NewsDabba

YS Jagan : జగన్.. ఇదేనా మీ విశ్వసనీయత?

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 2014-2026 మధ్య కాలం ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. ఒక నూతన రాష్ట్రానికి దిక్సూచిలా నిలవాల్సిన రాజధాని (AP Capital) అంశాన్ని, ఒక రాజకీయ పార్టీ తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన అధినేత ఇగోను సంతృప్తి పరచడం కోసం ఎన్ని మలుపులు తిప్పిందో చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అమరావతి (Amaravati) విషయంలో అనుసరిస్తున్న తీరు విశ్వసనీయత అనే పదానికే మాయని మచ్చగా మారింది. అసెంబ్లీలో ‘జై’ అని, అధికారంలోకి రాగానే ‘నై’ అని, ఎన్నికల ఓటమి తర్వాత ‘అనుకూలం’ అని, మళ్ళీ ఇప్పుడు ‘అసాధ్యం’ అని జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పాడుతున్న రాగం ప్రజల సహనానికి పరీక్షగా నిలుస్తోంది.

పునాదుల దశలోనే ‘ద్వంద్వ నీతి’: 

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని (Amaravati) చంద్రబాబు ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 4న ప్రకటించినప్పుడు, నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఇప్పుడు ఆయనకు ఒక పీడకలలా మారింది.

“రాజధాని నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. మనకు కావాల్సింది ఒక గొప్ప నగరం. ప్రభుత్వం ఎక్కడ రాజధానిని నిర్ణయించినా మా పూర్తి మద్దతు ఉంటుంది. కనీసం 30 వేల ఎకరాల విస్తీర్ణంలో రాజధాని ఉంటేనే అది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది.” – వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి (YS Jagan)

నాడు ఆయనకు ఆ ప్రాంతం ‘నదీ గర్భం’ అనిపించలేదు, అది ‘వరద ముంపు ప్రాంతం’ అని గుర్తుకు రాలేదు. 33,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నప్పుడు ఆయన కూడా అందులో భాగస్వామి అయ్యారు. కానీ, అది కేవలం అధికారం దక్కించుకోవడానికి ఆడిన ‘పొలిటికల్ గేమ్’ అని 2019 తర్వాత తేటతెల్లమైంది.

2019: ‘మూడు ముక్కలాట’తో మొదలైన వినాశనం

151 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తన అసలు రంగు బయటపెట్టారు. రాజధానిపై క్లారిటీ ఇవ్వడానికి బదులు జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వంటి కమిటీలను వేసి కాలయాపన చేశారు.

డిసెంబర్ 17, 2019న అసెంబ్లీలో జగన్ (YS Jagan) మూడు రాజధానుల బాంబు పేల్చారు. అమరావతి (శాసన), విశాఖపట్నం (కార్యనిర్వాహక), కర్నూలు (న్యాయ) రాజధానులుగా ఉంటాయని ప్రకటించారు.

అమరావతిని (Amaravati) ఒక స్మశానంగా, ఒక కులానికి చెందిన ప్రాంతంగా చిత్రీకరించడానికి వైసీపీ సోషల్ మీడియా విపరీతమైన ప్రయత్నం చేసింది.

నాటి మంత్రి బొత్స సత్యనారాయణ ఒక అడుగు ముందుకు వేసి, “అమరావతి వరద ముంపు ప్రాంతం, అక్కడ ఇల్లు కట్టడం అంటే స్మశానంలో కట్టినట్టే” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఒక ముఖ్యమంత్రే తన రాజధానిని స్మశానంతో పోల్చడం ద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను ప్రపంచ దేశాల ముందు ఏ రకంగా అభాసుపాలు చేశారో మనందరికీ తెలుసు.

Chandrababu
Chandrababu: అదానీకి చంద్రబాబు జీ హుజూర్..!!

1600 రోజుల రైతుల పోరాటం.. 

రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాల రైతులు, మహిళలు 1600 రోజులకు పైగా రోడ్లపై పోరాడారు. ‘న్యాయస్థానం నుండి దేవస్థానం’ వరకు వారు చేసిన పాదయాత్రలను అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు.

పోలీసులతో లాఠీచార్జీలు చేయించారు.

మహిళా రైతులను బూటు కాళ్లతో తొక్కించారు.

పాదయాత్రపై వైసీపీ గుండాలతో దాడులు చేయించారు.

రాజధాని (AP Capital) రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అని వెక్కిరించిన జగన్, తన రాజకీయ అధికారం ముందు ప్రజల ఆవేదనను తృణీకరించారు. హైకోర్టు మార్చి 3, 2022న అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలి అని తీర్పు ఇచ్చినా, దాన్ని గౌరవించకుండా సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. అక్కడ కూడా అనుకూలంగా తీర్పు రాకపోవడంతో చివరకు మూడు రాజధానుల విధానాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది.

2024 ఎన్నికలు: ఓటమి భయంతో ‘సజ్జల’ మాయమాటలు

ఎన్నికల ముందు వైసీపీ వ్యూహం పూర్తిగా మారింది. రాజధాని ప్రాంతంలో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని గుర్తించిన పార్టీ మేనేజ్మెంట్, సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా కొత్త కథను అల్లింది.

సెప్టెంబర్ 2023న “మేము అమరావతికి వ్యతిరేకం కాదు. జగన్ గారు గెలిస్తే అమరావతిలోనే ఉంటారు, ఇక్కడి నుండే పరిపాలిస్తారు” అని సజ్జల స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు.

బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉండి “విశాఖలో కేవలం గెస్ట్ హౌస్ మాత్రమే కడుతున్నాం” అని కోర్టుల్లో చెప్పి, బయట మాత్రం రాజధాని మారుతుందని ప్రచారం చేశారు.

ఈ యూ-టర్న్ రాజకీయాలను గమనించిన ప్రజలు, 2024 ఎన్నికల్లో వైసీపీని (YSRCP) కేవలం 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా జగన్ సృష్టించిన ప్రాంతీయ విద్వేషాలను తిరస్కరించి, అమరావతి పక్షానే నిలబడ్డారు.

Sunil Naik Caste Card
Caste Card : అధికారంలో అహంకారం.. ఆపదలో ‘అస్తిత్వ’ వాదం!

అజ్ఞానపు అంకెలతో భయపెట్టే ప్రయత్నం

ఓడిపోయిన తర్వాత కూడా జగన్ తీరు మారలేదనడానికి గురువారం (జనవరి 8, 2026) ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. రాజధానిపై ఆయన మళ్ళీ పాత రికార్డును ప్లే చేస్తున్నారు.

అమరావతిలో మౌలిక వసతులకు లక్ష కోట్లు కావాలి, ఆ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? అని జగన్ ప్రశ్నిస్తున్నారు. నిజానికి, అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. అందులో ప్రభుత్వానికి ఉన్న వేల ఎకరాల వాణిజ్య భూములను విక్రయిస్తేనే లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ఐఐటీ ప్రొఫెసర్లు, ఆర్థికవేత్తలు చెప్పారు.

మళ్ళీ రివర్ బెడ్ అంటూ అర్థం లేని వాదన చేస్తున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం, కట్టడాలన్నీ నదికి సురక్షిత దూరంలోనే ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలు నదుల పక్కనే దశాబ్దాలుగా వర్ధిల్లుతున్నప్పుడు, అమరావతికి మాత్రమే ఆ రూల్ ఎందుకు వర్తించదు?

సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని జగన్ అంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన మాట. రాజధాని అనేది ఒక చట్టబద్ధమైన ప్రదేశం. అది సీఎం ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండే గుడారం కాదు.

వైసీపీ నేతల మాటల మడత (UTurn)

గడిచిన పదేళ్లలో వైసీపీ నేతలు ఎప్పుడెప్పుడు ఎలా మాట మార్చారో గమనిస్తే ఒక క్రమం కనిపిస్తుంది.

కొడాలి నాని: 2014లో స్వాగతించి, 2020లో “అమరావతి అంటే మూడు గ్రామాల మురికివాడ” అని విమర్శించారు.

పేర్ని నాని: రాజధానిలో భూములు గ్రాఫిక్స్ అని, అక్కడ అసలు ఏమీ లేదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.

బొత్స సత్యనారాయణ: ఒకరోజు విశాఖ అంటారు, మరోరోజు అమరావతిలో శాసన రాజధాని అంటారు. మళ్ళీ 2024 తర్వాత మేము పునఃసమీక్షించుకుంటాం అని కొత్త నాటకం మొదలుపెట్టారు.

సజ్జల రామకృష్ణా రెడ్డి : ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు. 2029లో జగన్ గెలిస్తే ఇక్కడి నుంచే పరిపాలిస్తారన్నారు.

వీరి మాటల్లో ఎక్కడా రాష్ట్ర ప్రయోజనం కనిపించదు, కేవలం తన అధినేతను ఎలా సంతృప్తి పరచాలి అనే తాపత్రయం తప్ప.

Punarvika - 16 Crores Injection
Punarvika : పసిపాప ప్రాణం ఖరీదు రూ.16 కోట్లు

జగన్ పాపం.. ప్రజల శాపం

అమరావతిని నిలిపివేయడం వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం జరిగి ఉంటుందని అంచనా.

చాలా కంపెనీలు రాజధానిపై గందరగోళం వల్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా తమ అనుబంధ కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరలించాయి.

అమరావతిలో అభివృద్ధి జరిగితే వచ్చే ఆదాయం లేక, జగన్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని కుదేలు చేసింది.

2019లో రూ. 10 వేల కోట్లతో పూర్తి కావాల్సిన భవనాలు, ఇప్పుడు మెటీరియల్ రేట్లు పెరగడం వల్ల రూ. 15 వేల కోట్లకు చేరాయి. ఈ అదనపు భారం ప్రజల మీద పడుతోంది.

YS Jagan వాదనలో పస ఉందా?

ఓడిపోయినా కూడా జగన్ అమరావతిపై విషం కక్కడం వెనుక ఉన్న బలమైన కారణాలు రెండు:

  1. వైఫల్యాన్ని అంగీకరించలేకపోవడం: తాను ఐదేళ్లు చేసిన విధ్వంసం తప్పని ఒప్పుకుంటే తన రాజకీయ జీవితం అంతమవుతుందని ఆయన భయపడుతున్నారు. అందుకే తన తప్పును ఒక ‘సిద్ధాంతం’గా రంగు పూసి ప్రజలను మళ్ళీ బురిడీ కొట్టించాలని చూస్తున్నారు.
  2. రాజకీయ ఉనికి: అమరావతి పనులు వేగంగా పూర్తయితే, అది చంద్రబాబు ఖాతాలోకి వెళ్తుంది. ఆ ఘనత టీడీపీకి దక్కకూడదనే కుట్రలో భాగంగానే మళ్ళీ కోర్టు కేసులు, వరద ఆరోపణలు తెరపైకి తెస్తున్నారు.

ఏపీ ప్రజలకు క్లారిటీ!

“మాట తప్పను.. మడమ తిప్పను” అనేది జగన్ నినాదం. తాము విశ్వసనీయతకు మారుపేరు అని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. కానీ అమరావతి విషయంలో ఆ పార్టీ ఎన్నిసార్లు మడమతిప్పిందో కళ్ల ముందు కనిపిస్తోంది. అలాగే ఆ పార్టీ విశ్వసనీయత కూడా ఈ అంశంలో ప్రశ్నార్థకంగా మారింది. 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైనా కూడా ఆ పార్టీ ఆలోచనా తీరులో మార్పు రాలేదని అర్థమవుతోంది.

రాజధాని అనేది రాజాజ్ఞ కాదు.. అది ప్రజాజ్ఞ. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను మీ రాజకీయ పంతం ముందు బలిపెట్టాలని చూస్తే చరిత్ర ఎవర్నీ క్షమించదు. రాజధాని అనేది రాజ్యాంగంలో లేదు.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని.. లాంటి మాటలు వినడానికి బాగానే ఉంటాయి. కానీ రాజధాని అనేది ఏ రాష్ట్రానికైనా, దేశానికైనా ఓ గర్వకారణం. ఓ అస్తిత్వం. రాజధాని లాంటి అంశంపై బాధ్యతాయుత పార్టీ ఇలా ఆలోచించదు. ఇప్పటికైనా వైసీపీ తన విధానాన్ని మార్చుకుంటే బాగుంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment