చెబుతున్నారు. ఆ తండ్రి ఆశయాన్ని గౌరవించడం జగన్ కనీస ధర్మం.

అధికారం శాశ్వతం కాదు, ఆస్తులు అంతకంటే శాశ్వతం కాదు. కానీ ఒక మనిషి సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలు కలకాలం నిలుస్తాయి. జగన్ తన పట్టుదల వల్ల ఆస్తులను కాపాడుకోవచ్చు కానీ, ప్రజల గుండెల్లో తనకున్న స్థానాన్ని కోల్పోతున్నారు. కన్నతల్లి కళ్లలో కన్నీరు చూసి కూడా కరగని మనసు.. ప్రజా నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు. ఇప్పటికైనా జగన్ మేల్కొని, తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ, రాజకీయంగా తన విశ్వసనీయతను నిలబెట్టుకోవాలి. లేదంటే చరిత్ర ఆయనను ఒక శక్తివంతమైన నాయకుడిగా కంటే, కుటుంబ సభ్యులనే వేధించిన వ్యక్తిగా మాత్రమే గుర్తుంచుకుంటుంది.

YS Jagan
YS Jagan: అన్యాయానికి అండగా నిలబడడమే జగన్ రాజకీయామా?

ఆస్తులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ పోయిన గౌరవం, పలచబడిన బంధాలు తిరిగి రావు. జగన్ ఇప్పటికైనా మేల్కొని తన ఇంటి గొడవను సద్దుమణిగించుకోకపోతే.. రాబోయే రోజుల్లో ఆయన రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment