Nandi Awards: రాష్ట్రం కాని రాష్ట్రంలో నివాసం.. పొరుగు గడ్డపైనే వ్యాపార సామ్రాజ్యాల నిర్మాణం.. కానీ అవార్డులు, రివార్డులు, రాయితీల కోసం మాత్రం ఆంధ్రప్రదేశ్ వైపు చూపులు! ఇది దశాబ్దాలుగా టాలీవుడ్ సాగిస్తున్న ఒక వింత పోకడ. ఆంధ్రా గడ్డను కేవలం కలెక్షన్ల కుండగా చూస్తూ, ఇక్కడి ప్రేక్షకుడిని టికెట్ కొనే యంత్రంలా భావించే సినీ గ్లామర్ బాబుల కోసం.. కూటమి ప్రభుత్వం మళ్ళీ ఎర్రటి తివాచీ పరచడం అవసరమా? సినిమా వాళ్లు అడిగారు కదా అని ‘నంది’ని (Nandi Awards) వారి ముంగిటకు తీసుకెళ్లడం ఆత్మాభిమానం అనిపించుకుంటుందా లేక అసమర్థత అవుతుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు సామాన్య ప్రజల గుండెల్లో సూటిగా గుచ్చుకుంటున్నాయి. కళాకారుల ముసుగులో ఉన్న అపర వ్యాపారవేత్తల కోసం ప్రజాధనాన్ని పురస్కారాల రూపంలో వెదజల్లడం అంటే.. రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి, గ్లామర్ లోకానికి ఊడిగం చేయడమే! అసలు ఆంధ్రాలో పరిశ్రమే లేనప్పుడు, ఈ అవార్డుల జాతర ఎవరి సంతృప్తి కోసం? ఎవరి ప్రయోజనం కోసం?
కళా? కపటమా?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మళ్ళీ ‘నంది’ చుట్టూ రాజకీయం మొదలైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ నోరు మెదపని వారు, ఏపీ వైపు కన్నెత్తి చూడని వారు, ఇప్పుడు ‘అవార్డులు కావాలి.. మమ్మల్ని ప్రోత్సహించాలి’ అంటూ నీతులు చెబుతున్నారు. వాళ్లు అలా అడగ్గానే మంత్రి కందుల దుర్గేష్, త్వరలోనే నంది అవార్డులు (Nandi Awards) ఇస్తామని ప్రకటించడం దేనికి సంకేతం? రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అమరావతి నిర్మాణం లాంటి ప్రాధాన్యతలు ఉన్నప్పుడు, కేవలం పొరుగు రాష్ట్రంలో నివసించే కొందరు సినీ గ్లామర్ బాబుల కోసం ఈ ఆరాటం దేనికి?
చిరంజీవి ‘పక్క రాష్ట్రం’ – ఆత్మాభిమానంపై దెబ్బ
ఇటీవల తెలంగాణలో గద్దర్ అవార్డుల వేదికపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు ప్రతి ఆంధ్రుడిని రగిలిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను ఆయన ‘పక్క రాష్ట్రం’ అని సంబోధించడం విడ్డూరమే కాదు, గర్హనీయం. ఏ గడ్డ మీద పుట్టి, ఏ ప్రేక్షకుల డబ్బుతో ఇవాళ అంత ఎత్తుకు ఎదిగారో, అదే రాష్ట్రాన్ని పరాయిదిగా చూడటం వారి సంకుచిత మనస్తత్వానికి అద్దం పడుతోంది. రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబుకు (Chandrababu) సూచించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏంటి? తెలంగాణలో పరిశ్రమ ఉంది కాబట్టి అక్కడి ప్రభుత్వం ఇచ్చే గౌరవానికి ఒక అర్థం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమే లేనప్పుడు, కనీసం షూటింగ్‌లు కూడా చేయని మీకు ‘నంది’ అవార్డులు ఎందుకు ఇవ్వాలి? ఇది ఆంధ్రా ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కాదా?
గతంలో మౌనం.. ఇప్పుడు గానం!
2017 తర్వాత నంది అవార్డులు (Nandi Awards) నిలిచిపోయాయి. అప్పుడు చిరంజీవి గానీ, ఇతర సినీ పెద్దలు గానీ ఎందుకు ప్రశ్నించలేదు? జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్లపాటు అవార్డుల ప్రస్తావనే లేదు. అప్పుడు ఎందుకు గళం విప్పలేదు? దీనికి సమాధానం ఒక్కటే.. చంద్రబాబు సాఫ్ట్ కావడమే. ఆయన సినిమా వాళ్లని నెత్తిన పెట్టుకుంటారు. ఏది అడిగినా కాదనరు. అందుకే ఆయనకు సూచనలు చేస్తారు.. విమర్శలు గుప్పిస్తారు. అవసరమైతే నిలదీస్తారు. గతంలో చంద్రబాబు అవార్డులు ప్రకటించినప్పుడు కులం రంగు పులిమి, ప్రాంతీయ విభేదాలు సృష్టించి, రచ్చ రచ్చ చేసింది ఇదే సినీ బ్యాచ్. బన్ని వాసు, పోసాని వంటి వారు నాడు చేసిన విమర్శలు ప్రభుత్వం మరిచిపోయిందా? బురద చల్లిన వారికే మళ్ళీ భోజనాలు వడ్డించడం ఏ రకమైన రాజకీయం?
పరిశ్రమ లేని చోట పురస్కారాలెందుకు?
ఒక రాష్ట్రం సినిమా అవార్డులు ఇస్తుందంటే, అక్కడ పరిశ్రమ (Cinema Industry) అభివృద్ధి చెందాలని అర్థం. కానీ ఏపీ పరిస్థితి ఏమిటి? స్టూడియోలు లేవు, షూటింగ్ లొకేషన్లు అభివృద్ధి చెందలేదు, కనీసం ఒక్క అగ్ర నటుడు కూడా ఏపీలో నివాసం ఉండడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఏసీ గదుల్లో కూర్చుని, ఆంధ్రా ప్రేక్షకులను కేవలం ‘టికెట్ కొనే యంత్రాలు’గా చూసే ఈ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎందుకు తలవంచాలి? సినిమా షూటింగ్‌ల ద్వారా స్థానిక కళాకారులకు అవకాశాలు రావు, ఇక్కడి జూనియర్ ఆర్టిస్టులకు పని ఉండదు, చివరకు ఇక్కడి హోటల్స్ లేదా క్యాటరింగ్ వారికి కూడా పైసా ఆదాయం రాదు. అంతా హైదరాబాద్ నుంచి ప్యాక్ చేసుకుని వచ్చి, ఇక్కడ షూటింగ్ చేసి వెళ్ళిపోతారు. మరి ఈ రాష్ట్రానికి ఏం ఒరుగుతోంది?
టికెట్ రేట్ల దోపిడీ
సినిమా వాళ్లు అడిగిందే తడవుగా టికెట్ రేట్లు పెంచేయడం ఇప్పుడు ఒక సంప్రదాయంగా మారింది. సామాన్య ప్రేక్షకుడు తన కష్టార్జితాన్ని సినిమా కోసం ఖర్చు పెడుతుంటే, ఆ సొమ్మును విమానాల్లో తీసుకెళ్లి పొరుగు రాష్ట్రంలో కుమ్మరిస్తున్నారు. తెలంగాణలో అదనపు షోలకు, రేట్ల పెంపునకు కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం హీరోలు అడిగితే చాలు, ప్రభుత్వం జీవోలు ఇచ్చేస్తుంది. ఇది ప్రజల మీద భారం మోపడం కాదా? సినిమాల్లో ఏపీ సమస్యల గురించి మాట్లాడరు, విభజన అన్యాయంపై స్పందించరు, ప్రత్యేక హోదా గురించి ఊసే ఎత్తరు. కానీ టికెట్ రేట్లు పెంచడానికి, అవార్డులు తీసుకోవడానికి మాత్రం ముందు వరుసలో ఉంటారు. ఈ ద్వంద్వ ప్రమాణాలను ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదు?
ఇది కూడా చదవండి: Chiranjeevi: ఏపీకి సినిమా ఇండస్ట్రీ ఏమిచ్చింది.. చిరంజీవి గారూ..?
ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) అపారమైన తీర ప్రాంతం ఉంది. సుందరమైన బీచ్ లు ఉన్నాయి. కోనసీమ లాంటి పచ్చటి పొలాలున్నాయి. చరిత్రాత్మక ప్రదేశాలున్నాయి. తిరుపతి, హార్సిలీహిల్స్, అరకు, గండికోట, తలకోన, విశాఖ, విజయవాడ, కోనసీమ, పోలవరం వంటి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ షూటింగ్ చేయడానికి మన హీరోలకు మనసు రాదు. సినిమా మొత్తం విదేశాల్లోనో లేదా హైదరాబాద్ స్టూడియోల్లోనో తీసి, కేవలం రిలీజ్ మ్యాప్ కోసం ఏపీని వాడుకుంటారు. ఇలాంటి వారికి ‘నంది’ ఇవ్వడం అంటే ఆ పురస్కారాన్ని అవమానించడమే. హైదరాబాద్‌లో తయారయ్యే సినిమాలకు నంది (Nandi Awards) ఎందుకివ్వాలి?
ప్రభుత్వానికో సూటి ప్రశ్న
ఏపీ ప్రభుత్వం సినీ మాయలో పడకుండా, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి:
- నిర్బంధ షూటింగ్ పాలసీ: కనీసం 40% నుండి 50% షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకున్న సినిమాలకే టికెట్ రేట్ల పెంపు లేదా అవార్డులకు అర్హత కల్పించాలి.
- స్థానిక ఉపాధి: ఏపీలో షూటింగ్ చేస్తున్నప్పుడు స్థానిక కళాకారులకు, సాంకేతిక నిపుణులకు కచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి.
- ఆదాయం పంపిణీ: పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం ఏపీలోనే పెట్టుబడిగా పెట్టేలా నిబంధనలు ఉండాలి.
- కులం, రాజకీయ రంగు: అవార్డుల ఎంపికలో పారదర్శకత ఉండాలి. గతంలో జరిగినట్లుగా ఒకే వర్గానికి లేదా కులానికి పెద్దపీట వేస్తే, అది ప్రభుత్వానికే మచ్చగా మారుతుంది.
అవకాశవాదానికి అడ్డుకట్ట వేయాలి
సినిమా వాళ్లు ఎప్పుడూ ‘సేఫ్ గేమ్’ ఆడతారు. ఏపీ విభజన జరిగినప్పుడు వీరు నోరు విప్పలేదు. మూడు రాజధానుల అంశంపై రాష్ట్రం అట్టుడుకుతున్నప్పుడు చిరంజీవి ‘దక్షిణాఫ్రికా లాగా డెవలప్ అవుతాం’ అని అప్పటి ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం రాగానే రాగం మార్చారు. ఈ అవకాశవాద రాజకీయాలను ప్రభుత్వం పసిగట్టాలి. కేవలం గ్లామర్ కోసమో, ఫోటోల కోసమో సినిమా వాళ్లను నెత్తిన పెట్టుకుంటే, అది సామాన్య ఓటరును అవమానించడమే అవుతుంది.
మేల్కొనాల్సిన సమయం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh_ ప్రభుత్వం ఇప్పుడు ఒక సంధిగ్ధంలో ఉంది. సినీ పెద్దల ఒత్తిడికి లొంగిపోయి ‘నంది’ అవార్డుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందా? లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం కఠినమైన నిబంధనలు విధిస్తుందా? కళాకారులను గౌరవించడంలో తప్పు లేదు, కానీ ఆ గౌరవం పొందే అర్హత సదరు కళాకారులకు ఉండాలి. ఆంధ్రా గడ్డపై షూటింగ్ చేయకుండా, ఆంధ్రా సమస్యలపై స్పందించకుండా, కేవలం టికెట్ డబ్బుల కోసం వచ్చే వారికి ‘నంది’ ఇవ్వడం అంటే ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడమే. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి కందుల దుర్గేష్ ఒక్కసారి పునరాలోచించుకోవాలి.
















