NewsDabba

Freebies: ఉచితాల ఊబిలో ఉజ్వల భారతం!

Freebies: అభివృద్ధి అంటే ఆస్తుల సృష్టి.. కానీ మన పాలకులు ‘అప్పుల’ సృష్టిని అభివృద్ధిగా భ్రమింపజేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలు ప్రజా శ్రేయస్సు కోసం రాసే ప్రణాళికలు కావు, అవి ప్రభుత్వ ఖజానాను లూటీ చేసే అధికారిక అనుమతి పత్రాలు. సుప్రీంకోర్టు తాజా హెచ్చరికల నేపథ్యంలో, భారత ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న ‘ఉచిత సంస్కృతి’పై (Freebies culture) మరోసారి చర్చించుకోవాల్సి సమయం ఆసన్నమైంది.

పాలకుల కళ్లు తెరిపించే హెచ్చరిక

భారత ప్రజాస్వామ్యం నేడు ఒక వింతైన, భయంకరమైన సంకట స్థితిని ఎదుర్కొంటోంది. రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో విసిరే ‘ఉచిత’ తాయిలాలపై (Freebies) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సంధించిన ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను చర్చకు దారితీశాయి. “ఉచిత పథకాలు సంక్షేమమా లేక ఓటర్లను ప్రలోభపెట్టే లంచాలా?” అంటూ ధర్మాసనం నిలదీసిన తీరు.. పాలకుల దివాళాకోరు రాజకీయాలను నిలదీస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చే అహేతుక హామీలు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయని, ఇది శ్రీలంక లాంటి వినాశనానికి దారితీస్తుందని న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు. కానీ, కోర్టులు నెత్తీనోరు బాదుకుంటున్నా, పాలకుల చెవికి ఆ హెచ్చరికలు చేరడం లేదనేది అక్షర సత్యం.

Beyond the Veil of Marriage: The Battle for Bodily Autonomy
Marital Rape: భార్య శరీరంపై భర్తకు హక్కుందా?

రాజకీయ నాటకాలు – పాలకుల స్వార్థం

ఒకవైపు ప్రజలకు పని కల్పించి, వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించాల్సిన పాలకులు, మరోవైపు వారిని కేవలం ‘నగదు లబ్ధిదారులు’గా మార్చి యాచక స్థితికి (Beggers) దిగజారుస్తున్నారు. రాజకీయ నేతలకు కావాల్సింది ఐదేళ్ల అధికారం. దానికోసం వారు దశాబ్దాల భవిష్యత్తును పణంగా పెడుతున్నారు. ఒక రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి, వేలమందికి ఉద్యోగాలు కల్పించడం కష్టంతో కూడుకున్న పని. దానికి ప్రణాళిక, శ్రమ, పారదర్శకత కావాలి. అదే నెలకు వెయ్యో, రెండు వేలో నేరుగా ఖాతాల్లో వేస్తే.. ఓట్లు రాలతాయని పాలకులు భావిస్తున్నారు. ఈ నాటకంలో పాలకులు ‘దాతలు’గా (Donors) నటిస్తుంటే, శ్రమశక్తి కలిగిన ప్రజలు క్రమంగా ‘యాచకులు’గా (Beggers) మారిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Naa Anveshana: దారి తప్పిన ‘అన్వేషణ’..! దూల తీర్చిన పోలీసులు!!

దక్షిణాది రాష్ట్రాల అప్పుల కుప్పలు

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ ఉచితాల (Freebies) సంస్కృతి పరాకాష్టకు చేరింది. ఏపీని ఉదాహరణగా తీసుకుంటే, అక్కడ సంక్షేమం పేరుతో జరుగుతున్న ఆర్థిక విధ్వంసం వర్ణనాతీతం. రాజధాని లేని రాష్ట్రంగా, పరిశ్రమలు రాని ప్రాంతంగా మిగిలిపోయిన ఏపీలో.. లోటు బడ్జెట్ ఉన్నా అప్పు తెచ్చి మరీ నగదు పంపిణీ చేయడం అనేది ఒక ఆర్థిక నేరం. అక్కడ ప్రభుత్వ ఆదాయం వడ్డీలు కట్టడానికే సరిపోవడం లేదు. తెలంగాణలో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. మిగులు బడ్జెట్‌తో ప్రయాణం మొదలుపెట్టిన రాష్ట్రం, నేడు ఆరు లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. తమిళనాడులో ఉచిత విద్యుత్ నుండి మహిళలకు నగదు బదిలీ వరకు సాగుతున్న పోటీ, ఆ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలబెట్టింది.

సోమరిపోతులుగా మారుతున్న శ్రమశక్తి

ఈ ఉచితాల (Freebies) సంస్కృతి ప్రజలను క్రమంగా సోమరిపోతులుగా మారుస్తోంది. “పని చేయకపోయినా ప్రభుత్వం డబ్బులు వేస్తుంది, బియ్యం ఇస్తుంది, కరెంటు ఇస్తుంది” అనే ధీమా పెరగడం వల్ల శ్రమ పట్ల గౌరవం నశిస్తోంది. దీనివల్ల వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు కూలీలు దొరకక కుదేలవుతున్నాయి. నైపుణ్యం లేని మానవ వనరులతో ఏ దేశం కూడా అగ్రరాజ్యంగా ఎదగలేదు. ప్రపంచం కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ దిశగా దూసుకుపోతుంటే, మన పాలకులు మాత్రం ప్రజలను గత కాలపు సబ్సిడీల గొలుసులతో బంధిస్తున్నారు. నైపుణ్యాల పెంపుదల లేదు, మౌలిక సదుపాయాల కల్పన ఊసే లేదు.

