NewsDabba

Mamata Benerjee : టచ్‌ చేసి చూడండి… దేశాన్ని షేక్ చేస్తా…! మమతా బెనర్జీ వార్నింగ్

Updated on: December 24, 2025 | By Editorial Team

Mamata Benerjee : మమతా దీదీ మొదలెట్టేశారు. కాషాయంపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. నా జోలికొస్తే బిడ్డా మీ సంగతి చూస్తా అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడైనా మీ ఆటలు సాగుతాయేమో కానీ నా దగ్గర కాదంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు AI ఓట్లు అంటూ బీజేపీపై కొత్త బాంబ్‌ విసిరారు.

బీహార్‌ వార్‌ ముగియడంతో కమలదళం బెంగాల్‌పై ఫోకస్‌పెట్టింది. ఎప్పట్నుంచో అందని ద్రాక్షలా ఊరిస్తున్న వంగభూమిని కైవసం చేసుకునేందుకు కాషాయదళం వ్యూహరచనలో మునిగిపోయింది. మరోసారి బెంగాల్‌ను గెలుచుకుని తన సత్తా చాటాలని దీదీ పట్టుదలతో ఉన్నారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే వార్‌ షురూ అయ్యింది.

Beyond the Veil of Marriage: The Battle for Bodily Autonomy
Marital Rape: భార్య శరీరంపై భర్తకు హక్కుందా?

బెంగాల్ రణరంగమేనా..?

బీహార్‌ అంటే ప్రశాంతంగా నడిచిపోయింది కానీ బెంగాల్‌ అలాకాదు. ఎన్నికల రణరంగం మోతెక్కిపోవాల్సిందే. శీతాకాలంలోనే ఎన్నికల వేడి బెంగాల్‌ను గట్టిగానే తాకింది. కమలంపై కారాలు మిరియాలు కుంపట్లో వేసి నూరుతున్న మమతాబెనర్జీ (Mamata Benerjee ) ఓటర్ల జాబితా సవరణపై నిరసనతో తన యుద్ధాన్ని మొదలుపెట్టారు. స్పెషల్‌ ఇంటెన్సివ్ రివిజన్ – SIRకు వ్యతిరేకంగా ఆమె కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలన్నాక ర్యాలీలు, నిరసనలు మామూలే. కానీ అక్కడ చేసింది ఓ ముఖ్యమంత్రి… అది కూడా మమతాబెనర్జీ కావడంతో అది హైలెట్ అయ్యింది. ఈ ర్యాలీలోనే బీజేపీకి మమతాబెనర్జీ ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ అనడం కంటే దాన్ని సవాల్ అనాలేమో… ఓటర్ల సవరణ అంటూ మాజోలికొస్తే మాత్రం దేశాన్ని కదిలిస్తామన్నారు. పనిలోపనిగా బీహార్ ప్రతిపక్ష పార్టీలపై జాలి చూపించారు మమత. వాళ్లంటే పిచ్చోళ్లు కాబట్టి బీజేపీ గేమ్‌ అర్థం చేసుకోలేకపోయారు కానీ నేను మాత్రం అలాకాదు… నాకు కమలం ఆట బాగా తెలుసు అని చెప్పుకొచ్చారు. బెంగాల్‌లో వారి ఆటలు సాగబోవన్నారు.

బీజేపీపై మరో అతిపెద్ద ఆరోపణ చేశారు మమత. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి బీజేపీ డూప్లికేట్ ఓట్లను తయారు చేస్తోందని… వాటి సాయంతో ఎన్నికలను రిగ్ చేస్తోందన్నారు దీదీ. ఇది బీజేపీ కొత్తప్లాన్ అని… 2024 ఎన్నికల్లో కూడా దీన్ని అడ్డుపెట్టుకునే మోడీ గెలిచారంటూ మరో బాంబ్‌ వేశారు. తాను ఉన్నంతకాలం బెంగాల్‌లో ఎవరి ఓట్లూ తొలగించలేరన్నారు మమత. నిజంగా బంగ్లాదేశీలే సమస్య అయితే మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లో కూడా ఓటర్ల సవరణ ఎందుకు చేస్తున్నారన్నది ఆమె ప్రశ్న. రైళ్లు, విమానాలు, సరిహద్దులు అన్నీ కేంద్ర సంస్థల నిఘాలో ఉన్నప్పుడు అసలు బంగ్లాదేశీలు బెంగాల్‌లోకి ఎలా వచ్చారంటూ కేంద్రాన్ని నిలదీశారు దీదీ.

మమతకు (Mamata Benerjee )నల్లేరుపై నడక కాదా.?

వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు జరగనున్నాయి. 29ఏళ్ల పాటు బెంగాల్‌ను ఏలిన కమ్యునిస్టు కంచుకోటను బద్దలుకొట్టిన మమతాబెనర్జీ (Mamata Benerjee ) … 2011లో అధికారంలోకి వచ్చారు. వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ కొట్టి తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు. కానీ గత ఎన్నికల్లో కాషాయదళం నుంచి కొంత ప్రతిఘటన ఎదురైంది. 2016లో కేవలం మూడంటే మూడుసీట్లు గెలిచిన బీజేపీ… 2021 నాటికి 77సీట్లకు పెరిగి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. నిజానికి ఆ ఎన్నికల్లోనే బీజేపీ మమతను గద్దె దించడానికి గట్టిగానే ప్రయత్నించినా అధి సాధ్యం కాలేదు. 2024 జనరల్‌ ఎలక్షన్స్‌లో కూడా మమతా మరోసారి తన సత్తా చాటారు. 42లోక్‌సభ సీట్లకు గాను 29గెలిచారు. అయితే 2026 మాత్రం మమతాబెనర్జీకి అంత ఈజీ కాదనే చెప్పాలి. కంట్లో నలుసులా మారిన మమతను గద్దెదించి బెంగాల్‌లో ఎలాగైనా గెలవాలని బీజేపీ హస్తిన పెద్దలు గట్టిగా పట్టుబట్టుకు కూర్చున్నారు. గతంతో పోల్చితే బెంగాల్‌లో బీజేపీ బలం పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ఉత్తర, దక్షిణ జిల్లాల్లో కమలం కాస్త పుంజుకుంది. ఓట్‌షేర్ కూడా పెరిగిందని లెక్కలు వేస్తున్నారు. అయితే అది చాలదని బీజేపీ పెద్దలకు తెలుసు. మరో ఆరుశాతం మంది ఓటర్లను తనవైపు తిప్పుకుంటేనే బెంగాల్‌ తమ వశమవుతుంది. అది అంత ఈజీ కాదు. కాబట్టి వ్యూహాలకు పదును పెడుతోంది.

The Shocking ₹22,000 Cr Bank Settlement Reality
Subhash Chandra: ప్రజాధనం లూటీకి అడ్డాగా దివాలా చట్టం?!

కమలం సమర వ్యూహాలేంటి…?

బెంగాల్‌లో గెలుపు కోసం బీజేపీ ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసింది. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించింది. మళ్లీ వాటిని చిన్నచిన్న పార్టులుగా విభజించారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్కరిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. కచ్చితంగా తాము గెలిచే నియోజకవర్గాలు, గెలవడానికి అవకాశం ఉన్న నియోజకవర్గాలు, కాస్త కష్టపడితే గెలిచే స్థానాలు, గెలుపు అసాధ్యమనుకున్న నియోజకవర్గాల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ అంటే పడని తృణముల్‌ నేతలను టార్గెట్ చేసింది బీజేపీ. వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అలాంటి నేతలను ఆకర్షించగలిగితే తృణముల్‌కు, కార్యకర్తలకు మధ్య లింక్ తెగిపోతుందని బీజేపీ భావిస్తోంది. 2021లో అభిషేక్ అంటే పడని సువేందు అధికారిని తనవైపు తిప్పుకోవడం బీజేపీకి కలసి వచ్చింది. నందిగ్రామ్‌లో ఏకంగా మమతా బెనర్జీనే ఓడించారు సువేందు. అలాగే భవిష్యత్‌ సీఎంగా చెప్పుకుంటున్న అభిషేక్ బెనర్జీ టార్గెట్‌గా వారసత్వ రాజకీయాన్ని తెరపైకి తెస్తోంది.

ఈసారి కులం కాదు మతం

బీహార్‌లో బీజేపీ క్యాస్ట్‌ అర్థమెటిక్‌లో సక్సెస్ అయ్యింది. కానీ బెంగాల్‌లో మాత్రం వేరే వ్యూహాన్ని అమలు చేయబోతోంది. బెంగాల్‌లో కులం అంత కీలకం కాదు. అందుకే మతపరమైన లెక్కలను బయటకు తీస్తోంది కమలం. బెంగాల్‌ జనాభాలో 30శాతం ముస్లింలున్నారు. కానీ వారు 30-40స్థానాల్లో మాత్రమే గెలుపోటములను వారు ప్రభావితం చేయగలరు. పైగా వారు బీజేపీకి ఓటేస్తారన్న ఆశలు తక్కువే. కాబట్టి హిందూ ఓట్లను ఏకీకృతం చేయాలని బీజేపీ ఆలోచిస్తోంది. హిందుత్వాన్ని రగిలించగలిగితే హిందూ ఓటర్లు పోలరైజ్ అయ్యి బీజేపీకి కలసి వస్తుందని గట్టిగా నమ్ముతోంది ఆ పార్టీ.

మొత్తంగా చూస్తే ఈసారి పశ్చిమబెంగాల్‌ ఎన్నికలు మాములుగా ఉండే అవకాశాలైతే లేవు. అటు బీజేపీ, ఇటు తృణమూల్ రెండూ తగ్గేలా లేవు. ఇప్పటికే రెండు పార్టీల కార్యకర్తలు ఎదురైతే తలలు పగులుతున్నాయి. బాంబులు పేలుతున్నాయి. ఇక ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో మరి….!

Kriti Sanon Rakhi Ad Controversy
Kriti Sanon Rakhi Ad: సంస్కృతి పరిరక్షణా? సంకుచిత రాజకీయమా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment