YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అబద్ధం’ ఆత్మకథ రాసుకుంటే అది ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ప్రసంగాల మాదిరిగానే ఉంటుంది. అధికారం ఉన్నా లేకున్నా, వాస్తవాలను వక్రీకరించడంలో తన తర్వాతే ఎవరైనా అని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రూ. 1.61 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఆర్సలార్ మిత్తల్ – నిప్పన్ స్టీల్ (AM/NS) ప్లాంట్ విషయంలో జగన్ తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో నవ్వులాటగా మారాయి. నిన్నటి వరకు “పిట్టల దొర కబుర్లు” అని ఎగతాళి చేసిన నోటితోనే, ఇవాళ “ఆ ప్లాంట్ తెచ్చింది నేనే” అని క్రెడిట్ (Credit War) కోసం పాకులాడటం ఆయన నైతిక పతనానికి పరాకాష్ట.
అనాడు వెటకారం.. నేడు నాదే అధికారం!
2025లో ఇదే అంశంపై జగన్మోహన్ రెడ్డి (YS Jagan) మాట్లాడిన మాటలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఆయన ద్వంద్వ వైఖరి స్పష్టమవుతుంది. అప్పట్లో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈ మెగా ప్రాజెక్టు గురించి ప్రకటన చేసినప్పుడు జగన్ అత్యంత హేళనగా మాట్లాడారు. “మిత్తల్ (Mittal) వారు ఒరిస్సాలో రూ.1.04 లక్షల కోట్లతో ప్లాంట్ పెడుతుంటే, ఇక్కడ లోకేష్ (Nara Lokesh) పిట్టల దొరలాగా కబుర్లు చెబుతున్నాడు” అని విమర్శించారు. అంతేకాదు, “ఎవరి చెవులో పూలు పెడుతున్నారు?” అంటూ అప్పట్లో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
కానీ కాలం మారింది, వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అదే ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌కు రావడం ఖాయమయ్యాక, జగన్ (YS Jagan) 180 డిగ్రీల కోణంలో మడమ తిప్పేశారు. 2022లో దావోస్ పర్యటనలో తానే మిత్తల్ ప్రతినిధులను ఆహ్వానించానని, అందుకే వారు వస్తున్నారని సరికొత్త పల్లవి అందుకున్నారు. నిన్నటి వరకు అసాధ్యం అన్న నోటితోనే, నేడు అది నా ఘనత అనడం జగన్ మార్క్ రాజకీయానికి నిదర్శనం.
కాగితాల్లో లేని ‘జగన్’ మార్క్ ఇన్వెస్ట్‌మెంట్
పరిశ్రమల స్థాపన అనేది కేవలం దావోస్ వీధుల్లో కలిసినప్పుడు “మా రాష్ట్రానికి రండి” అని మొక్కుబడిగా చెప్పే మాటలతో జరగదు. దానికి అంతులేని కసరత్తు, ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ అనుమతులు అవసరం. జగన్ (YS Jagan) హయాంలో ఈ ప్లాంట్ గురించి ఒక్కటంటే ఒక్క అడుగు పడిందా అంటే సమాధానం ‘శూన్యం’.
- కరస్పాండెన్స్ ఎక్కడ?: 2019 నుంచి 2024 వరకు జగన్ పాలనలో మిత్తల్ (Mittal) సంస్థ నుంచి ఏపీ ప్రభుత్వానికి వచ్చిన ఒక్క లేఖ కూడా రికార్డుల్లో లేదు.
- SIPB ఆమోదం ఏది?: రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశాల్లో ఎన్నడూ మిత్తల్ ప్రస్తావన రాలేదు.
- జీవోల ఊసే లేదు: భారీ పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు, భూ కేటాయింపులపై జగన్ ప్రభుత్వం ఏనాడూ ఒక్క జీవో కూడా జారీ చేయలేదు.
కేవలం మాటల గారడీతో ప్రజలను నమ్మించవచ్చనే భ్రమలో జగన్ ఉన్నారు. కియా (KIA) పరిశ్రమ విషయంలో కూడా గతంలో ఆయన ఇలాగే బుకాయించి భంగపడ్డారు, ఇప్పుడు మిత్తల్ విషయంలోనూ అదే పునరావృతమవుతోంది.
ఇది కూడా చదవండి: YS Jagan: ఇదేనా జగన్ విలువలు, విశ్వసనీయత?
కూటమి ప్రభుత్వం – వేగవంతమైన అడుగులు
ప్రస్తుత కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. నారా లోకేష్ (Nara Lokesh) సెప్టెంబర్ 2024లో ఆర్సలార్ మిత్తల్ సీఈఓ ఆదిత్య మిత్తల్‌తో (Aditya Mittal) అరగంట పాటు జూమ్ కాల్‌లో మాట్లాడి ప్రాజెక్టును ఇనిషియేట్ చేశారు.. దానికి కొనసాగింపుగా అక్టోబర్ 18, 2024న సంస్థ నుంచి అధికారిక ప్రతిపాదనలు వచ్చాయి. నవంబర్ 16న SIPB మీటింగ్ నిర్వహించి, నవంబర్ 26న ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది.
ప్రభుత్వ జీవోలో స్పష్టంగా పేర్కొన్న వివరాలు:
- మొత్తం పెట్టుబడి: రూ. 1,35,964 కోట్లు (మొదటి దశలో రూ. 55,964 కోట్లు, రెండో దశలో రూ. 80,000 కోట్లు).
- ఉద్యోగ కల్పన: మొత్తం 55,000 మందికి ఉపాధి (మొదటి దశలో 20,000, రెండో దశలో 35,000).
- భూమి: సుమారు 6,440 ఎకరాలు (నక్కపల్లి ప్రాంతం).
ఒక పరిశ్రమ రావాలంటే కేవలం ముఖ్యమంత్రి హోదాలో పిలిస్తే సరిపోదు, ఆ ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయత (Credibility) ముఖ్యం. జగన్ (YS Jagan) హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయిన పరిస్థితి చూశాం. అమర రాజా వంటి సంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడం జగన్ పాలనకు సాక్ష్యం. కానీ చంద్రబాబు నాయుడు (Chandrababu), నారా లోకేష్‌లకు ఉన్న పారిశ్రామిక అనుకూల దృక్పథం వల్లే మిత్తల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఏపీ వైపు చూస్తున్నాయి.
జగన్ (YS Jagan) వైఖరి ఎలా ఉందంటే.. చెట్టు నాటిన వాడు ఒకరు, నీళ్లు పోసి పెంచిన వాడు మరొకరు అయితే, కాయలు కాశాక అవి నావే అని వాదించే రకం. లోకేష్ ప్రకటనలను నవ్వులపాలు చేసిన జగన్, ఇవాళ అవే అంకెలను తన ఖాతాలో వేసుకోవాలని చూడటం అత్యంత హాస్యాస్పదం.
రాజకీయంలో విమర్శలు సహజం, కానీ వాస్తవాలను సమాధి చేసి అబద్ధాలపై సౌధాలు నిర్మించాలనుకోవడం అవివేకం. మిత్తల్ స్టీల్ ప్లాంట్ విషయంలో రికార్డులు, జీవోలు, తేదీలు అన్నీ కూటమి ప్రభుత్వ కృషిని చాటి చెబుతుంటే, జగన్ చేస్తున్న “క్రెడిట్ చోరీ” (Credit Chori) ప్రయత్నం ఆయన రాజకీయ అపరిపక్వతను మరోసారి ఎండగడుతోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, కేవలం మాటలతో పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం కాదని వారు ఎప్పుడో గుర్తించారు.
