The Shocking ₹22,000 Cr Bank Settlement Reality
Subhash Chandra: ప్రజాధనం లూటీకి అడ్డాగా దివాలా చట్టం?!

ప్రజలు గ్రహించని ‘పరోక్ష భారం’ – ఉచితం ఒక భ్రమ!

ప్రజలు ఒక చేదు నిజం తెలుసుకోవాలి: ప్రభుత్వం ఇచ్చే ఏదీ ఉచితం కాదు. మీకు పది రూపాయలు ఉచితంగా ఇస్తున్నారంటే, మీ జేబులోంచి వంద రూపాయలు పరోక్ష పన్నుల రూపంలో లాగేస్తున్నారని అర్థం. పెట్రోల్ ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు వెనుక ఉన్నది ఈ ఉచితాల భారమే. నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందిస్తే సామాన్యుడు తన సంపాదనలో 60 శాతం ప్రైవేట్ సంస్థలకు ధారపోయాల్సిన అవసరం ఉండదు. కానీ పాలకులు ఆ దిశగా ఆలోచించరు. ఎందుకంటే ప్రజలు విద్యావంతులైతే ప్రశ్నిస్తారు. అదే వారిని ఉచితాల మత్తులో ఉంచితే ఓట్లు వేస్తారు.

కళ్ల ముందే దివాళా తీసిన ‘ఉచిత’ దేశాలు

ప్రపంచ చరిత్రలో వెనిజులా, గ్రీస్, శ్రీలంక వంటి దేశాలు ఎలా దివాళా తీశాయో చూస్తే మన భవిష్యత్తు కనిపిస్తుంది. చమురు సంపద ఉన్న వెనిజులా నేడు ఆకలితో అలమటిస్తోంది. కారణం.. జనాకర్షక పథకాల పేరుతో విచ్చలవిడిగా నిధులు వెచ్చించడమే. మన రాష్ట్రాలు కూడా నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. ఆర్బీఐ నివేదికలు పదేపదే హెచ్చరిస్తున్నా, కాగ్ (CAG) అప్పుల చిట్టాను విప్పుతున్నా పాలకుల తీరులో మార్పు రావడం లేదు. లోటు బడ్జెట్ ఉన్నా అప్పు తెచ్చి పప్పు కూడు తినే ఈ దివాళాకోరు సంస్కృతికి స్వస్తి పలకకపోతే, రేపటి ఉదయం అప్పుల అమావాస్యలో కలిసిపోవడం ఖాయం.
ఇది కూడా చదవండి: Rape Attempt : అక్కడ టచ్ చేస్తే అత్యాచారం కాదా..?

నైపుణ్యం లేని భారతం – అభివృద్ధికి గొడ్డలిపెట్టు

నిజమైన అభివృద్ధి అంటే చేపను ఉచితంగా ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించడం. కానీ మన పాలకులు ప్రజలకు ‘చేపలు పట్టడం’ నేర్పాల్సింది పోయి, ప్రతిరోజూ వారిని ‘చేపల కోసం’ క్యూలో నిలబెట్టారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా, పరిశ్రమలను ఆకర్షించకుండా కేవలం నగదు పంపిణీ చేస్తే.. సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతాయే తప్ప తగ్గవు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారిని పన్ను చెల్లింపుదారులుగా మార్చాల్సింది పోయి.. వారిని శాశ్వత లబ్ధిదారులుగా మార్చడం జాతికి జరిగే పెద్ద ద్రోహం.

Kriti Sanon Rakhi Ad Controversy
Kriti Sanon Rakhi Ad: సంస్కృతి పరిరక్షణా? సంకుచిత రాజకీయమా?

మేల్కొనే సమయం ఆసన్నం

పాలకులు తమ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతుంటే చూస్తూ ఊరుకోవడం దేశద్రోహం కిందే లెక్క.
ఆర్థిక క్రమశిక్షణ: ప్రతి పథకంపై ‘ఆర్థిక ప్రభావ విశ్లేషణ’ జరగాలి. అప్పు తెచ్చి నగదు పంపిణీ చేయడాన్ని చట్టరీత్యా నేరంగా పరిగణించాలి.
మౌలిక సదుపాయాలపై పెట్టుబడి: ఉచితాలకు ఇచ్చే నిధులను రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, ఐటీ పార్కులపై ఖర్చు చేస్తే అవి సంపదను సృష్టిస్తాయి.
ప్రజా చైతన్యం: “మాకు భిక్ష వద్దు.. ఉపాధి కావాలి, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు కావాలి, మెరుగైన ఆస్పత్రులు కావాలి” అని ప్రజలు ఏనాడు నిలదీస్తారో, ఆనాడే ఈ దేశానికి విముక్తి.

ఉచితాల అలవాటు ఒక వ్యసనం లాంటిది. ఇది మొదట్లో బాగున్నా, మెల్లగా వ్యవస్థను లోపల నుండి తినేస్తుంది. సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడైనా పాలకులు తమ రాజకీయ నాటకాలను ఆపి, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ప్రజలు కూడా ఒక ఓటును కేవలం కొన్ని వేల రూపాయలకో, తాయిలాలకో అమ్ముకుంటే.. వారు అమ్ముతున్నది తమ ఓటును కాదు, తమ బిడ్డల భవిష్యత్తును అని గ్రహించాలి. అభివృద్ధి పథంలో పయనించే నవ భారత నిర్మాణం అప్పుల మీద కాదు.. ప్రజల ఆశయాలు, వారి చెమట చుక్కల మీద జరగాలి. లేదంటే, చరిత్ర పుటల్లో మనం ఒక ‘దివాళా తీసిన జాతి’గా మిగిలిపోతాం. మేల్కొనాల్సిన సమయం మించిపోతోంది.. ఆలోచించండి!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment