Chiranjeevi: ఒకనాడు మద్రాసును నమ్ముకున్న తెలుగు సినిమా (Telugu Cinema), మెల్లమెల్లగా హైదరాబాద్‌కు (Hyderabad) మకాం మార్చింది. ఆనాడు కదలడానికి దశాబ్దాలు పట్టింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విభజన గాయాలతో, లోటు బడ్జెట్‌తో కునారిల్లుతోంది. కానీ, సినిమా ఇండస్ట్రీకి (Cinema Industry) మాత్రం ఇవేవీ పట్టవు. తమ ఉనికి హైదరాబాద్‌లోనే అని గంటాపథంగా చెబుతున్న సినీ పెద్దలకు, ఏపీ కేవలం ఒక ‘కలెక్షన్ల ఏటీఎం’ మాత్రమేనా? అవసరానికి అండగా నిలబడే ప్రభుత్వాన్ని విమర్శించడం, అవమానించిన వారి ముందు మోకరిల్లడం టాలీవుడ్ నైజమా? తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ పట్ల ఇండస్ట్రీకి ఉన్న చులకన భావం మరోసారి బట్టబయలైంది.
కృతజ్ఞత లేని ‘కళా’ హృదయాలు!
తెలుగు చిత్ర పరిశ్రమలో (Tollywood) సింహభాగం నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఆంధ్ర (Andhra) ప్రాంతం నుంచి వచ్చిన వారే. సినిమా బాక్సాఫీస్ వద్ద ‘మెగా’ హిట్ కావాలన్నా, ‘రికార్డుల’ వర్షం కురవాలన్నా అది ఆంధ్రా ప్రేక్షకుల పుణ్యమే. కోస్తా, రాయలసీమ జనం తమ తిండి తిప్పలు మానుకుని టికెట్లు కొంటేనే ఇక్కడ హీరోలు ‘స్టార్లు’ అయ్యారు. కానీ, అదే రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు, అభివృద్ధిలో వెనుకబడినప్పుడు అండగా నిలవాలన్న ఆలోచన ఏ ఒక్క సినీ పెద్దకూ రాకపోవడం విచారకరం.
హైదరాబాద్‌లో వేల కోట్లు గడిస్తూ, తెలంగాణ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ, ఏపీ ప్రభుత్వం (AP Govt) మాత్రం తమకు అన్నీ దోచిపెట్టాలని కోరుకోవడం ఏ రకమైన ధర్మం? ‘మా రాష్ట్రం.. మా గడ్డ’ అని చెప్పుకోవడానికి వీరికి నోరు రాదా? లేక ఏపీ అంటే కేవలం కలెక్షన్లు రాబట్టుకోవడానికేనా? కనీసం అక్కడ షూటింగ్‌లు జరుపుదామనే ఆలోచన కూడా రాదా..? టికెట్ రేట్లు పెంచుకుని, డబ్బులు మూటగట్టుకుని వెళ్ళిపోయే ఒక గెస్ట్ హౌస్ మాత్రమేనా?
నాడు వంగి దండాలు.. నేడు విమర్శలు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినిమా ఇండస్ట్రీ (Cinema Industry) పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. టికెట్ ధరలను (Ticket Rates) కనిష్ఠ స్థాయికి తగ్గించి, పరిశ్రమను పాతాళానికి తొక్కే ప్రయత్నం జరిగినా.. అప్పుడు ఈ ‘పెద్దల’ గొంతు ఎందుకు పెగలలేదు? సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) ఇంటికి పిలిపించి, భోజనం పెట్టినట్టే పెట్టి, ఆయనతో చేతులు జోడించి వేడుకొనేలా చేసిన దృశ్యాలు తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదు. ఆనాడు అది ‘అవమానం’ అనిపించలేదా? నాడు సర్కార్ అడిగినా ఏమీ చేయలేదు.. నేడు చంద్రబాబు ప్రభుత్వం అడగకముందే అన్ని రాయితీలు ఇస్తుంటే లోపాలు కనిపిస్తున్నాయా?
ఇది కూడా చదవండి:Allu Arjun: అల్లు – రేవంత్ : ‘పుష్ప’రాజ్ తగ్గాడా?
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇండస్ట్రీ ఏది అడిగినా కాదనకుండా జీవోలు ఇస్తోంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లాంటి వ్యక్తి ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉండటం వల్ల సినిమా ఇండస్ట్రీకి స్వర్ణయుగం నడుస్తోంది. కానీ, కనీసం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి కూడా తీరిక లేని ఈ ‘బిజీ’ సెలబ్రిటీలు, ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?
Chiranjeeviకి ‘ఆంధ్రప్రదేశ్’ పేరు పలకడం ఇష్టం లేదా?
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల (Telangana Gaddar Film Awards) కార్యక్రమంలో చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. “పక్క రాష్ట్రం.. మరో తెలుగు రాష్ట్రం” అంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ పేరును ఉచ్చరించడానికి కూడా ఇష్టపడకపోవడం వెనుక ఉన్న అక్కసు ఏమిటి? ఏపీ ప్రభుత్వం కళాకారులను గౌరవించడం లేదని ఆయన సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. మరి ఇదే చిరంజీవికి, ఆయన కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ఏమి ఇచ్చిందో తెలియదా?
రాష్ట్రం అప్పుల్లో ఉన్నా, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నా.. సినిమా వాళ్లకు మాత్రం టికెట్ రేట్లు పెంచడానికి అనుమతులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రజల సొమ్మును పరోక్షంగా ఇండస్ట్రీ జేబుల్లోకి మళ్లిస్తున్నా, కృతజ్ఞత లేకపోగా ‘అక్కసు’ వెళ్లగక్కడం చిరంజీవి స్థాయికి తగునా? మీ సొంత రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు ఆ ‘పరాయి’ భావన ఎందుకు?
ఓ ఫిల్మ్ సిటీ పెట్టలేరా?
తెలంగాణలో స్టూడియోలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఉన్నాయి.. కాబట్టి అక్కడే ఉంటామంటారు. తప్పులేదు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ. సినిమా ఇండస్ట్రీకి గ్లోబల్ హబ్ గా మారుతోంది. హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయికి రావడానికి దశాబ్దాలు పట్టింది. ఇందుకు ఎంతోమంది పాలకులు, సినీ ప్రముఖులు కృషి చేశారు. హైదరాబాద్ మాది, మనందరిదీ అని భావించి తలోచేయీ వేశారు. అందుకే అభివృద్ది చెందింది. ఇప్పుడీ స్థాయిలో ఉంది.
మరి ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో మీ పాత్ర ఏంటి? చిరంజీవి లాంటి లెజెండరీ నటుడు అనుకుంటే విశాఖలోనో, అమరావతిలోనో ఒక అద్భుతమైన ఫిల్మ్ సిటీ నిర్మించలేరా? “నా రాష్ట్రం వెనుకబడింది.. నేను అక్కడ పెట్టుబడి పెడతాను, పదిమందికి ఉపాధి కల్పిస్తాను” అని ఎప్పుడైనా ప్రభుత్వానికి ప్రతిపాదన ఇచ్చారా?
కేవలం రాయితీలు, షూటింగ్ అనుమతులు, టికెట్ రేట్లు కావాలన్నప్పుడు మాత్రమే ఏపీ ప్రభుత్వం గుర్తుకు వస్తుంది. కానీ, బాధ్యత విషయానికి వస్తే మాత్రం ‘హైదరాబాద్’ బోర్డు తగిలించుకుంటారు. ఇది పచ్చి అవకాశవాదం కాదా?
Pawan Kalyan ఆగ్రహం సబబే!
గతంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా పెద్దల తీరుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం సినీ పరిశ్రమకు (Cinema Industry) అండగా నిలబడితే, కనీసం మర్యాదపూర్వకంగా కలిసే సంస్కారం కూడా లేదని ఆయన మండిపడ్డారు. పవన్ ఆవేదనలో వాస్తవం ఉంది. ఇండస్ట్రీ తనను తాను ఒక ప్రత్యేక ‘ద్వీపం’లా భావిస్తోంది. సమాజానికి, రాష్ట్రానికి తమతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తోంది. ఈ ధోరణి మారాలి.
‘ప్రజల సొమ్ము వీళ్లకు ఎందుకివ్వాలి?’
ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి ఒకటే ప్రశ్న వినిపిస్తోంది. మా రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని వీళ్లకు, టికెట్ రేట్లు ఎందుకు పెంచి ఇవ్వాలి? సంక్షేమ పథకాలకు నిధులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో, సినిమా హీరోల రెమ్యూనరేషన్ల కోసం ప్రజల జేబులు ఎందుకు ఖాళీ చేయాలి? ఇండస్ట్రీ బాధ్యతారాహిత్యంగా ఉంటే, ప్రభుత్వం కూడా కఠినంగా ఉండాల్సిన అవసరం లేదా?
సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అది కోట్లాది మంది భావోద్వేగం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సినీ పరిశ్రమను గుండెల్లో పెట్టుకున్నారు. కానీ, అదే ఇండస్ట్రీ పెద్దలు ఆంధ్రప్రదేశ్‌ను (Andhra Pradesh) ఒక అనాథలా చూస్తున్నారు. చిరంజీవి లాంటి పెద్దలు ఇప్పటికైనా తమ ద్వంద్వ వైఖరిని వీడాలి. “పక్క రాష్ట్రం” అనే పదజాలం మానేసి, “నా సొంత రాష్ట్రం” అని గౌరవించడం నేర్చుకోవాలి. కేవలం తీసుకోవడమే కాదు.. తిరిగి ఇవ్వడం కూడా సంస్కారమని గుర్తుంచుకోవాలి. లేదంటే, రేపు ప్రజలు తిరగబడితే ఆ ‘మెగా’ ఇమేజ్‌లు బాక్సాఫీస్ వద్ద కుప్పకూలడం ఖాయం.
















