YS Jagan : విశాఖ గూగుల్ డేటా సెంటర్‌పై వైసీపీ యూటర్న్.. కేడర్ షాక్..!!

YS Jagan : విశాఖపట్నంలో ప్రతిపాదిత గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుపై వైయ్యస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) గతంలో తీసుకున్న వ్యతిరేక వైఖరిని అకస్మాత్తుగా మార్చుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నిన్నటివరకూ ఈ ప్రాజెక్టును వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్ వచ్చింది. అయితే ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్‌లో దానిని స్వాగతించడం, ఆ క్రెడిట్‌ను తమకే దగ్గాలనేలా మాట్లాడడం గమనార్హం.

గూగుల్ డేటా సెంటర్‌పై (Google Data Centre) గూగుల్ తో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి వైసీపీ, ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా, మీడియా విభాగాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ కథనాల్లో ప్రధానంగా ఈ డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని, విశాఖపట్నానికి కరెంటు, నీటి కొరత వస్తుందని ప్రచారం జరిగింది. అంతేకాక దానిని ‘పెద్ద గోడౌన్’గా అభివర్ణించడమే కాక, దీని వల్ల కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని, రాష్ట్రానికి పెద్దగా మేలు జరగదని వాదించారు. ఇది ‘అదానీ డేటా సెంటర్’ అని, గూగుల్‌కు చిన్న భాగస్వామ్యం మాత్రమే ఉందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో వైసీపీ స్టాండ్ ఇదేనని, రాష్ట్రంలో పెట్టుబడులకు ఆ పార్టీ వ్యతిరేకమని అనేక మంది భావించారు. గతంలో జగన్ హయాంలో పలు కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళడం, తాజాగా ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని జగన్ ప్రకటించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ భయం మరింత పెరిగింది.

జగన్ యూ టర్న్

అయితే ఈ విమర్శలు, వ్యతిరేక ప్రచారానికి విరుద్ధంగా, ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గూగుల్ డేటా సెంటర్‌ను స్వాగతించారు. అంతేకాక, ఈ ప్రాజెక్టుకు బీజం వేసింది, అదానీతో ఒప్పందం చేసుకుని శంకుస్థాపన చేసింది తమ ప్రభుత్వమేనని ఆయన ప్రకటించారు. 2022 అక్టోబర్‌లో అదానీ, గూగుల్ మధ్య ఒప్పందం కుదిరిందని, 2023 మే 3న విశాఖలో ఫౌండేషన్ స్టోన్ వేశామని, సింగపూర్ నుంచి సబ్‌సీ కేబుల్‌కు అంకురార్పణ చేశామని వివరాలను వెల్లడించారు. డేటా సెంటర్లలో ఉద్యోగాలు తక్కువే అయినప్పటికీ, విశాఖలో ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందుతుందని కూడా ఆయన అంగీకరించారు. ప్రాజెక్టు క్రెడిట్‌ను తమకు దక్కకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని, అందుకోసమే అదానీ పేరు దాచిపెట్టారని విమర్శించారు. చంద్రబాబుకు సిగ్గు, లజ్జ లేవంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు.

జగన్ ప్రకటనతో ఇన్నాళ్లూ గూగుల్ డేటా సెంటర్‌ను వ్యతిరేకిస్తూ వార్తలు వండి వార్చిన వైసీపీ నేతలు, సోషల్ మీడియా విభాగం, ఆ పార్టీ అనుకూల మీడియా ఉలికిపాటుకు, షాక్‌కు గురయ్యాయి. నాయకుడు తీసుకున్న యూటర్న్‌తో వారు తమ పూర్వపు కథనాలను, వాదనలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్రానికి మేలు

అయితే జగన్ వైఖరిలో వచ్చిన ఈ మార్పు కచ్చితంగా రాష్ట్రానికి మేలు చేస్తుందని మాత్రం చెప్పొచ్చు. పెట్టుబడులకు, పారిశ్రామికాభివృద్ధికి వైసీపీ వ్యతిరేకమన్న అపవాదును తొలగించడానికి ఈ తాజా ప్రకటన కొంతవరకు దోహదపడుతుంది. కీలకమైన ఒక అంతర్జాతీయ స్థాయి పెట్టుబడి ప్రాజెక్టును ప్రతిపక్షం కూడా స్వాగతించడం అనేది భవిష్యత్తులో ఇతర ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అయితే, ఈ ప్రాజెక్టు క్రెడిట్‌ను తమకు దక్కించుకునే క్రమంలోనే జగన్ దీన్ని స్వాగతించారని కూడా భావించవచ్చు.

Leave a Comment