NewsDabba

Madabhushi Sridhar: మేధో ముసుగులో అమరావతిపై అక్షర దాడి

Madabhushi Sridhar: రాజకీయ పక్షపాతం మేధావి ముసుగు వేసుకుంటే అది సమాజానికి శాపం. సత్యం గొంతు నొక్కడానికి అబద్ధాలను అలంకరించి వడ్డించడం మేధో దివాళాకోరుతనం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై (Amaravati) తాజాగా మాడభూషి శ్రీధర్ (Madabhushi Sridhar) చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయం కాదు; అవి ఒక వ్యవస్థీకృత కుట్రలో భాగం. అమరావతిని ‘శూన్యం’ అని ఈసడించుకోవడం అంటే, ముప్పై మూడు వేల ఎకరాల త్యాగాన్ని తూలనాడటమే. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతల భజన బృందమా?

విభజన విషాదం – అసంపూర్ణ స్వప్నం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఒక దశాబ్దం దాటిపోయింది. ఆధునిక భారతదేశ చరిత్రలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం ఒక చారిత్రక విషాదం. 2014 జూన్ 2న విభజన జరిగినప్పటి నుండి, రాష్ట్రానికి ఒక స్థిరమైన పరిపాలనా కేంద్రం లేకుండా పోవడం అనేది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు, అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి జరిగిన అవమానం. ఒక వైపు హైదరాబాద్ వంటి విశ్వనగరాన్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రజలకు, అమరావతి (Amaravati) రూపంలో ఒక ఆశ చిగురించింది. కానీ, ఆ ఆశను చిదిమేయడానికి సామాన్య రాజకీయ శక్తులతో పాటు, ఇప్పుడు ‘మేధావులు’ అని పిలవబడే వారు కూడా నడుం బిగించడం అత్యంత దౌర్భాగ్యం.

అమరావతి: ప్రజా సంకల్పమా? లేక గారడీ విద్య?

కేంద్ర మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ (Madabhushi Sridhar0 తన తాజా వ్యాసంలో అమరావతిని (Amaravati) “గారడీ వీరుడు శూన్యం నుంచి పుట్టించిన మాయ” అని అభివర్ణించారు. ఒక న్యాయకోవిదుడిగా పేరున్న వ్యక్తి నుంచి ఇలాంటి అసత్యపు వక్రీకరణలు రావడం విచారకరం. అమరావతి అనేది శూన్యం నుంచి పుట్టిన మాయ కాదు, అది 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించిన వేలాది మంది రైతుల నమ్మకం. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకే పిలుపుతో వేల ఎకరాలను ప్రభుత్వానికి ‘ల్యాండ్ పూలింగ్’ ద్వారా అప్పగించిన ఉదంతం అమరావతి. దీనిని ‘శూన్యం’ అనడం అంటే ఆ రైతుల త్యాగాన్ని, ఆ భూమిని నమ్ముకున్న కష్టజీవుల చెమటను అవమానించడమే.

YS Jagan
YS Jagan: అన్యాయానికి అండగా నిలబడడమే జగన్ రాజకీయామా?

చంద్రబాబు నాయుడు అమరావతిని (Amaravati) ఒక భ్రమగా సృష్టించారని విమర్శించే మేధావులు, ఒక మౌలిక ప్రశ్నను ఎందుకు విస్మరిస్తున్నారు? 2014-15లో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు, ఇదే మాడభూషి శ్రీధర్ (Madabhushi Sridhar) సమర్థించే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) అసెంబ్లీలో ఏం చెప్పారు? “30 వేల ఎకరాల కంటే తక్కువ భూమి రాజధాని ఉండకూడదు, నేను దీనిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను” అని నాడు జగన్ అన్న మాటలు రికార్డుల్లో లేవా? నాడు జగన్ కూడా చంద్రబాబు గారడీకి లోనయ్యారా? లేక నేడు అధికారం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీధర్ వంటి వారు సత్యాన్ని పాతరేస్తున్నారా?

వికేంద్రీకరణ – ఒక మేధోవంచన

మాడభూషి శ్రీధర్ (Madabhushi Sridhar) తన వ్యాసంలో వికేంద్రీకరణ సూత్రాన్ని అమితంగా పొగిడారు. జగన్ (YS Jagan) ప్రతిపాదించిన మూడు రాజధానుల ముచ్చట చాలా గొప్పదని కితాబు ఇచ్చారు. ఇక్కడే మేధావుల ద్వంద్వ ప్రమాణాలు బయటపడుతున్నాయి. శ్రీధర్ తెలంగాణ గడ్డపై పుట్టి పెరిగిన వారు. హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమలు, సచివాలయం, హైకోర్టు అన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. మరి హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించడానికి తెలంగాణలో మూడు రాజధానులు కావాలని ఆయన ఎందుకు అడగరు? వరంగల్‌లో న్యాయ రాజధాని, కరీంనగర్‌లో శాసన రాజధాని, ఆదిలాబాద్ లో కార్యనిర్వాహక రాజధాని పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ధైర్యం ఆయనకు ఉందా? ఒక రాష్ట్రానికి ఒక నీతి, మరో రాష్ట్రానికి మరో నీతి – ఇదేనా మేధావి లక్షణం? ఆంధ్రప్రదేశ్‌ను ప్రయోగశాలగా మార్చి, అక్కడి ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవడానికి వికేంద్రీకరణ అనే పదాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం మేధోవంచన కాక మరేమిటి?

పార్లమెంట్ చట్టం – తప్పనిసరి పరిస్థితి

2026లో పార్లమెంట్ అమరావతిని (Amaravati) రాజధానిగా గుర్తించడం పట్ల శ్రీధర్ (Madabhushi Sridhar) అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పార్లమెంట్ జోక్యం చేసుకోవాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్ణయించే అధికారం ఉన్నప్పటికీ, ఆ అధికారాన్ని ప్రజల వినాశనానికి వాడుకున్నప్పుడు కేంద్రం ప్రేక్షకపాత్ర వహించాలా? గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కోర్టుల తీర్పులను బేఖాతరు చేస్తూ, అభివృద్ధిని అడ్డుకుంటూ, రాజధాని విషయంలో నిరంతర అయోమయాన్ని సృష్టిస్తే, అయిదు కోట్ల ప్రజల అభద్రతను తొలగించడానికి పార్లమెంట్ చట్టం చేయడం చారిత్రక అవసరం. ఒక వ్యవస్థను ధ్వంసం చేసిన వారిని వదిలేసి, ఆ వ్యవస్థను బాగు చేయడానికి వచ్చిన చట్టాన్ని విమర్శించడం శ్రీధర్ రాజకీయ పక్షపాతానికి పరాకాష్ఠ.

న్యాయ వ్యవస్థపై దాడి: రాజ్యాంగ విరుద్ధ వాదనలు

న్యాయకోవిదుడిగా పేరున్న శ్రీధర్, హైకోర్టు తీర్పులను ప్రశ్నించడం అత్యంత ప్రమాదకరమైన ధోరణి. రాజధాని ఎక్కడ ఉండాలో కోర్టులు నిర్ణయిస్తాయా అని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రాథమిక వాస్తవాన్ని వక్రీకరించడమే. హైకోర్టు ‘అమరావతిని మేమే ఎంపిక చేశాం’ అని ఎప్పుడూ చెప్పలేదు. కోర్టు చెప్పింది ఒక్కటే: “ప్రభుత్వం రైతులతో ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించాలి. వాగ్దాన భంగం చేయడం చట్టవిరుద్ధం.” ఒక ప్రభుత్వం తన పౌరులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పడం న్యాయ వ్యవస్థ విధి. దీనిని ‘న్యాయ వ్యవస్థ అతిక్రమణ’గా చిత్రీకరించడం అంటే, ప్రభుత్వాల నియంతృత్వానికి న్యాయ రక్షణ కల్పించడమే అవుతుంది. ఒప్పందాలను ఉల్లంఘించే హక్కు ప్రభుత్వాలకు ఉంటుందని శ్రీధర్ భావిస్తున్నారా? ఇదేనా ఆయన బోధించే రాజ్యాంగ ధర్మం?

Kadambari Jethwani
Kadambari Jethwani : బాధితురాలా? నిందితురాలా? సీఐడీ సెన్సేషన్ రిపోర్ట్

‘మావిగన్’ (MAVIGAN) – సరికొత్త రాజకీయ ప్రహసనం

మూడు రాజధానుల అట్టర్ ఫ్లాప్ షో తర్వాత, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) (MAVIGUN) అనే కొత్త మంత్రాన్ని జపిస్తున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చాలని ఐదేళ్ల పాటు గొంతు చించుకున్న వారు, ఇప్పుడు హఠాత్తుగా 110 కిలోమీటర్ల హైవే వెంట రాజధానిని విస్తరిస్తామంటున్నారు. వికేంద్రీకరణ కావాలని గతంలో వాదించిన నోళ్లే, ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతంలో రియల్ ఎస్టేట్ లాబీలకు లాభం చేకూర్చే ‘హైవే రాజధాని’ని సమర్థిస్తున్నాయి. శ్రీధర్ ఈ ‘మావిగన్’ ప్రతిపాదనకు అద్భుతమైన సర్టిఫికేట్ ఇవ్వడం వారి మేధో దివాళాకోరుతనానికి అద్దం పడుతోంది. అమరావతిని అడ్డుకోవడమే పరమావధిగా సాగుతున్న ఈ రాజకీయ డ్రామాలో, మేధావులు కేవలం పాత్రధారులుగా మిగిలిపోవడం విచారకరం.

ఇది కూడా చదవండి

మేధావుల బాధ్యత – అక్షర సత్యం

సమాజంలో మేధావులు అనేవారు దిక్సూచిలా ఉండాలి. వారు అధికార పక్షానికి కొమ్ముకాయడం మొదలుపెడితే సామాన్యుడి గొంతుక నలిగిపోతుంది. అమరావతిని (Amaravati) ‘మాయాజాలం’ అని ముద్ర వేసే ముందు, ఆ మండుటెండలో 2000 రోజులకు పైగా రోడ్లపై కూర్చున్న రైతుల ఆవేదనను శ్రీధర్ ఎందుకు చూడలేకపోయారు? రాజధాని లేక పెట్టుబడులు రాక, ఉపాధి దొరకక వలస వెళ్తున్న ఆంధ్ర యువత కన్నీళ్లు వారికి ఎందుకు కనిపించవు? రాజకీయ నాయకులు అధికారం కోసం వెయ్యి అబద్ధాలు ఆడవచ్చు, కానీ మేధావి అని పిలుచుకునే వ్యక్తి ఒక పార్టీ అజెండాను తన అక్షరాల్లో నింపుకుంటే, ఆ మేధస్సుకే మాయని మచ్చ.

ఆంధ్రుల ఆత్మగౌరవ పోరాటం

అమరావతి (Amaravati) కేవలం ఇటుకలు, సిమెంట్ కట్టడం కాదు. అది ఒక రాష్ట్ర ప్రజల ఆత్మవిశ్వాసం. దానిని కూలదోయాలని చూసే రాజకీయ శక్తులకు, వారికి వంత పాడే అద్దె మేధావులకు ఆంధ్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. మాడభూషి శ్రీధర్ (Madabhushi Sridhar) వంటి వారు రాసే అక్షరాలు కాలగర్భంలో కలిసిపోతాయి, కానీ అమరావతి కోసం జరిగిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఒక అబద్ధాన్ని వెయ్యి సార్లు చెబితే అది నిజం కాదు, అది కేవలం ఒక ‘పెద్ద అబద్ధం’గానే మిగిలిపోతుంది. అమరావతిపై జరుగుతున్న ఈ మేధో దాడిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడిపై ఉంది.

Revanth Reddy
Revanth Reddy: దమ్మున్న నాయకుడి దిమ్మతిరిగే వ్యూహం!

ప్రజలు ఆలోచించాలి: మేధావి ముసుగులో వస్తున్న ఈ విషపూరిత వాదనలు రాష్ట్ర భవిష్యత్తు కోసమా లేక ఒక రాజకీయ నాయకుడి అహాన్ని సంతృప్తి పరచడానికా? సత్యం ఎప్పుడూ నిప్పులాంటిది, దానిని అబద్ధాల ముసుగుతో ఎంతకాలం కప్పి ఉంచలేరు.


WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment