AP Govt : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం (NDA Govt) ప్రోటోకాల్‌కు (protocol) పూర్తిగా తిలోదకాలిచ్చినట్టు అర్థమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు పార్టీల మధ్య సమన్వయం ఇప్పటివరకూ అద్భుతంగా సాగుతోంది. ఒకదానికొకటి గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అడపాదడపా కిందిస్థాయిలో సమస్యలు తలెత్తుతున్నా, పైస్థాయిలో మాత్రం నేతల మధ్య మంచి సమన్వయం కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టేసి నేతలంతా చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు.
అధికారంలో ఉన్న పార్టీలు ప్రజాభిశ్రేయస్సే పరమావధిగా పనిచేయాలి. అలా కాకుండా ప్రజాశ్రేయస్సు కంటే తమ అధికారమే ముఖ్యమని పార్టీలు భావిస్తే నిబంధనలు పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిబంధనలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అధికార కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు మధ్య అవసరమైన గీతను పూర్తిగా తుడిచిపెట్టేశాయి.
ఈ మధ్య డీఎస్సీ విజేతలకు ప్రభుత్వం అమరావతిలో నియామక పత్రాలు అందజేసింది. ఇది ఎంతో అట్టహాసంగా జరిగింది. ఇది ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన కార్యక్రమం. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఇంతవరకూ ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఎందుకంటే వీళ్లు ప్రభుత్వంలో భాగస్వాములు. కానీ ఈ వేదికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ కూడా పాల్గొన్నారు. ఆయనకు ఏ అర్హత ఉందని ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు? ఆయనకు ప్రోటోకాల్ ఎలా అనుమతించింది?
ఇదే కాదు.. విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో.. కార్యక్రమంలో కూడా మాధవ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొనడం అధికారికం. కానీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఓ పార్టీ అధినేతకు ప్రభుత్వ కార్యక్రమంలో పెద్దపీట వేయడం దేనికి నిదర్శనం.? దీన్ని అధికార పార్టీలు ఎలా సమర్థించుకుంటాయి?
ఇంతేకాదు.. ప్రభుత్వం ఏ ప్రకటన ఇచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫోటోలను ప్రచురిస్తోంది. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్‌కు ఏం సంబంధం? అడ్వర్టయిజ్‌మెంట్లలో నారా లోకేశ్ పేరు ఎందుకు వాడారు? సంబంధిత శాఖల మంత్రి ఫోటో లేనప్పుడు అసలు సంబంధమే లేని మంత్రి ఫోటో ఎలా వాడతారు? ఇదేం ప్రోటోకాల్..? నారా లోకేశ్ ను భావి ముఖ్యమంత్రిగా మీరు భావిస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడాయన అందరు మంత్రుల్లాగే ఒక మంత్రి మాత్రమే.
రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఇలా ప్రోటోకాల్ కు పూర్తిగా తిలోదకాలిచ్చినప్పుడు ఇక జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో అక్కడ ఆయా పార్టీల ఇన్ ఛార్జ్ లే చక్రం తిప్పుతున్నారు. పెన్షన్ల పంపిణీ, ఆటో డ్రైవర్ల సేవలో.. లాంటి అధికారిక కార్యక్రమాల్లో అధికారులతో కలిసి పార్టీ నేతలు పాల్గొంటున్నారు. మహిళా ఎమ్మెల్యేలున్న చోట వాళ్ల భర్తల పెత్తనం వేరే సంగతి.
అధికారిక కార్యక్రమాల్లో పొలిటికల్ స్పీచ్ లు కూడా సహజంగా నిషేధం. కానీ ఏపీలో ఏది అధికారిక కార్యక్రమమో, ఏది పార్టీ కార్యక్రమమో అర్థం కావట్లేదు. అధికారిక కార్యక్రమాలన్నీ రాజకీయ ప్రసంగాలతో నిండిపోతున్నాయి. ఎంతసేపూ గత ప్రభుత్వం అలా చేసింది, ఇలా చేసింది.. ఆ లీడర్ ఇలా చేశాడు.. మేం ఇలా చేశాం అని డబ్బా కొట్టుకోవడానికే సరిపోతోంది.
అధికారపార్టీ నేతలకు అధికారులు మడుగులు వత్తినప్పుడే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. అధికారి కార్యక్రమాల్లో పార్టీ నేతలు భాగస్వాములు కాకుండా నిరోధించాల్సిన బాధ్యత అధికారులదే. ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసినా నో చెప్పగలిగితే ఇలాంటి వాటికి చెక్ పడుతుంది. కొన్నాళ్లకు వ్యవస్థలు దారికొస్తాయి. కానీ అధికారులు ఇప్పుడు తమ స్వప్రయోజనాలకోసం, పదవులకోసం పాలకులకు తలొగ్గుతున్నారు. దీంతో వాళ్లకు అడ్డూఅదుపూ లేకుండా పోతుంది.
ఏపీలో అధికారంలో ఉండేది, కేంద్రంలో అధికారంలో ఉండేది ఒకే కూటమి. కానీ ప్రోటోకాల్ విషయంలో నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ ప్రసంగాలకు అస్సలు ఛాన్స్ తీసుకోరు. విపక్షాలను పొరపాటున కూడా విమర్శించరు. ఆ కార్యక్రమానికి మాత్రమే పరిమితం అవుతారు. ఆ కార్యక్రమ విశిష్ఠతలను పంచుకుంటారు. ఆయన రాజకీయ ప్రసంగాలకు పార్టీ కార్యక్రమాలను వేదికగా ఎంచుకుంటారు. కానీ ఏపీలో మాత్రం అదే కూటమి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ఈ పద్ధతి మారాలి. పాలకులు ఈ పద్ధతి మార్చాలి.

A Passionate Telugu Writer Covering Politics, Public Voice, And Current Affairs With Clarity And Insight. Dedicated To Presenting Unbiased Perspectives Rooted In Truth And Regional Relevance. Believes In Giving A Voice To The People Through Powerful Storytelling And Factual Reporting.





