నియోజకవర్గాల పునర్విభజన… తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States Politics) గత దశాబ్ద కాలంగా నానుతున్న అత్యంత కీలకమైన అంశం. రాష్ట్ర విభజన గాయాల నుంచి కోలుకుని, రాజకీయ స్థిరత్వం వైపు అడుగులేస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఇది కేవలం సీట్ల పెంపు మాత్రమే కాదు, ఒక చట్టబద్ధమైన హక్కు. కానీ, తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జనగణన (cencus 2027) నిర్ణయం, దాని కేలండర్ ను గమనిస్తే, 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల (Delimitation) పెంపు అసాధ్యమని స్పష్టమవుతోంది. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని టీడీపీకి, పవన్ కళ్యాణ్ జనసేనకు ఇది మింగుడుపడని పరిణామం. ఎందుకంటే, ఇది కేవలం సంఖ్యల గందరగోళం కాదు.. భవిష్యత్తులో ఎవరు అధికారాన్ని శాసిస్తారో నిర్ణయించే రాజకీయ చదరంగం.
చట్టం ఒక మాట.. ఆచరణ మరో బాట
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని (Andhra Pradesh Reorganization Act – 2014) సెక్షన్ 26 ప్రకారం, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కి, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కి పెంచాలని స్పష్టంగా నిర్దేశించారు. వాస్తవానికి ఈ పెంపునకు, దేశవ్యాప్తంగా జరిగే సాధారణ డీలిమిటేషన్‌కు సంబంధం లేదని, ఇది విభజన హామీ అని న్యాయనిపుణులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సాకుగా చూపిస్తూ, 2026 తర్వాత వెలువడే మొదటి అధికారిక జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన జరుగుతుందని స్పష్టం చేస్తూ వచ్చింది. పోనీ ఆ వాదననే నమ్ముకున్నా, కరోనా కారణంగా వాయిదా పడ్డ జనగణన ఇప్పుడు 2026లో మొదలై, 2028 మధ్య నాటికి గానీ పూర్తికాదు. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు, ప్రజాభిప్రాయ సేకరణ, సరిహద్దుల నిర్ణయం.. ఇవన్నీ పూర్తయ్యేసరికి 2030 దాటిపోతుంది. అంటే 2029 ఎన్నికలు పాత సీట్లతోనే జరగడం అనివార్యం. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అలజడి రేపుతోంది.
కూటమి కష్టాలు: త్యాగాలకు ఫలితం దక్కేదెప్పుడు?
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఘనవిజయం సాధించాయి. అయితే, ఈ విజయం వెనుక భారీ సీట్ల సర్దుబాటు జరిగింది. పొత్తు ధర్మంలో భాగంగా జనసేన, బీజేపీలకు సీట్లు కేటాయించడం కోసం టీడీపీ తమ సిట్టింగ్ స్థానాలను, బలమైన ఇన్చార్జిలను పక్కన పెట్టాల్సి వచ్చింది. అలాగే జనసేన కూడా తన బలం ఉన్న చోట తగ్గాల్సి వచ్చింది. “2029 నాటికి సీట్లు పెరుగుతాయి, అప్పుడు అందరికీ న్యాయం చేయవచ్చు” అనే భరోసాతోనే ఈ అసంతృప్తులను అప్పట్లో చల్లార్చారు. కానీ ఇప్పుడు సీట్ల పెంపు లేదని తేలడంతో 2029లో పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది.
అసంతృప్తుల జ్వాల: వచ్చే ఎన్నికల్లో కూడా 175 సీట్లే ఉంటే, ముగ్గురు మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం కత్తిమీద సాములా మారుతుంది. గత ఐదేళ్లుగా పదవి కోసం ఎదురుచూస్తున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం, టికెట్ దక్కకపోతే తిరుగుబావుటా ఎగురవేసే ప్రమాదం ఉంది.
జనసేన విస్తరణ: పవన్ కళ్యాణ్ పార్టీని విస్తరించాలని కోరుకుంటున్నారు. 225 సీట్లు అయితే జనసేనకు గౌరవప్రదమైన సంఖ్య దక్కే అవకాశం ఉండేది. కానీ 175లో మళ్లీ 21 సీట్లకే పరిమితం కావాలంటే ఆ పార్టీ క్యాడర్ ఒప్పుకోకపోవచ్చు. ఇది కూటమిలో చిచ్చు రేపే ప్రమాదం ఉంది.
“డీలిమిటేషన్ పవర్” ఎవరి చేతిలో?
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం – “ఆ సమయంలో అధికారంలో ఎవరున్నారు?” అనేది. ఇది పూర్తిగా అధికారిక ప్రక్రియే అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. డీలిమిటేషన్ కమిషన్‌కు అవసరమైన సమాచారం, మ్యాపులు, జన సాంద్రత వివరాలను స్థానిక రెవెన్యూ యంత్రాంగమే అందిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ, తమకు అనుకూలమైన ఓటు బ్యాంకులను ఒక నియోజకవర్గంలో కేంద్రీకరించడం, వ్యతిరేక ఓట్లను చీల్చడం వంటివి చేసే అవకాశం లేకపోలేదు.
ఇక్కడే టీడీపీకి అసలైన గండం పొంచి ఉంది.
2029లో కూటమి గెలిస్తే.. సమస్య లేదు. 2029 తర్వాత జరిగే పునర్విభజన ప్రక్రియను చంద్రబాబు లేదా కూటమి ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. తమకు రాజకీయంగా నష్టం జరగకుండా, మిత్రపక్షాలకు న్యాయం జరిగేలా సరిహద్దులను మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. తద్వారా 2034, 2039 ఎన్నికలకు బలమైన పునాది వేసుకోవచ్చు.
2029లో వైసీపీ గెలిస్తే.. ఇది టీడీపీకి పీడకల లాంటిది. ఒకవేళ 2029 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత లేదా ఇతర కారణాలతో వైసీపీ అధికారంలోకి వస్తే, వారి హయాంలోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అప్పుడు జగన్ ప్రభుత్వం, టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలను భౌగోళికంగా ముక్కలు చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే, కొత్తగా ఏర్పడే 225 నియోజకవర్గాల స్వరూపం వైసీపీకి అనుకూలంగా మారిపోతుంది.
2044 వరకు నిరీక్షణ తప్పదా?
ఒకవేళ 2029లో అధికారం కోల్పోయి, వైసీపీ హయాంలో డీలిమిటేషన్ జరిగితే, ఆ తర్వాత వచ్చే 2034, 2039 ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం ఉంటుంది. వైసీపీ నిర్దేశించిన సరిహద్దుల్లో టీడీపీ పోరాడాల్సి వస్తుంది. అంటే మళ్లీ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలంటే టీడీపీ 2044 వరకు వేచి చూడాల్సి రావచ్చు. అప్పటికి రాజకీయ పరిస్థితులు, నాయకత్వాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. అందుకే, ఈ టర్మ్ (2024-2029) లోనే పునర్విభజన జరగాలని చంద్రబాబు బలంగా కోరుకుంటున్నారు. తన కనుసన్నల్లో, తన అనుభవం ద్వారా నియోజకవర్గాలను శాస్త్రీయంగా, వ్యూహాత్మకంగా పునర్విభజిస్తే, వచ్చే రెండు దశాబ్దాల పాటు పార్టీకి ఢోకా ఉండదని ఆయన భావిస్తున్నారు. పార్టీ భవిష్యత్ నేతగా చెప్పుకుంటున్న లోకేశ్ కు ఇది చాలా అవసరం.
న్యాయపరమైన చిక్కులు – రాజకీయ పరిష్కారాలు
కేంద్రం చెబుతున్న సాంకేతిక కారణాలు వాస్తవమే అయినా, రాజకీయ సంకల్పం ఉంటే రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి పరిష్కారం చూపవచ్చు. జమ్మూ కాశ్మీర్‌లో డీలిమిటేషన్ చేపట్టినప్పుడు, అక్కడ ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. ఏపీ, తెలంగాణల విషయంలోనూ “విభజన చట్టం” అనే ప్రత్యేక పరిస్థితి ఉంది కాబట్టి, జనగణనతో లింకు లేకుండా సీట్లు పెంచేలా రాజ్యాంగ సవరణ చేయమని తెలుగు రాష్ట్రాలు కోరుతున్నాయి. కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఇలాంటి డిమాండ్లు వస్తాయేమోనన్న భయంతో బీజేపీ అధిష్టానం వెనుకడుగు వేస్తోంది.
కేవలం జనాభా లెక్కలనే సాకుగా చూపిస్తూ, విభజన చట్టంలోని హామీని పక్కన పెట్టడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేస్తున్న అన్యాయం. కానీ, దీని వెనుక ఉన్న రాజకీయ పర్యవసానాలు మాత్రం ఒక పార్టీ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి. 2029 ఎన్నికలు పాత సీట్లతోనే జరిగితే, అది కేవలం పాలనాపరమైన అంశంగా మిగిలిపోదు. అసంతృప్తుల జ్వాలలు, మిత్రపక్షాల ఒత్తిళ్లు, పొంచి ఉన్న ఓటమి భయం.. వెరసి టీడీపీకి, కూటమికి ఇదొక అగ్నిపరీక్ష. ఈ గండం గట్టెక్కాలంటే చంద్రబాబు తన రాజకీయ చాణక్యం అంతా ఉపయోగించి కేంద్రం మెడలు వంచి 2029 లోపే ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలి, లేదా పాత సీట్లతోనే నెగ్గుకురావడానికి సిద్ధపడాలి. ఏది జరిగినా, రాబోయే నాలుగేళ్లు ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకం కాబోతున్నాయి.

A Passionate Telugu Writer Covering Politics, Public Voice, And Current Affairs With Clarity And Insight. Dedicated To Presenting Unbiased Perspectives Rooted In Truth And Regional Relevance. Believes In Giving A Voice To The People Through Powerful Storytelling And Factual Reporting.
















