NewsDabba

Vijay: తమిళనాడు వర్సెస్ ఏపీ రాజకీయం!

Vijay: తమిళనాడు రాజకీయ యవనికపై నటుడు విజయ్ (Vijay) సృష్టించిన ప్రభంజనం ఇప్పుడు ఏపీలో వేడి పుట్టిస్తోంది. విజయ్ విజయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan), పవన్ కల్యాణ్  (Pawan Kalyan) రాజకీయ ప్రస్థానాలతో పోల్చడం ఒక సామాజిక చర్చగా మారింది. అయితే, ఈ పోలిక ప్రాథమికంగానే లోపభూయిష్టమైనదని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు (Tamilnadu) రాజకీయ భౌగోళిక పరిస్థితులు, ఓటర్ల నాడి వేరు.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) క్షేత్రస్థాయి సమీకరణాలు వేరు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ఒక అనూహ్య పరిణామం అయితే, అతని గెలుపు కేవలం వ్యూహాత్మక చతురత వల్లనో, ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తుగడల వల్లనో రాలేదు. అది ప్రధానంగా స్టాలిన్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత, అన్నాడీఎంకే-బీజేపీల మధ్య కుదిరిన అపవిత్ర కలయిక పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఫలితంగా వచ్చిన ఒక ‘వేవ్’ మాత్రమే. విజయ్ (Vijay) తన ఫ్యాన్ ఫాలోయింగ్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు అతనికి ఒక ఆల్టర్నేటివ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి, తద్వారా ద్రావిడ రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలకు ఆయన ఒక కొత్త ఆశాకిరణంగా కనిపించారు.

జగన్‌ రాజకీయ ప్రస్థానం

జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే, అది విజయ్ మాదిరిగా అనుకోకుండా వచ్చిన అవకాశం కాదు. రాజశేఖర్ రెడ్డి (YSR) అనే మహా వృక్షం నీడన పెరిగి, రాజకీయ ఓనమాలు నేర్చుకున్న జగన్ కు రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న పరిస్థితులు కలిసివచ్చాయి. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం, ఆ కేడర్ మొత్తం వైసీపీ (YCP) వైపు మళ్లడం వల్ల పార్టీ ఆవిర్భావం నుంచే ఆయనకు బలమైన పునాది ఏర్పడింది. 2019లో టీడీపీ (TDP) వైఫల్యాలను సొమ్ము చేసుకుని అప్రతిహత విజయాన్ని అందుకున్న జగన్, ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. ఆయన ఓటమికి కారణాలు జగమెరిగిన సత్యాలే అయినా, ఒక బలమైన రాజకీయ వారసత్వం ఉండి కూడా అధికారాన్ని చేజార్చుకోవడం ఆయన రాజకీయ వ్యూహాల లోపంగానే పరిగణించాలి. విజయ్ (Vijay) లాంటి వారికి లభించిన కాలం కలిసివచ్చే అంశం జగన్ కు మొదటి నుంచి ఉన్నా, ప్రజా క్షేత్రంలో నిలకడ లేని నిర్ణయాలు ఆయనకు ప్రతిబంధకంగా మారాయి.

Kerala Politics
Kerala Politics : కేరళ నేర్పుతున్న పొలిటికల్ పాఠాలేంటి?

పవన్ రాజకీయం.. గందరగోళం

ఇక పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాజకీయం ఒక నిరంతర గందరగోళంలా కనిపిస్తుంది. ప్రజారాజ్యంలో (Prajarajyam) తన అన్న చిరంజీవి (Chiranjeevi) వెనుక ఉండి నడిపిన పాత్ర నుంచి, ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం పవన్ కు ఒక పెద్ద రాజకీయ పాఠం నేర్పింది. సొంతంగా జనసేనను (Janasena) స్థాపించినప్పటికీ, రాష్ట్ర విభజన సమయంలో పార్టీకి తగినంత బలం లేకపోవడంతో 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతుగా నిలవాల్సి వచ్చింది. 2019లో ఒంటరిగా పోరాడి రెండు చోట్ల ఓడిపోవడం, కేవలం ఒక్క సీటుకే పరిమితం కావడం పవన్ రాజకీయ శక్తిని ప్రశ్నార్థకం చేసింది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం (Kapu Caste) తనను అక్కున చేర్చుకుంటుందని భావించినా, భీమవరం, గాజువాక వంటి చోట్ల పరాజయం పాలవ్వడం పవన్ కు పెద్ద ఎదురుదెబ్బ. ఈ చేదు అనుభవాల నుంచే ఆయన మేల్కొని, సొంత కేడర్ కంటే పొత్తుల పైనే ఎక్కువ ఆధారపడే పరిస్థితికి చేరుకున్నారు.

కులం ‘కాపు’ కాసిందా?

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పొత్తుల ద్వారా 2024లో విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు కొంతమంది ఆయన ఒంటరిగా పోటీ చేసి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని కొత్త రాగం అందుకుంటున్నారు. గతంలో ఒంటరిగా పోటీ చేసినప్పుడు అదే కాపు సామాజిక వర్గం (Kapu Caste) ఆయన్ను ఎందుకు గెలిపించలేదన్న ప్రశ్నకు వీరి వద్ద సమాధానం లేదు. ఇప్పుడు గెలిచిన తర్వాత మాట్లాడుతున్న ఈ “పెద్ద మాటలు” కేవలం అవకాశవాద రాజకీయాలకే నిదర్శనం. పవన్ కు తన సొంత పార్టీ బలం మీద కంటే ప్రజా క్షేత్రంలో అందరివాడుగా ఉండాలనే లక్ష్యం ఉంది. ఒక కులానికో, ఒక వర్గానికో పరిమితం కావడం మూర్ఖత్వమని గుర్తించిన పవన్, రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే వ్యూహాత్మక భాగస్వామ్యాలు తప్పవని గ్రహించారు. విజయ్ (Vijay) లాగా ఒక వేవ్ మీద గెలవడం కాకుండా, పవన్ కల్యాణ్ తన ఉనికి కోసం పదేళ్లు పోరాటం చేయాల్సి వచ్చింది.

నిజమైన గెలుపు ఎవరిది?

అవకాశవాద రాజకీయాలు ఎప్పుడూ తాత్కాలిక విజయాలనే అందిస్తాయి, కానీ శాశ్వతమైన మార్పును తీసుకురావు. విజయ్ (Vijay) గెలుపు ఒక మెరుపు లాంటిది కావచ్చు, కానీ జగన్, పవన్ ల ప్రస్థానం ఒక నిరంతర యుద్ధం. నాయకుడు అనే వాడు కేవలం తన సామాజిక వర్గాన్ని నమ్ముకుంటే రాజకీయాల్లో కనుమరుగవుతాడనే దానికి జగన్, పవన్ ల అనుభవాలే నిదర్శనం. ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు మాత్రమే విజయ్ లాంటి కొత్త మొహాలకు పట్టం కడతారు, కానీ ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం బలమైన కేడర్, స్పష్టమైన సిద్ధాంతం అవసరం. తమిళనాడులో గెలిచినంత మాత్రాన అది ఏపీలో కూడా పునరావృతం అవుతుందని భావించడం అమాయకత్వమే అవుతుంది.

Cancer Warrior Adrija Gan
Adrija Gan: చావుతో చదరంగం ఆడి గెలిచింది!

ఇది కూడా చదవండి: SVSN Varma: రాజకీయ బలిపీఠంపై పిఠాపురం ‘వర్మ’!

చివరగా, రాజకీయం అనేది కేవలం సినిమా గ్లామర్ తోనో లేక వారసత్వంతోనో నడిచే వ్యాపారం కాదు. అది ప్రజా నాడిని పట్టుకునే నిరంతర ప్రక్రియ. విజయ్ గెలుపును చూసి సంబరపడుతున్న వారు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను విమర్శిస్తున్న వారు ఒక విషయాన్ని గమనించాలి: రాజకీయాల్లో కాలం, సందర్భం చాలా ముఖ్యం. ఒకరి విజయం మరొకరికి పాఠం కావాలే తప్ప, పోలికలకు తావుండకూడదు. ఏపీ రాజకీయాల్లో జగన్ అధికారాన్ని కోల్పోవడం, పవన్ పొత్తులతో నెట్టుకురావడం, తమిళనాడులో విజయ్ అంచనాలకు మించి దూసుకుపోవడం.. ఇవన్నీ మారుతున్న ప్రజా తీర్పుకు నిదర్శనాలు. ఏ నాయకుడైనా కులాలకు, వర్గాలకు అతీతంగా ప్రజా క్షేత్రంలో మమేకమైనప్పుడే అసలైన విజయానికి అర్హుడు అవుతాడు.

UP Thunderstorms
Thunderstorms: ఆకాశం నుంచి ఊడిపడిన మృత్యుమేఘం!
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment