Greanland : ప్రపంచ పటంలో తలభాగంలో, ధ్రువపు మంచు దుప్పటి కింద నిశ్శబ్దంగా నిద్రిస్తున్న ఒక ద్వీపం ఇప్పుడు ప్రపంచ దేశాల చర్చలకు కేంద్రబిందువైంది. అదే ‘గ్రీన్‌ల్యాండ్’ (Greenland). పేరులో పచ్చదనం ఉన్నా, ఒళ్ళంతా మంచును నింపుకున్న ఈ భూభాగం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యూహాత్మక లక్ష్యంగా మారింది. వెనిజులా తర్వాత అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటుందన్న ప్రచారం కేవలం ఊహాగానం కాదు, దాని వెనుక కొన్ని దశాబ్దాల భౌగోళిక రాజకీయ వ్యూహం దాగి ఉంది..
గ్రీన్‌ల్యాండ్ (Greenland): విలక్షణమైన భౌగోళిక స్వరూపం
గ్రీన్‌ల్యాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. సుమారు 21.6 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ ప్రాంతంలో 80 శాతానికి పైగా భూభాగం 3 కిలోమీటర్ల మందం కలిగిన మంచు పొరతో కప్పబడి ఉంటుంది. ఇదొక నిశ్శబ్ద సామ్రాజ్యం. ఇక్కడ మనుషుల కంటే ప్రకృతికే ఎక్కువ హక్కులు ఉంటాయి. జనాభా కేవలం 56,000 మాత్రమే. నగరాల మధ్య రోడ్లు ఉండవు. ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్లాలంటే కుక్కల స్లెడ్జిలు, పడవలు లేదా చిన్న విమానాలే దిక్కు. ప్రపంచంలో అంటార్కిటికా తర్వాత రెండో అతిపెద్ద ఐస్ షీట్ ఇక్కడే ఉంది. ఒకవేళ గ్రీన్‌ల్యాండ్ మంచు మొత్తం కరిగితే, ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు 7 మీటర్ల మేర పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంటే న్యూయార్క్, లండన్, ముంబై వంటి నగరాలు సముద్రంలో కలిసిపోతాయి.
చారిత్రక నేపథ్యం: డెన్మార్క్ (Denmark) హక్కులు – అమెరికా ఆశలు
గ్రీన్‌ల్యాండ్ భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండానికి అనుకుని ఉన్నప్పటికీ, చారిత్రక కారణాల వల్ల ఐరోపా దేశమైన డెన్మార్క్ పాలనలో ఉంది. వైకింగ్‌ల కాలం నుండి అంటే 10వ శతాబ్దంలో వైకింగ్‌లు ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుండి ఇది ఐరోపా ప్రభావంలో ఉంది. 1814లో ఇది అధికారికంగా డెన్మార్క్ వలస ప్రాంతంగా మారింది. 1979లో గ్రీన్‌ల్యాండ్‌కు హోమ్ రూల్ అంటే స్వయంపాలన లభించింది. 2009 నుండి ఇది డెన్మార్క్ పరిధిలోని ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన భూభాగంగా కొనసాగుతోంది. దీనికి సొంత పార్లమెంట్, సొంత భాష గ్రీన్‌లాండిక్ ఉన్నాయి. కానీ రక్షణ, విదేశీ వ్యవహారాలు మాత్రం డెన్మార్క్ చూసుకుంటుంది. అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ను కోరుకోవడం ఇదే మొదటిసారి కాదు. 1867లో ఆండ్రూ జాన్సన్ ప్రభుత్వం, 1946లో హ్యారీ ట్రూమాన్ ప్రభుత్వం 100 మిలియన్ డాలర్ల బంగారానికి ఈ ద్వీపాన్ని కొంటామని డెన్మార్క్‌కు ఆఫర్ ఇచ్చాయి. కానీ డెన్మార్క్ తిరస్కరించింది.
అమెరికాకు గ్రీన్‌ల్యాండ్ ఎందుకంత కీలకం?
డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గ్రీన్‌ల్యాండ్‌ను ఒక పెద్ద రియల్ ఎస్టేట్ డీల్ గా అభివర్ణించారు. దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.
1.అపారమైన ఖనిజ నిక్షేపాలు (The Buried Treasure)
గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి శాపమైతే, గ్రీన్‌ల్యాండ్‌కు అది ఆర్థిక అవకాశంగా మారుతోంది. మంచు కరుగుతున్న కొద్దీ కింద ఉన్న సంపద బయటపడుతోంది.
2.రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (Rare Earth Elements – REE):
ఆధునిక సాంకేతికతకు మూలస్థంభాలైన చిప్స్, ఈవీ బ్యాటరీస్, శాటిలైట్స్ తయారీకి అవసరమైన 17 రకాల అరుదైన మూలకాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం వీటిపై చైనాకు 90% పైగా ఆధిపత్యం ఉంది. గ్రీన్‌ల్యాండ్ అమెరికా వశమైతే, చైనా గుత్తాధిపత్యానికి అమెరికా చెక్ పెట్టవచ్చు. గ్రీన్‌ల్యాండ్ మంచు కింద దాగి ఉన్న ఖనిజాలు భవిష్యత్తు ప్రపంచాన్ని శాసించబోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం గ్రీన్ ఎనర్జీ (ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్) వైపు మళ్లుతోంది. ఈ పరివర్తనకు అవసరమైన ముడి పదార్థాలు గ్రీన్‌ల్యాండ్‌లో అపారంగా ఉన్నాయి. ఇక్కడ లభించే నియోడైమియం (Neodymium), ప్రాసోడైమియం (Praseodymium), డిస్ప్రోసియం (Dysprosium), టెర్బియం (Terbium) తదితర ఖనిజాలను ఎలక్ట్రిక్ కార్ల మోటార్లు, విండ్ టర్బైన్లు, స్మార్ట్‌ఫోన్లు, యుద్ధ విమానాల తయారీలో వీటిని వాడుతారు. ప్రస్తుతం వీటి సరఫరాలో 90% చైనా చేతుల్లోనే ఉంది. గ్రీన్‌ల్యాండ్‌లో ఉన్న క్వానెఫ్‌జెల్డ్ (Kvanefjeld) అనే ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద రేర్ ఎర్త్ నిల్వలు ఉన్నాయి. వీటిని పొందితే అమెరికా చైనాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. గ్రీన్‌ల్యాండ్‌లో భారీ ఎత్తున యురేనియం నిల్వలు ఉన్నాయి. అణ్వాయుధాల తయారీకి, అణు విద్యుత్ కేంద్రాలకు ఇది అత కీలకం. ప్రపంచ శక్తి వనరులపై పట్టు సాధించడానికి అమెరికాకు ఇది అవసరం. ఇక నిర్మాణ రంగంలో, బ్యాటరీల తయారీలో జింక్, సీసం (Zinc & Lead) డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. గ్రీన్‌ల్యాండ్‌లోని బ్లాక్ ఏంజెల్ మైన్ వంటి ప్రాంతాల్లో వీటి నాణ్యత చాలా ఎక్కువ. ఇక పల్లాడియం, ప్లాటినం ఖనిజాలు కాలుష్య నియంత్రణ పరికరాలు (Catalytic Converters). హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ తయారీలో వీటిని వాడతారు. వీటి ధరలు బంగారం కంటే ఎక్కువగా ఉంటాయి. గ్రీన్‌ల్యాండ్ తీర ప్రాంతాల్లో సుమారు 50 బిలియన్ బారెల్స్ చమురు ఉన్నట్లు అంచనా. ఇది సౌదీ అరేబియా నిల్వలతో సమానం.
3.సైనిక ప్రాధాన్యత (Military Dominance)
శీతల యుద్ధ కాలం నుండి అమెరికాకు గ్రీన్‌ల్యాండ్‌లో ‘తూలే ఎయిర్ బేస్’ ఉంది. ప్రస్తుతం దీని పేరును ‘పిటుఫిక్ స్పేస్ బేస్’ (Pituffik Space Base) గా మార్చారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఉత్తరాన ఉన్న అమెరికా సైనిక స్థావరం. గ్రీన్‌ల్యాండ్ పటంలో చూస్తే, ఇది ఆర్కిటిక్ సర్కిల్‌కు పైన, ఉత్తర ధ్రువానికి కేవలం 1500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రష్యా నుండి అమెరికా వైపు వచ్చే క్షిపణులను ఉత్తర ధ్రువం మీదుగానే గుర్తించాల్సి ఉంటుంది. తూలే బేస్ లో ఉన్న రాడార్ వ్యవస్థ అమెరికా జాతీయ భద్రతకు వెన్నెముక వంటిది. రష్యా తన ఉత్తర సరిహద్దుల్లో సైనిక స్థావరాలను పెంచుతోంది. గ్రీన్‌ల్యాండ్ అమెరికా చేతుల్లో ఉంటే, ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా దూకుడును అడ్డుకోవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా ఈ స్థావరాన్ని నిర్మించింది. 1951లో డెన్మార్క్-అమెరికా రక్షణ ఒప్పందం ద్వారా ఇది అమెరికా ఆధీనంలోకి వచ్చింది. శీతల యుద్ధం (Cold War) సమయంలో రష్యా (అప్పటి సోవియట్ యూనియన్) నుండి వచ్చే అణ్వాయుధ క్షిపణులను గుర్తించడానికి ఇది ప్రధాన కేంద్రంగా పనిచేసింది. ఇక్కడ అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (BMEWS) ఉంది. రష్యా భూభాగం నుండి అమెరికా వైపు ఏవైనా క్షిపణులు దూసుకొస్తే, అవి ఉత్తర ధ్రువం మీదుగానే రావాలి. వాటిని క్షణాల్లో గుర్తించి వాషింగ్టన్‌ను అప్రమత్తం చేసే శక్తి ఈ బేస్‌కు ఉంది. ఇక అంతరిక్ష నిఘా కూడా కీలకం. ఇప్పుడు దీనిని స్పేస్ ఫోర్స్ (Space Force) నిర్వహిస్తోంది. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలను పర్యవేక్షించడానికి, అంతరిక్షం నుండి వచ్చే ముప్పులను కనిపెట్టడానికి ఇది అమెరికాకు ఒక కన్ను లాంటిది. గ్రీన్‌ల్యాండ్ గనుక అమెరికా వశమైతే, తూలే బేస్ వంటి మరిన్ని స్థావరాలను నిర్మించుకోవచ్చు. దీనివల్ల ఆర్కిటిక్ సముద్రంలో రష్యా జలాంతర్గాముల కదలికలను అమెరికా పూర్తిగా నియంత్రించగలదు. ఆర్కిటిక్ మంచు కరగడం వల్ల నార్త్ వెస్ట్ పాసేజ్ అనే కొత్త సముద్ర మార్గం ఏర్పడుతోంది. దీనివల్ల ఆసియా నుండి యూరప్‌కు ప్రయాణ దూరం భారీగా తగ్గుతుంది. ఈ మార్గంలో గ్రీన్‌ల్యాండ్ ఒక టోల్ గేట్ లాంటిది. ఇక్కడ నియంత్రణ సాధించిన దేశమే భవిష్యత్తు ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తుంది.
ట్రంప్ (Donald Trump) వ్యూహం
వెనిజులాలో అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నించిన ట్రంప్, ఇప్పుడు తన దృష్టిని గ్రీన్‌ల్యాండ్‌పై సారించారు. దీనిని ఆయన భూభాగ విస్తరణ వ్యూహంగా చూస్తున్నారు. అమెరికా ఆర్థికంగా గ్రీన్‌ల్యాండ్‌ను ఆదుకుంటామని, డెన్మార్క్ (Denmark) ఇచ్చే గ్రాంట్ కంటే ఎక్కువ ఇస్తామని ఆశ చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం డెన్మార్క్ ఏటా 5000 కోట్ల సాయాన్ని గ్రీన్ లాండ్ కు చేస్తోంది. అమెరికా ఇప్పుడు అంతకుమించిన సాయం చేస్తామని ఆఫర్ చేసే అవకాశం ఉంది. తద్వారా డెన్మార్క్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసి, గ్రీన్‌ల్యాండ్‌ను తన రక్షణ గొడుగు కిందకు తెచ్చుకోవాలనేది ట్రంప్ అసలు ఆలోచన. గ్రీన్‌ల్యాండ్ ప్రజలలో డెన్మార్క్ నుండి విడిపోవాలనే ఆకాంక్ష ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని అమెరికా వారికి పూర్తి ఆర్థిక స్వేచ్ఛను వాగ్దానం చేస్తూ తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది.
డెన్మార్క్ అభ్యంతరాలు, నాటో (NATO) పరిస్థితి
ట్రంప్ ప్రతిపాదనలపై డెన్మార్క్ ప్రధాని తీవ్రంగా స్పందించారు. “గ్రీన్‌ల్యాండ్ అమ్మకానికి లేదు. ఇది ఒక అసంబద్ధమైన చర్చ” అని ఆమె కొట్టిపారేశారు. ఏ దేశమైనా తన భూభాగాన్ని అమ్ముకోవడం అంటే అది తన ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడమేనని డెన్మార్క్ భావిస్తోంది. అమెరికా, డెన్మార్క్ రెండూ నాటో సభ్యదేశాలే. ఒక నాటో దేశం మరో నాటో దేశంపై ఒత్తిడి తేవడం కూటమిలో చీలికలకు దారితీయవచ్చు. ఐరోపా దేశాలు (జర్మనీ, ఫ్రాన్స్) అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని తప్పుబడుతున్నాయి.
జియో-పాలిటిక్స్: ట్రంప్ (Donald Trump) ఎందుకంత తొందర?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్కిటిక్ రేస్’ నడుస్తోంది. దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. చైనా (China) తనను తాను “నియర్ ఆర్కిటిక్ స్టేట్” (ఆర్కిటిక్ దగ్గర దేశం)గా ప్రకటించుకుంది. గ్రీన్‌ల్యాండ్‌లో చైనా (China) తన ప్రభావాన్ని పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ‘పోలార్ సిల్క్ రోడ్’ పేరుతో గ్రీన్‌ల్యాండ్‌లో మూడు విమానాశ్రయాలు నిర్మించడానికి చైనా కంపెనీలు టెండర్లు వేశాయి. అయితే, అమెరికా ఒత్తిడి చేయడంతో డెన్మార్క్ ఆ టెండర్లను రద్దు చేసి, తానే నిధులు ఇచ్చింది. గ్రీన్‌ల్యాండ్‌లో మౌలిక సదుపాయాల పేరుతో పెట్టుబడులు పెట్టి, పరోక్షంగా ఈ ఖనిజాలను దక్కించుకోవాలని చైనా చూస్తోంది. చైనా (China) గనుక ఇక్కడ మైనింగ్ హక్కులు సాధిస్తే, అమెరికా (America) వెనుక భాగంలో (Backyard) శత్రువు కూర్చున్నట్లవుతుందని పెంటగాన్ ఆందోళన చెందుతోంది. దీనిని అడ్డుకోవడం ట్రంప్ ప్రధాన ఉద్దేశం. రష్యా ఇప్పటికే తన ఆర్కిటిక్ తీరం వెంబడి పాత సైనిక స్థావరాలను పునరుద్ధరించింది. అణు సామర్థ్యం ఉన్న జలాంతర్గాములను అక్కడ మోహరించింది. దీనికి దీటుగా అమెరికాకు గ్రీన్‌ల్యాండ్ ఒక శాశ్వతమైన ‘విమాన వాహక నౌక’ (Unsinkable Aircraft Carrier) లాంటిది. గతంలో మంచు వల్ల మైనింగ్ చేయడం అసాధ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు మంచు కరుగుతుండటంతో, తక్కువ ఖర్చుతో ఖనిజాలను వెలికితీయడం సాధ్యమవుతోంది. అందుకే ఇప్పుడు గ్రీన్‌ల్యాండ్ ఒక “హాట్ కేక్” లా మారింది.
గ్రీన్‌ల్యాండ్ (Greenland) స్వాధీనం సాధ్యమేనా?
చట్టబద్ధంగా చూస్తే ఒక దేశం మరో దేశాన్ని కొనుగోలు చేయడం అసాధ్యం కాదు (1867లో రష్యా నుండి అలాస్కాను కొన్నట్లు). కానీ ప్రస్తుత ప్రజాస్వామ్య యుగంలో గ్రీన్‌ల్యాండ్ ప్రజల అనుమతి లేకుండా ఇది జరగదు. గ్రీన్‌ల్యాండ్ ప్రజలు డెన్మార్క్ నుండి స్వాతంత్ర్యం కోరుకుంటున్నారు కానీ, అమెరికాలో కలవాలని అనుకోవడం లేదు. అమెరికా ఒకవేళ డెన్మార్క్‌ను భారీ ఆఫర్లతో ఒప్పించినా, అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల సంఘాలు దీనిని వ్యతిరేకిస్తాయి.
గ్రీన్‌ల్యాండ్ ఇకపై కేవలం మంచు గడ్డ కాదు. అది ఒక వ్యూహాత్మక బంగారం. అమెరికా (America) అధ్యక్షుడు ట్రంప్ చూపు ఈ ద్వీపంపై పడటం వెనుక రాబోయే 50 ఏళ్ల ప్రపంచ రాజకీయాలను శాసించే ప్రణాళిక ఉంది. అపారమైన ఖనిజాలు, సైనిక ఆధిక్యం, మారుతున్న సముద్ర మార్గాలు గ్రీన్‌ల్యాండ్‌ను ఆర్కిటిక్ కిరీటంగా మార్చాయి. డెన్మార్క్ అభ్యంతరాలు, నాటో దేశాల వ్యతిరేకత మధ్య ట్రంప్ ఈ బిగ్ డీల్ ను ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవేళ అమెరికా తన పట్టు సాధిస్తే, ప్రపంచ శక్తి సమీకరణలు పూర్తిగా మారిపోవడం ఖాయం. కానీ ఈ రాజకీయ చదరంగంలో ప్రకృతి పంపుతున్న హెచ్చరికలను విస్మరిస్తే, రేపు గ్రీన్‌ల్యాండ్ తో పాటు ప్రపంచంలోని తీర నగరాలన్నీ చరిత్రలో కలిసిపోయే ప్రమాదం ఉంది.

A Passionate Telugu Writer Covering Politics, Public Voice, And Current Affairs With Clarity And Insight. Dedicated To Presenting Unbiased Perspectives Rooted In Truth And Regional Relevance. Believes In Giving A Voice To The People Through Powerful Storytelling And Factual Reporting.
















