NewsDabba

Ambati Rambabu : అరాచకానికి అండ.. వైసీపీ సిద్ధాంతమా?

Ambati Rambabu:

రాజకీయం అంటే ప్రజా సేవ..

రాజకీయం అంటే ఒక బాధ్యత..

రాజకీయం అంటే విలువలతో కూడిన పోరాటం.

Amaravati - AP Capital
Amaravati : అమరావతిని ఎవరొచ్చినా మార్చలేరా..?

కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు మనం చూస్తున్న దృశ్యాలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) వ్యవహారశైలి, దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) స్పందిస్తున్న తీరు చూస్తుంటే.. ఆ పార్టీకి నైతికత అంటే లెక్కలేదా? ప్రజా తీర్పు నుంచి వారు నేర్చుకున్న పాఠం శూన్యమా? అన్న అనుమానాలు కలగక మానవు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిపై అత్యంత జుగుప్సాకరమైన పదజాలంతో విరుచుకుపడటం, ఆపై పార్టీ ఆ తప్పును సమర్థించుకోవడం అనేది ఏపీ రాజకీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం.

Ambati Rambabu బూతు పురాణం- పార్టీ అండ

అంబటి రాంబాబు (Ambati Rambabu) గతంలో మంత్రిగా చేసిన వ్యక్తి. చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్న నాయకుడు. అటువంటి వ్యక్తి బహిరంగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై (Chandrababu) బూతుల వర్షం కురిపించడం చూసి సామాన్య ప్రజానీకం ముక్కున వేలేసుకుంటోంది. విమర్శ అనేది రాజకీయంలో సహజం, కానీ అది వ్యక్తిగత దూషణగా, మరీ ముఖ్యంగా ‘బూతు’ పురాణంగా మారినప్పుడు అది రాజకీయ విమర్శ అనిపించుకోదు. అది కేవలం సంస్కార హీనత మాత్రమే. అంబటి మాటలను నాగరిక సమాజం ఏ కోశానా సహించదు, స్వాగతించదు. ఒక నాయకుడి నుంచి సమాజం ఆశించేది హుందాతనాన్ని, కానీ అంబటి అందించింది మాత్రం అరాచక పదజాలాన్ని.

నిజానికి, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా తక్షణమే స్పందించి, తన నాయకుడిని మందలించడమో లేదా చర్యలు తీసుకోవడమో చేయాలి. అప్పుడే ఆ పార్టీపై ప్రజల్లో గౌరవం ఉంటుంది. కానీ, వైసీపీ ఇక్కడ భిన్నమైన బాట పట్టింది. అంబటిని వెనకేసుకురావడమే కాకుండా, ఆయనపై ‘హత్యాయత్నం’ జరిగిందంటూ కొత్త డ్రామాకు తెరలేపింది. తప్పును తప్పుగా ఒప్పుకునే ధైర్యం లేని పార్టీగా వైసీపీ (YCP) నేడు ప్రజల ముందు నిలబడింది.

వైసీపీ ‘కులం కార్డు’ – పాత చింతకాయ పచ్చడి ఎత్తుగడ

వైసీపీకి ఏదైనా ఆపద వస్తే లేదా వారి తప్పులు బయటపడితే వెంటనే వాడే అస్త్రం ‘కులం’. అంబటి రాంబాబు (Ambati Rambabu) చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుంటే, దానికి పార్టీ రంగు పూసి.. చివరకు దాన్ని ‘కాపు’ సామాజిక వర్గంపై దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అత్యంత దారుణం. వ్యక్తి చేసిన తప్పును కులానికి ఆపాదించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం పచ్చి అవకాశవాదం కాదా?

కాపు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని అంబటిని కాపాడుకోవాలని చూడటం ఆ సామాజిక వర్గాన్ని అవమానించడమే. ఒక నేత వ్యక్తిగతంగా మాట్లాడే బూతులకు, ఒక సామాజిక వర్గానికి సంబంధం ఏముంటుంది? “We Stand with Ambati” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైసీపీ (YCP) శ్రేణులు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆయన ఏమైనా ప్రజా సమస్యల కోసం పోరాడి అరెస్టయ్యారా? లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం జైలుకు వెళ్తున్నారా? ముఖ్యమంత్రిని తిట్టినందుకు ఆయనకు అండగా నిలబడటం అంటే.. వైసీపీ “బూతులను ప్రోత్సహించే పార్టీ” అని ఒప్పుకోవడమే.

YS Jagan Mittal
YS Jagan: మిత్తల్ స్టీల్ ప్లాంట్: క్రెడిట్ చోర్ ఎవరిది?

TDP – YCP: ఎవరి నైతికత ఎంత?

గతంలో ఐటీడీపీకి చెందిన ఒక కార్యకర్త వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు టీడీపీ (TDP) అధిష్టానం వ్యవహరించిన తీరును ఇక్కడ గమనించాలి. పార్టీ తక్షణమే అతడిని సస్పెండ్ చేసింది. పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపితే అడ్డుకోలేదు. అంటే, తప్పు జరిగినప్పుడు బాధ్యతాయుతమైన పార్టీ ఎలా ఉండాలో టీడీపీ నిరూపించింది. కానీ వైసీపీ విషయంలో సీన్ పూర్తిగా రివర్స్.

వైసీపీకి ఇలాంటి వ్యవహారాలు కొత్తేమీ కాదు. గత ఐదేళ్ల పాలనలో ఎందరో నేతలు, కార్యకర్తలు అదుపు తప్పి మాట్లాడారు. వారిపై చర్యలు తీసుకోవడం మాట దేవుడెరుగు.. అధినేత జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వారిని పిలిచి అభినందించిన సందర్భాలు ఉన్నాయి. బూతులు మాట్లాడితే ‘రాచమర్యాదలు’ దక్కుతాయనే సంకేతాన్ని పార్టీ కేడర్‌లోకి బలంగా పంపారు. దీనివల్ల “నీతి, నిజాయితీ అనేవి వైసీపీ నిఘంటువులోనే లేవు” అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.

పట్టాభి వ్యాఖ్యలు – వైసీపీ దాడులు: ఆనాటి రక్త చరిత్ర

గతంలో పట్టాభి చేసిన కొన్ని వ్యాఖ్యలను (బోసడీకే వంటి పదాలు) సాకుగా తీసుకుని వైసీపీ కేడర్ రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం సృష్టించింది. టీడీపీ (TDP) కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. చంద్రబాబు నివాసంపైకి జోగి రమేష్ తన అనుచరులతో వెళ్లి రభస చేశారు. అప్పుడు జగన్ ఏమన్నారు? “ముఖ్యమంత్రిని తిడితే కేడర్‌కు బీపీ రాదా? అందుకే అలా చేశారు” అని ఆ దాడులను సమర్థించారు.

మరి ఇప్పుడు అదే సూత్రాన్ని అన్వయిస్తే.. తమ అధినేత చంద్రబాబును (Chandrababu) అంబటి రాంబాబు ఆ స్థాయిలో దూషిస్తే, టీడీపీ కార్యకర్తలకు బీపీ రాదా? వారు స్పందిస్తే అది తప్పు ఎలా అవుతుంది? నాడు వైసీపీ చేస్తే ‘ధర్మ పోరాటం’.. నేడు టీడీపీ (TDP) కేడర్ నిరసన వ్యక్తం చేస్తే ‘హత్యాయత్నమా’? ఈ ద్వంద్వ ప్రమాణాలు (Double Standards) వైసీపీ పతనానికి ప్రధాన కారణం. తాము చేస్తే చట్టబద్ధం, ఎదుటివారు చేస్తే అరాచకం అనే ధోరణి ఆ పార్టీని ప్రజలకు దూరం చేస్తోంది.

2024 తీర్పు ఇచ్చినా మారని వైఖరి

2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు 11 సీట్లతో చారిత్రాత్మక పరాజయాన్ని ఇచ్చారు. అది కేవలం ఓటమి కాదు, ఆ పార్టీ అనుసరించిన అహంకారపూరిత, బూతుల రాజకీయాలపై ప్రజలు ఇచ్చిన ఛీత్కారం. అయినా సరే, ఆ పార్టీలో మార్పు రావడం లేదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి, ఇంకా అదే బరితెగింపు, అదే ఎదురుదాడి, అదే అసత్య ప్రచారాలతో కాలం వెళ్లదీస్తున్నారు.

Film city in amaravati
Film City: ఏపీలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ?

ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస లక్షణం ‘జవాబుదారీతనం’. కానీ వైసీపీ వ్యవహారశైలి చూస్తుంటే అది ఒక రాజకీయ పార్టీలా కాకుండా, ఒక మొండి పట్టుదల కలిగిన వ్యవస్థలా కనిపిస్తోంది. ప్రజలు ఏమనుకుంటున్నారు? తమ వైఖరి వల్ల రాష్ట్రానికి ఏం సందేశం వెళ్తోంది? అనే విచక్షణ ఆ పార్టీ నాయకత్వంలో లోపించింది.

రాజకీయాల్లో విలువలు ఎక్కడ?

ప్రజాస్వామ్యంలో విమర్శలు వాడిగా ఉండొచ్చు, కానీ అవి వికృతంగా ఉండకూడదు. అంబటి రాంబాబు వ్యాఖ్యలు సమాజంలో నైతిక విలువల పతనానికి అద్దం పడుతున్నాయి. ఇటువంటి నేతలను వెనకేసుకురావడం ద్వారా వైసీపీ తన గొయ్యి తనే తవ్వుకుంటోంది. కులం కార్డుతోనో, తప్పుడు ఫిర్యాదులతోనో వాస్తవాలను దాచలేరు.

రాజకీయ నాయకులు ప్రజలకు రోల్ మోడల్స్‌గా ఉండాలి. కానీ, బూతులు తిట్టడమే ఒక యోగ్యతగా భావించే సంస్కృతి పెరుగుతుంటే, భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే సందేశం ఏమిటి? ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం తన తప్పులను సరిదిద్దుకోవాలి. అంబటి వంటి నేతలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా తమ పార్టీలో విలువలకి చోటుందని నిరూపించుకోవాలి. లేదంటే, ప్రజలు 11 సీట్ల నుంచి సున్నాకి పంపడానికి కూడా వెనుకాడరనే నిజాన్ని వారు గ్రహించాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

Leave a Comment